|WARANGAL|RAMAPPA|
మన ఆత్మగౌరవం విదేశీ మహిళల పాదాక్రాంతం!?
అందగత్తెల కాళ్లు కడిగిన తెలంగాణ ఆడబిడ్డలు!
అనుచిత చర్యతో మన పరువు తీసిన నిర్వాహకులు
ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టగా తీసుకుని హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అందాల పోటీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా, ములుగు జిల్లా రామప్పను చూడటానికి వెళ్ళిన వివిధ దేశాల అందగత్తెల కాళ్లను తెలంగాణ మహిళల చేత కడిగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. బుధవారం మిస్ వరల్డ్ పోటీ కాంటెస్టెంట్లు పలువురు వరంగల్ పర్యటనకు వచ్చారు. వరంగల్ లోని వేయి స్తంభాల గుడి, కోటల, రామప్పలను సందర్శించారు. రామప్పలో పాల్గొన్న విదేశీ మోడళ్లకు ప్రత్యేక ఆతిథ్యం అందించడంలో భాగంగా, నిర్వాహకులు స్థానిక మహిళలతో మోడల్స్ కాళ్లను వెండి పల్లెంలో పెట్టించి, వెండి చెంబులతో నీళ్ళు పోయించి కడిగించారు. అనంతరం టవల్స్ తో వారి కాళ్లు తుడిపించారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నిర్వాహకుల వైనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ చర్యను రాష్ట్ర ఆత్మ గౌరవానికి, ప్రత్యేకించి మన మహిళలను దేవుళ్ళతో సమానంగా చూసే మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించినట్లయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇటువంటి కార్యక్రమం జరగడం తీవ్ర అభ్యంతరాలకు దారితీస్తోంది. మహిళల చేత విదేశీ అందగత్తెలకు పాద సేవ చేయించడాన్ని, ప్రజలే కాకుండా పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిర్వాహకుల తీరును ఎండగడుతున్నాయి.