ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్‌గా మార్చనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ వీఎంఆర్‌డీఏలో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని చెప్పారు. రాష్ట్రం డిజిటల్ రెవల్యూషన్ వైపు నడిచిపోతుందని, ఈ దిశలో టెక్నాలజీ అభివృద్ధి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా, డ్రోన్ల టెక్నాలజీని వివిధ సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు విశాఖకు రానున్నారని, ఆయన సుమారు 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి చెప్పారు. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ భవిష్యత్తు టెక్నాలజీ అభివృద్ధికి వేదికగా మారుతుందని, టెక్నాలజీ మాత్రమే కాదు, విజన్ కూడా ఎంతో ముఖ్యం అని ఆయన అన్నారు.
అలాగే, స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐఎఫ్ రాకింగ్‌లో ఏపీ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నా, మూడవ స్థానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలను ఎలక్ట్రానిక్ హబ్‌గా తయారుచేస్తున్నామని, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమ పై దృష్టి పెట్టామన్నారు. విశాఖను ప్రపంచ డేటా సిటిగా తయారుచేస్తామని చెప్పారు.
ఈ సదస్సులో ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీలపై చర్చలు జరుగనున్నాయి.

