బీసీ రిజర్వేషన్లపై నివేదిక ప్రభుత్వానికి అందజేత
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన 700 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక చేరిన వెంటనే కేబినెట్ ఆమోదించనుంది. అనంతరం జిల్లాల కలెక్టర్లకు పంపి, గ్రామాలవారీగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రిజర్వేషన్ల గెజిట్ విడుదల చేసి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.
డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 50% లోపే ఉంచుతూ సిఫార్సులు చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు 28% రిజర్వేషన్ ఉండగా, బీసీలకు 22-23% రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలాన్ని, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని కేటాయింపులు ఖరారు చేయనున్నారు.
పద్దెనిమిది నెలలుగా స్థానిక సంస్థలు ప్రత్యేకాధికారుల చేతిలో ఉన్న నేపథ్యంలో త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఒకే దఫాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన 15 రోజుల్లో పోలింగ్ పూర్తి చేయాలని యోచిస్తున్నారు.
ఇక, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్B పరిశీలన చేపట్టింది. మొత్తం 154 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని భావిస్తోంది. తదుపరి 20 రోజుల్లో దీనిపై నివేదిక అందించనుంది.