కార్మిక భవన కథన రంగంలోకి కాంగ్రెస్?!
-ఆ క్రెడిట్ తామే కొట్టేయాలని తహతహ
-ఇక ప్రముఖ నేతలదే ముఖ్య భూమిక
-ఈ పండుగ తర్వాత…ప్రత్యేక సమావేశం
-తెర ముందుకు ప్రత్యక్ష కార్యాచరణ
-కొనసాగుతున్న లక్ష సంతకాల సేకరణ
కొండా దంపతులు మౌనముద్ర దాల్చిన నేపథ్యంలో..ఇక కార్మిక భవన… కథన రంగంలోకి కాంగ్రెస్ దూకుతోందా? ఆ పార్టీ ప్రముఖ నేతలే ముఖ్య భూమిక పోషించడానికి సిద్ధమయ్యారా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. ఈ సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు కొందరు ప్రత్యక్షంగా అజంజాహీ మిల్లు కార్మిక భవన పరిరక్షణకు నడుం బిగించనున్నారు. అంతేకాదు లక్ష సంతకాల సేకరణ జరుగుతుండగానే, ఒకటి రెండు రోజుల్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని ఒక కార్యాచరణకు రెడీ అవుతున్నారు.
స్వాతంత్ర్యయానికి ముందే 1932లోనే 10వేల మంది కార్మికుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించిన అజంజాహీ మిల్లు కాల క్రమంలో నష్టాల బాటపట్టి మూసివేసే దశకు చేరుకుంది. 202 ఎకరాల స్థలం చివరకు 35 ఎకరాలకు మిగిలింది. అది కూడా వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించగా, ప్లాట్లు చేసి అమ్మేశారు. కార్మికుల కుటుంబాలకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు. కానీ అమలు కాలేదు. అజంజాహీ కి ఆఖరి గుర్తుగా మిగిలిన కార్మిక భవన స్థలాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానిక ప్రజా ప్రతినిధి ప్రమేయంతో ఓ వ్యక్తి ద్వారా ఓ బడా వ్యాపారికి అమ్మేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలంలోనే కార్పొరేషన్ పర్మీషన్ తీసుకుని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆ కాంప్లెక్స్ నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టడం, భవనాన్ని కూల్చే ప్రయత్నంలోనే…సమస్య మొదలైంది. మిల్లు కార్మిక కుటుంబాలు భగ్గుమన్నాయి. వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నట్లు తనకు తెలియదని కొండా మురళి సర్దుకున్నారు. కానీ, కార్పరేషన్ ఇచ్చిన పర్మీషన్ ను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ ను కాన్సిల్ చేయాలని, అదే స్థలంలో కొత్త కార్మిక భవనాన్ని నిర్మించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మొదట అజం జాహీ మిల్లు కార్మిక భవన పరిరక్షణకు మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, ప్రజా సంఘాలు, కమలదళం, కమ్యూనిస్టులు ఉద్యమించారు. లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. లక్ష సంతకాల సేకరణ సందర్భంగా బిజెపి నేతలు క్రియాశీలకంగా కనిపించడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ విషయమై ఆరా తీయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కార్మిక భవన పరిరక్షణకు కార్మికుల పక్షపాతులుగా కమ్యూనిస్టులు కాలు దువ్వారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్మిక భవన కథన రంగంలోకి దిగనుండటం మరింత ఆసక్తిగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మిల్లు స్థలం ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త కొండా మురళి షాపింగ్ కాంప్లెక్స్ కి కొబ్బరి కాయ కొట్టి, ఆ పొరపాటును గ్రహపాటుగా చెప్పి గప్ చుప్ గా ఉండిపోయారు. తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇదే ఊతంగా ఉద్యమంగా మారి ఉధృతమైంది. అఖిల పక్షాలు, వామపక్షాలు, ప్రజాపక్షాలు కార్మిక పక్షం వహిస్తుండటంతో కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్న(?) పక్షంగా మారింది. క్రీయాశీల నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రి సురేఖ దంపతులు నిష్ర్కియాపరం కావడంతో విపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మిల్లు కార్మికుల కుటుంబాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
ప్రభుత్వంతోపాటు, పార్టీ పరువు ప్రతిష్టలను కాపాడడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. ఇప్పటి దాకా మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణకు తెరవెనుక పని చేసిన వారంతా తెరముందుకు రావాలని నిర్ణయించకున్నారు. మిల్లు కార్మిక భవన స్థలం అన్యాక్రాంతం కావడానికి కారణాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకుని, సాక్ష్యాధారాలతో సీఎం రేవంత్ రెడ్డికి నివేదించారు.
మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు, మంత్రి కొండా సురేఖ దంపతులకు సంబంధం లేకుండానే, నేరుగా, స్వతంత్రంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. ఈ పండుగ తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ఒక కార్యచారణ సిద్ధం చేయనున్నారు.
కాగా, ఈ స్థలం పై తాము ఇచ్చిన అనుమతులపై దిద్దుబాటుకు దిగింది వరంగల్ మహానగర కార్పొరేషన్. డిసెంబర్ 31వ తేదీననే ఈ స్థలంపై ఇచ్చిన అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని సదరు బడా వ్యాపారికి కమిషనర్ నోటీసులు ఇచ్చారు. 15 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కోర్టు కేసు తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో ఏ విధంగా స్పందించాలి? అనే అంశాలపై కలెక్టర్ సహా సంబంధిత అధికారులను కలిసేందుకు రెడీ అవుతున్నారు. ఎలాగూ కార్మిక భవన స్థల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యమం ఏ రూపం తీసుకున్నా ఆ స్థలాన్ని ప్రభుత్వం పరిరక్షించాల్సిందే. ప్రభుత్వంలో ఉండీ ఆ క్రెడిట్ మరెవ్వరో కొట్టేస్తుంటే చేతులు ముడుచుకు కూర్చోవడం కంటే, “చేయి ” ఎత్తి జై కొట్టాలని, ఆ క్రెడిట్ ని తమ, తమ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు ప్రముఖులు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అజం జాహి మిల్లు కార్మిక భవన స్థల వివాదం రసవత్తరంగా మారింది.