అన్ని ఉగ్రదాడుల వెనుకా అతడే!
అతడి వెనుకే పాక్!!
భారత్ లో అన్ని ఉగ్రదాడుల వెనుక ఉన్నది ఆ ఒక్కడే..! అతడే మసూద్ అజార్. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్. ఆపరేషన్ సిందూర్‌లో మెయిన్ టార్గెట్ మహమ్మారి ఈ మసూదే! 1994 లో అరెస్టై, 1999లో విడుదలై, ఒకసారి పాక్ లో భారీ బహిరంగ సభలో, ఆర్మీ హాస్పిటల్ లో మాత్రమే కనిపించాడు. ఈ కనిపించని కర్కోటకుడు అండర్ గ్రౌండ్ నుంచే ఉగ్రవాద ఆపరేషన్స్ చేస్తున్నాడు. చేయిస్తున్నాడు. మరి ఆపరేషన్ సిందూర్ తర్వాత తన కుటుంబ సభ్యులు, బంధువుల చనిపోతే, అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ, పోలీసు భద్రత మధ్య విషణ్ణ వదనంతో కనిపించాడు. చావు తప్పి, భారత్‌పై పిచ్చి ప్రేలాపనలతో విర్రవీగిన అజార్ మసూద్ ఎక్కడున్నాడు? మసూద్‌కి రక్షణ కల్పిస్తున్నదెవరు? అసలు మసూద్ ఇప్పటి దాకా ఎక్కడ ఉన్నాడు? ఇంతకీ లేఖ విడుదల చేసింది ఎవరు అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.
న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
భారత్ ఎటాక్‌తో పాకిస్తాన్ గడ్డపై ఉగ్ర మూకలు చావు కేకలు పెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్. భారత్ రివెంజ్ ఎటాక్‌లో మసూద్ అజార్ కుటుంబం హతమైంది. మసూద్ సోదరి, మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం 14మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండని ఘోల్లున ఏడ్చిన మసూర్ అజార్, ఆ తర్వాత విర్రవీగాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇకపై జాలి చూపను అంటూ.. మరీ ఓవరాక్షన్ చేశాడు మసూద్. తను చేసిన పాపాలన్నీ మరిచిపోయి భారత్ తప్పుచేసిందన్నట్లు మాట్లాడుతున్నాడు.
నిజానికి ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ హెడ్‌క్వార్టర్ ఇదే. బహావల్‌పూర్ పాకిస్థాన్‌లో 13వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్ సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఆ సంస్థ టెర్రర్ క్యాంప్ ఉంది. దాన్ని సమాధి చేయడంతో మసూద్ అజార్ రగిలిపోతున్నాడు.
మసూద్ అజార్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి.. 2000 సంవత్సరంలో జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్‌ని 1994లో భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతడిని మట్టుబెట్టేందుకు భారత్ ఆర్మీ దూకుడు మీదుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితేంటన్నది ఎవరికీ తెలవట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడెక్కడున్నాడు? పాక్ రక్షణలోనే ఉన్నాడా? లేక మరెక్కడైనా దాక్కున్నాడా? అంతేకాదు ప్రతీకారం తప్పదన్న లేఖ అతనిదేనా? లేకపోతే ఉగ్ర గురువు పోవటంతో అతని తోకలెవరన్నా ఈ తోకాడిస్తున్నారా? అన్న డౌట్ కూడా ఉత్పన్నమవుతోంది. మరోవైపు మసూద్ అజహర్‌పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కథ మిగిలే ఉందంటూ ఆయన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.