హైదరాబాద్ గచ్చీబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులు, మనపై ఉందన్నారు. దేశ రక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాగే బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. దేశాన్ని రక్షించడంలో మన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అలాగే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారని వారిలో మార్పు రావడానికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడుతాయన్నారు. తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్ధవంతమైన ఇంజినీర్లు అందించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అలాగే దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం ఇప్పుడు మరింత అవసరమన్నారు. స్వాతంత్ర్యానికి ముందు కూడా, తర్వాత కూడా హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఎచ్‌ఎల్, మిదాని, డీఆర్‌డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయన్నారు. అలాగే దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి అని చెప్పారు. గతంలో చర్చించినట్టుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా హైదరాబాద్ కు భారీగా పెట్టుబడులు రావడంతో పాటు రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయన్నారు. అందుకోసం కేంద్ర సహకారం, మద్దతు అవసరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తామన్నారు.