చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 29 ఇండ్ల కూల్చివేత
చారకొండ గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు 29 ఇండ్లను కూల్చివేశారు. అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం గ్రామానికి చేరుకుని కూల్చివేతలు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 400 మందికి పైగా పోలీసులను మోహరించారు. అయితే, గ్రామం మధ్య నుంచి బైపాస్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బాధితులు, నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తన ఇంటిని కూల్చివేశారంటూ గిరిజమ్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి గృహనిర్బంధం చేసుకుంది. అనంతరం పోలీసులు ఆమెను బయటకు తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అధికారులు స్పందిస్తూ, ప్రభుత్వ జీవో జారీ చేసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామని స్పష్టం చేశారు.

