టార్గెట్ ఎవరు !?
-సీఎం రేవంతా? మంత్రి పొంగులేటా?
-ఆ అసమ్మతి భేటీకి కారణాలేంటి?
-ఆ ఎమ్మెల్యేల వెనుక ఉంది ఎవరు?
-ఆ ఎమ్మెల్యేల బలమెంత? బలగం ఎంత?
-ఇది ఫార్మాలిటీ డిన్నరా? లేక పన్నాగమా?
-ప్రతిపక్ష ప్రాబల్య మీడియాలో వెల్లడి కావడంతో అనుమానాలు
-స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ… ఏమిటీ గోల?
-కాంగ్రెస్ పార్టీలో మొదలైన కల్లోలం!?
-సమావేశం నిజమే కానీ, అందులో ఆ విషయం లేదని ధృవీకరించిన మల్లు రవి
-ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు మహేష్
-ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశం
ఈ ప్రభుత్వానిది మున్నాళ్ళ ముచ్చటే! ఆరు నెలలు ఉంటేనే మహా…!! ఆ తర్వాత అధికారం మాదే! ప్రతిపక్షాలు అత్యాశను, అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్, తన కల్చర్ కు భిన్నంగా, ఐక్యంగా ఏడాది పాలనను ముగించడం విశేషమే! నిండుకున్న బొక్కసాన్ని సర్దుకుంటూ, బొక్కబోర్లా పడ్డ పాలనను సవరించుకుంటూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఈ తక్కువ కాలంలోనే గాడిలో పెట్టడం కత్తిమీద సామే. ఆ సామును అసామాన్యంగా, అసాధారణంగా నిర్వహిస్తున్న సీఎంకు ఆ కొందరు ఎమ్మెల్యేల భేటీ ఆశనిపాతంలా ఎదురైంది. వెంటనే నష్ట నివారణ చేపట్టారు. సమావేశం నిజమే కానీ, అందులో ఆ విషయం లేదని ఎంపీ మల్లు రవి ధృవీకరించగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. హుటాహుటిన సమావేశమై ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పోటాపోటీగా అనేకమంది సీనియర్లు, జూనియర్లు ఎన్నో ఆశలు, అత్యాశలు, గిల్లి కజ్జాలు… ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన హామీల ఆశల పల్లకీలో ప్రజలు, ఆ హామీలను అమలు చేసేదాకా వెంటాడుతున్న ప్రతిపక్షాలు, అటు హై కమాండ్… ఇటు జనం డిమాండ్… ఖాళీ ఖజానా మధ్య పరిపాలనను చేపట్టిన రేవంత్, అందరి అంచనాలకు మించి ఏడాది పూర్తి చేశారు. కాంగ్రస్ తన కల్చర్ కు భిన్నంగా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించడమే కాదు. ఐక్యంగా ఆయన నేతృత్వంలో ఏడాదిగా సాగుతున్నారు. కానీ, నిన్న శుక్రవారం రాత్రి అధికార పార్టీకి చెందిన, అదీ రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ ఆ పార్టీలోనే కాదు..తెలంగాణ రాజకీయాల్లోనూ కలకలం రేపింది.
అసలు ఎందుకు భేటీ అయ్యారు?
అది తిరుగుబాటా? తిరుగుబావుటానా? వారి టార్గెట్ ఏంటి? సీఎమ్మా? లేక మంత్రి పొంగులేటా? ఆ అసమ్మతికి కారణాలేంటి? ఆ ఎమ్మెల్యేల వెనుక ఎవరు ఉన్నారు? వారి బలమెంత? బలగం ఎంత? స్థానిక, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ… ఈ గోల ఏంటీ? అన్న చర్చ జోరందుకుంది. పైగా ఈ భేటీ అంశం బిఆర్ఎస్ ప్రాబల్య మీడియాలోనే మొదట వెల్లడి కావడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. నష్ట నివారణకు నివారణకు నడుం బిగించారు.
ఆ ఎమ్మెల్యేలు – ఎవరి గోల వారిదే?
అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భేటీ అయినట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మొదట 10 అనుకున్నా, చివరకు ఎంపీ మల్లు రవి క్లారిటీతో 8 గా తేలింది. అందులో ప్రచారమైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు తాను ఢిల్లీలో ఉన్నానని, ఒక వీడియో రిలీజ్ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, కానీ తను వెళ్ళ లేదని తేల్చారు. మిగతా వారు తాము ఆ భేటీలో ఉన్నామని చెప్పకపోయినా, లేమని మాత్రం ప్రకటించలేదు! భేటీలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న, ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు, వారి సమస్యలను ఒకసారి పరిశీలిద్దాం.
1. భూపతిరెడ్డి – నిజామాబాద్ రూరల్ : టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఇదే నియోజకవర్గానికి చెందిన వారు. ఆయన ఆ పదవిలో ఉండటంతో అంతా ఆయన దగ్గరకే వెళుతున్నారు. పదవులు, పనులు ఆయన చెప్పిన వారికే అవుతున్నాయి.
2. యెన్నం శ్రీనివాస్ రెడ్డి – మహబూబ్ నగర్ : ఎపి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం సమస్య. నియోజకవర్గంలో జితేందర్ కొడుకు ప్రమేయం పెరగడం వల్ల తన విలువ తగ్గుతున్నది.
3. మురళీ నాయక్ –మహబూబాబాద్ : సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఇదే. గతంలో ఆయన ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే. ఆయన తరచూ వస్తుండటం ఒక ఇబ్బంది. కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్న బిగ్ టీవీ బ్రదర్స్ తమదే నడవాలని పట్టు పడుతుండటం, నేరుగా జోక్యం చేసుకోవడం రెండో ఇబ్బంది.
4. కూచకుళ్ళ రాజేశ్ రెడ్డి – నాగర్ కర్నూలు: తను ఎమ్మెల్యేగా, తన తండ్రి కూచకుళ్ళ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మంత్రి జూపల్లిని భరించలేని పరిస్థితి.
5. సంజీవరెడ్డి – నారాయణఖేడ్ : ఆందోల్ పక్క నియోజకవర్గం మంత్రి దామోదర్ రాజనర్సింహది కావడం, రాజనర్సింహ రాజకీయ జోక్యంతో ఇబ్బందులు.
6. అనిరుధ్ రెడ్డి – జడ్చర్ల : తన రాజకీయ గురువులు కోమటిరెడ్డి బ్రదర్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్నది ఆశ. మంత్రి పొంగులేటికి తన ప్రత్యర్థి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బంధువు. అనేక భూ సమస్యలు పెండింగ్ లో ఉండటం, ఇప్పటికే పలు సార్లు పొంగులేటిని కలిసినా పనులు కాలేదు. పొంగులేటి వైఖరి ఎప్పటికైనా తనకు ముప్పేనని భావిస్తున్నారు.
7. దొంతి మాధవరెడ్డి – నర్సంపేట : చివరి దాకా తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని, గెలిచాక మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతో గెలిచిన తర్వాత కూడా సీఎం రేవంత్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.
8. బీర్ల అయిలయ్య – ఆలేరు : మొదటిసారి ఎన్నికైనప్పటికీ ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చారు. మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
ఆశలు మాత్రమే ఉన్నాయి… నిధుల్లేవ్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇందులో ఆరు నెలల కాలం హానీమూన్ పీరియడ్ లా గడిచిపోయింది. గత ఆరేడు నెలల నుంచి ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు తప్ప మరే ఇతర నిధులు రాలేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దాదాపు ఏడాదిగా లేవు. ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి చేసిన పనేమీ కనిపించడం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు, ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రులను నిధులు అడిగితే వట్టి చేతులు ఊపుతున్నారు తప్పితే ఎంతోకొంత ఇవ్వలేకపోతున్నారు. మంత్రులు మాత్రం తమ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఇక సీఎంను అడిగితే, ఖజానా ఖాళీ అన్న ప్రకటనలే తప్ప, పెద్దగా అందుతున్న నిధులేమీ లేవు. పైగా ఆయన నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. ఇక పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లోనూ నిధుల ప్రస్థావన వచ్చినా, మంత్రులెవరూ పట్టించుకున్నపాపాన పోలేదు. పీసీసీ అధ్యక్షుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో ఎమ్మెల్యేలు నిధులు లేక తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రజలేమో గంపెడాశలతో ఉన్నారు.
పరిష్కారాలు దొరికే అవకాశం
అనుకుని లేదా అనుకోకుండానే కలిశారో కానీ, భేటీ అయిన ఎమ్మెల్యేల వల్ల కొన్ని పరిష్కార మార్గాలు మాత్రం లభించే అకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులపై ఖచ్చితమైన హామీ లభించవచ్చు. నిధులు కూడా అందవచ్చు. వారి వారి నియోజకవర్గాల్లో వారి సమస్యలకు కూడా పరిష్కారాలు దొరకవచ్చు.
అందరి టార్గెట్ పొంగులేటేనా?
అయితే, మీడియా, రాజకీయ పరిశీలకులు చేస్తున్న ఊహాగానాలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డిని కానీ, ఆయన నేతృత్వంలో నడుస్తున్న సర్కార్ ని కానీ, టార్గెట్ చేసే సాహసం, పరిస్థితి ప్రస్తుతం పార్టీలో ఉన్నదని అనుకోలేం. అయితే, ఇప్పుడు అందరి చూపు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపైనే నిలుస్తోంది. పొంగులేటి ని కంట్రోల్ చేయడానికి సీఎం కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవాళ్ళూ లేకపోలేదు. అయితే, పొంగులేటి వ్యవహార శైలి ఏకపక్షంగా ఉండటం, రెవిన్యూ సంబంధిత పనులు ఎవరివీ కాకపోవడం, ఇందులో భూములకు సంబంధించినవే ఎక్కువ ఉండటం కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి, ఇది టీ కప్పులో తుఫాన్ లా ముగుస్తుందా? లేక సుడిగాలిలా చెలరేగుతుందా? చూడాలి.

