-పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
-రూ. లక్ష చొప్పున తొలి దశ బిల్లులు
-హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇళ్లు. మొదటగా ఇండ్ల స్థలాలున్న నిరుపేదలకు, ఆ తర్వాత స్థలాలు లేని వారికి అర్హులైన అందరికీ ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసింది. గత జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. బేస్ మెట్ దశ నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు, పైకప్పు స్థాయి దాటిన తర్వాత లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయ్యాక రూ. 2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన లక్ష రూపాయలు. ఇలా మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించాలని నిర్ణయించింది. కాగా పైలట్ ప్రాజెక్టు కింద జనగామ జిల్లాలో మొదటి విడత మొత్తం 716మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో 354మంది ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేయగా, 97మంది లబ్ధిదారులు మేస్ మెట్ దశ వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. బేస్ మెట్ దశ నిర్మాణం పూర్తి చేసుకున్న వారిలో 43మందికి లక్ష రూపాయల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఈ నెల 22 నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక

రిజ్వాన్ బాషా షేక్, జనగామ జిల్లా కలెక్టర్
జిల్లాలోని మిగిలిన గ్రామాల్లో కూడా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ లోపు మండల స్థాయి అధికారులు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి, మే 2వ తేదీన గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నాం. మే 5వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు ఇస్తాం.
సంతోషంగా ఉంది!

మారోజు రేణుక, బొమ్మకూర్, నర్మెట మండలం
ఇల్లు లేని నాకు ఇందిరమ్మ పథకం ఆదెరువైంది. నాకున్న స్థలంలోనే ఇల్లు మొదలు పెట్టాను. ఇప్పుడు లక్ష రూపాయలు కూడా నా ఖాతాలో వేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
సర్కార్ కు సలాం!

గోనె హంసమ్మ, ఎర్రగుంట తండా, జనగామ మండలం
మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. సొంత ఇల్లు ఉంటే బాగుండని అనుకునేవాళ్లం. సర్కారు పుణ్యమా అని ఇల్లు వచ్చింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు కూడా సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకుంటాం.
సీఎం సారుకు ధన్యవాదాలు!

ముదావత్ శిరీష, వాచ్యా తండా, తరిగొప్పుల మండలం
గుడిసెలో ఉంటున్నాం. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇల్లు వచ్చింది. సీఎం సార్ కి ధన్యవాదాలు. పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చిన సారు నిండూ నూరేళ్లు బతకాలి.

