వచ్చే డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టు పనులన్ని పూర్తి
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ పేజ్ -3 ప్యాకేజ్ 3 లో ఏర్పాటుచేసిన నూతన మోటార్ల ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పరిశీలించి, దేవాదుల నీటి పంపింగ్ ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే ఉన్న సాగునీటిపారుదల శాఖ అధికారులు, ఆస్ట్రియాకు చెందిన ఇంజనీర్ల బృందంతో మంత్రులు సమావేశమై నీటి పంపింగ్ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్. నాగరాజు , యశస్విని రెడ్డిలతో చేరుకున్నారు. దేవాదుల పైపు ద్వారా రిజర్వాయర్ లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఫేజ్ లు, అన్ని లింకులు, అన్ని మోటార్లు, అన్ని పంపులను పూర్తి చేస్తామన్నారు. ఒక పంపును ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలుగుతున్నామని అన్నారు. మరో రెండు పంపులను 15 రోజుల్లోగా ఆన్ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాజవరంలోని పంపింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న దేవాదుల, ఉమ్మడి నల్గొండలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే విధంగా సాగునీటి ప్రణాళిక రూపకల్పనతో తమ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్ పంపులు ద్వారా నీటి విడుదల కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ ప్రభుత్వం శ్రద్ధతో నెరవేరుస్తుందన్నారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దేవాదుల మూడో దశకు సంబంధించి ప్రారంభించాలనుకున్నామని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆలస్యం అయిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వలన కొంత ఆలస్యమైనప్పటికీ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులతో పనులను పూర్తి చేయించే విధంగా టెక్నికల్ ఇబ్బందులు వచ్చిన వాటన్నింటినీ అధిగమించి ఈరోజు విజయవంతంగా నీటి పంపింగ్ను చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 600 క్యూసెక్కుల నీటిని విడుదలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను ఇందిరమ్మ ప్రభుత్వం మరింత సస్యశ్యామలం చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలూ, ముఖ్యంగా రైతుల పక్షపాతి అయిన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సాగునీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.