వన్ ప్లస్ వన్ అంటే ఇదే!
ఒకటి అనుకుంటే… రెండొచ్చాయి!?
పారని పాచిక…కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పర్వం!
వీయని వీచిక… బిఆర్ఎస్ బరాబర్ బరిలో నిలవని తెలంగాణం!
అంతిమంగా రెండు చోట్ల బీజేపీనే వరించిన విజయం
ఒక చోట పిఆర్ టియు అభ్యర్థి గెలుపు గానం!
‘అడుగు’ ఆనాడే చెప్పింది.. అదే ఈనాడు నిజమైంది!
కమల దళం గెలిచింది.. ఎమ్మెల్సీల గెలుపే రుజువైంది
అండగా నిలిచిన టీచర్స్.. కలిసి వచ్చిన యువతరం
‘‘కమలంలో కథనోత్సాహం. అవుర్ ఏక్ ధక్కా.. తెలంగాణలో పక్కా? ఎర్ర పూల నేలలో కమల వికాసం సాధ్యమేనా? కాంగ్రెస్ కంచుకోటలో కాషాయ విజయం తథ్యమేనా? గులాబీ గుభాళింపు ఇక గత వైభవమే అవుతుందా!? ఆర్ఎస్ఎస్ సహకారంతో వ్యూహాత్మకంగా బిజెపి అడుగులు’’ అంటూ ‘అడుగు’ లో కొద్ది రోజుల క్రితమే వచ్చిన వరస కథనాలు నిజమేనని తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువవు చేస్తున్నాయి.
‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటీ’ అనేది సాధారణంగా నెగెటివ్. కానీ తెలంగాణలో బీజేపీకి అది పాజిటివ్ గా మారింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటి గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీకి రెండోది కలిసి వచ్చింది. అనుకోకుండానే బీజేపీకి వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్ కలిసివచ్చింది. సమాజంపై ప్రభావం చూపి, ప్రేరణ నింపగలగే ఉపాధ్యాయులు అండగా నిలిస్తే, ఉత్సాహాన్ని నింపి జోష్ ని ఉరకలెత్తించే యువతరం కలిసి వెన్నంటే వచ్చింది. పారని పాచికగా, కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పర్వం… వీయని వీచికగా, బిఆర్ఎస్ బరాబర్ బరిలో నిలవని తెలంగాణం… బీజేపీకి అనూహ్య విజయాలు అందించాయి. ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఆనాడే ‘అడుగు’ చెప్పింది. అదే నిజమైంది. ఎమ్మెల్సీల గెలుపుతో రుజువైంది.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల బిజేపి ఎమ్మెల్సీ

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయుల బిజేపి ఎమ్మెల్సీ

ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయుల PRTU ఎమ్మెల్సీ
అవును ‘అడుగు’ ఆనాడే చెప్పింది. అదే నిజమైంది. కమల దళం గెలిచింది. ఎమ్మెల్సీల గెలుపు రుజువైంది. అండగా నిలిచిన టీచర్స్. మెండుగా వచ్చిన యువతరం… ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయాలను అందించాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ జిల్లాల- ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య, ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ జిల్లాల – గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా- చిన్నమైల్ అంజి రెడ్డి గెలిచారు. వీరు బీజేపీ బలపరచిన అభ్యర్థులు. కాగా, ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్ టియు బలపరచిన పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ బలపరచిన పులి సరోత్తం రెడ్డి ఓడిపోయారు. నిజానికి బీజేపీ ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ జిల్లాల- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిస్తే చాలని భావించింది. ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ జిల్లాల – గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలుపు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటుందని అంచనా వేసింది. ఇక ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
అండగా నిలిచిన టీచర్స్
ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ జిల్లాల- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీకి టీచర్లు పూర్తి అండగా నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పరోక్షంగా బీఆర్ఎస్ లు బలపరచిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు బరిలో నిలిచినప్పటికీ టీచర్లు మాత్రం పూర్తిగా బీజేపీకే ఓట్లు వేశారు. ఇక ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అందుకు తగ్గట్లుగానే టీచర్లు పెద్దగా ఇక్కడ సహకరించలేదు.
మెండుగా కలిసి వచ్చిన యువతరం
గతానికి భిన్నంగా ఈ సారి యువత బీజేపీకి కలిసి వస్తున్నది. యువతరంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విసుగు, వెగటు కనిపిస్తున్నాయి. వారిలో జాతీయ భావంతోపాటు, హిందూత్వంపై మమకారం, మోడీ పాలనపై నమ్మకం, ఒకసారి బీజేపీకి కూడా అవకాశం కల్పించాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి.
పారని పాచిక…కాంగ్రెస్ ప్రభుత్వ ఉపాధి, ఉద్యోగాల కల్పన పర్వం
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ కి షాక్ అనే చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ, నియోజకవర్గానికి ఒక ఏటీసీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం, కొత్తగా వేలాది ఉద్యోగాలిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. స్వయంగా సీఎం ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు సానుకూలంగా రాలేదు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కలిసి కట్టుగా పని చేయలేదు.
వీయని వీచిక… బిఆర్ఎస్ బరాబర్ బరిలో నిలవని వైనం
ఇక తెలంగాణ పేటెంట్ తీసుకున్న బిఆర్ఎస్, తమ అభ్యర్థులను పోటీలో నిలపలేదు. నిలిపిన చోట కూడా ఆ అభ్యర్థుల కోసం ప్రచారం చేయలేదు. గెలిస్తే తమ ప్రతిభ, ఓడిపోతే వారి ఖర్మ! అన్నట్లుగా గాలికి వదిలేశారు. పైగా లోలోన బీజేపీకే మద్దతు పలికారని కాంగ్రెస్, కాంగ్రస్ కే మద్దతుగా నిలిచారని బీజేపీ విమర్శలకు గురయ్యారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు బరిలో ఉండగా ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పిఆర్ టియు బలపరచిన పింగిలి శ్రీపాల్ రెడ్డి గెలవడం విశేషం.
బీజేపీని నవయువతరం, మెధోపరమైన తరం బలపరుస్తున్నాయనుకునే విధంగా ఎమ్మెల్సీ ఫలితాలు ఉన్నాయి. బీజేపీ మాత్రం వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి భవిష్యత్తు మాదేనన్న దీమాను నింపాయనడంలో సందేహం లేదు.