ధరణితో రైతులు మోసపోయారు.
రైతుల భూ కష్టాలు తీర్చడం కోసమే ఈ భూ భారతి
పాలకుర్తి, రాయపర్తి భూ భారతి అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతుల అన్ని భూ సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. గత పాలకులు చేసిన ధరణి చట్టంతో రైతులు మోసపోయారని దుయ్యబట్టారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో, వరంగల్ జిల్లా, రాయపర్తి మండల కేంద్రంలో గల రైతు వేదికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ హక్కుల రికార్డ్ పథకం (భూ భారతి చట్టం – Record of Rights: ROR) పై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, సత్య శారదలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డులు పారదర్శకంగా నిర్వహించి, భవిష్యత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలు తొలగించి రైతులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. రైతులు తమ భూములకు సంబంధించి పూర్తి సమాచారం అందించడంతో పాటు, అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రికార్డులను నూతనంగా నమోదు చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మానస పుత్రికగా భూ భారతి నిలుస్తుందన్నారు. రైతులు ఎలాంటి అనుమానాలు లేకుండా భూమి వివరాలను అధికారులు చేపడుతున్న సర్వేల్లో సరిగ్గా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ చట్టం అమలుతో భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలకు స్థానం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రైతుల భవిష్యత్తు కోసమేనని అన్నారు.
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం అమలుతో భూములపై ఉన్న అస్పష్టత తొలగి, ఆస్తి హక్కుల బలోపేతం జరుగుతుందని పేర్కొన్నారు. డిజిటల్ రికార్డుల ఆధారంగా భూ వివరాలు అందుబాటులోకి రావడం వల్ల భూ వివాదాలు తగ్గుతాయి అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, ఈ చట్టం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో భూముల పునర్వినియోగం సమర్థంగా జరగనుందని తెలిపారు. మహిళలకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భూ హక్కుల పరిరక్షణ ఈ చట్టం ద్వారా మరింత బలపడనుందని చెప్పారు. ఈ చట్టం లక్ష్యం భూముల పునర్వినియోగం, పేదలకు భూముల హక్కులు కల్పించడం, భూ పరిపాలనలో పారదర్శకత సాధించడమేనని చెప్పారు.
ఈ సదస్సులకు రైతులు అధిక సంఖ్యలో హాజరై, వారి సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు గ్రామస్థాయిలో సర్వేలు ఎలా జరుగుతాయో, భూ నక్షా పునర్నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరించారు.
ఈ అవగాహన సదస్సులో వివిధ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ మంజుల, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు.