“అడుగు” ఎక్స్క్లూజివ్
కేసుల మీద కేసులు!! ట్విస్టుల మీద ట్విస్టులు!!
అసలు అధ్యక్ష ఎన్నిక కోసమే కోర్టుకు వెళ్ళే ప్రయత్నం!
మొదటికే మోసమన్న భయంతో మొదలైన ఎన్నిక ప్రక్రియ!
మహాసభ ఏకపక్ష నిర్ణయాలపై కేసు
నిబంధనల అతిక్రమణపై సీఎంకు ఫిర్యాదు
సజావుగా ఎన్నిక కోసం ప్రభుత్వ త్రిసభ్య కమిటీ
ఉల్లంఘనల కారణంగా ఎన్నిక వాయిదా వేసిన ప్రభుత్వ కమిటీ
ప్రభుత్వ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేసిన మహాసభ
ఎన్నికలు యథావిధిగా జరుగుతాయంటూ ప్రకటన
రసవత్తరంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక
రెండు గ్రూపులుగా విడిపోయి..అయోమయంలో ఆర్యవైశ్యులు వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలే తప్ప, వాదోపవాదాలు, వాదవివాదాల జోలికి వెళ్ళరని పేరున్న ఆర్యవైశ్యులు ఇప్పుడు తీవ్ర వాదోపవాదాలే కాదు అంతకుమించిన ఆగ్రహోదగ్ర వాద వివాదాల్లో కూరుకుపోయారు. బహిర్గత రాజకీయాల్లో అంతగా బయటకు కనిపించని ఆర్యవైశ్యులు, సంఘం అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో కొట్టుకుపోతున్నారు. మన్నికగా, ఒద్దికగా ఉండే ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక వేదికగా, కేసుల మీద కేసులు పెట్టుకుంటున్నారు. అధ్యక్ష పదవి మురిపెంలో సమకాలీన రాజకీయాలను మరిపించే స్థాయి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పదేళ్ళుగా అధ్యక్ష పదవినే పట్టుకు వేళ్ళాడుతూన్న ఒక వర్గం, ప్రజాస్వామికంగా ఎన్నిక జరగాల్సిందేనని మార్పు కోరుతున్న మరోవర్గం పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. పాచికలు వేస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్న పరిశీలకులు అది ఆర్యవైశ్య మహాసభా? లేక మయసభా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
అవును. మయసభను మరిపించే స్థాయిలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్నది. ఆర్యవైశ్యుల సామాజిక సేవా సంఘంగా గుర్తింపు ఉన్న ఆర్యవైశ్య మహాసభకు అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ లోని ఉప్పల్ భాగాయత్ లో గల అత్యంత విలువైన 5 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇప్పుడు ఆ మహాసభ రాజకీయ మయసభను తలపిస్తోంది. ఎత్తులు జిత్తులు, ఎత్తులకు పై ఎత్తులతో మహాసభ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా సాగుతున్నది. 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జరుగుతున్న అధ్యక్ష ఎన్నిక ఎన్నో మలుపులు తిరుగుతున్నది. కేసుల మీద కేసులు, ట్విస్టుల మీద ట్విస్టులు సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నిక కోసమే కోర్టు మెట్లు ఎక్కాలనుకున్న వైనం విచిత్రమే. అందుకే సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైంది. అయితే, మహాసభ తప్ప, ఇతర సంఘాల్లో సభ్యులుగా ఉన్నవాళ్ళు పోటీ చేయవద్దనే కొత్త నిబంధనపై పాతకాపులు కొందరు కోర్టుకు వెళ్ళారు. ప్రస్తుత అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాం సుందర్ పోటీకి దిగారు. ఎన్నిక షెడ్యూల్ ఖరారు కాగా, మహాసభ నిబంధనలను ఉల్లంఘించి, 200 మంది సభ్యులకి ఒక రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ను నియమించిన ప్రాతినిధ్యపు ఓట్లల్లో, ఓటర్ల జాబితాను మార్చారని, బైలాస్ ని మార్చి, ఏమార్చి ఎన్నిక చేస్తున్నారంటూ శ్యాం సుందర్ తరపున నాగర్ కర్నూలు జిల్లా మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, మరికొందరు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. నేరుగా సీఎంను కలిశారు. మహాసభ ఎన్నికను సజావుగా నిర్వహించడానికి వీలుగా, ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ నియామకమే చెల్లదంటూ, మహాసభ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ లోగా మొదటి కేసుల్లో స్టే, తర్వాత స్టే సడలింపు ఆసరాగా ఎన్నికను యథావిధిగా నిర్వహిస్తామని మహాసభ ప్రతిపాదిత ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇలా… ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలను మరిపించే రీతిలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక అనేక మలుపులు తీసుకుంటున్నది.
ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వ త్రిసభ్య కమిటీ
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తూ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లేఖ నం. G/214/2025, తేదీ: 01.03.2025 ను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నియమించిన కమిటీకి సహకరించకుండా ఎన్నికలు కొనసాగించడం నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కమిటీ అభిప్రాయపడింది. మహాసభ అధ్యక్ష ఎన్నికల విషయంలో నియమ నిబంధనలు, అవసరమైన ఇతర సమాచారాన్ని ఇవ్వాలని మహాసభ నిర్వాహకులను కమిటీ కోరింది. మహాసభ కార్యాలయంలో ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిటీకి తగిన గదిని ఏర్పాటు చేయాలని సూచించింది. మహాసభ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు ఎన్. సైది రెడ్డిని ఎన్నికల అధికారిగా, ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావును మరియు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్, జిల్లా రిజిస్ట్రార్ రంగారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను మహాసభ నోటీసు బోర్డు పై అతికించడమే కాక, ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశిస్తూ, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రతిపాదించిన ఎన్నికల అధికారి చంద్ర పాల్ కి అందించింది.
కమిటీ నిర్ణయాన్ని హై కోర్టులో సవాల్ చేసిన మహాసభ నిర్వాహకులు
మరోవైపు అసలు ప్రభుత్వం నియమించిన కమిటీనే రద్దు చేయాలని ఆదేశించాలంటూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరపున హై కోర్టులో కేసు వేశారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కొరకు ప్రభుత్వం ఎన్నికల కమిటినీ నియమించిన విధానం, ఎన్నికను వాయిదా వేస్తూ ఆ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. సహజ న్యాయ సూత్రాలను విరుద్ధంగా ఉందని, భారత రాజ్యాంగ ఆర్టికల్ 14, 21 లను ఉల్లంఘించినట్లుగా ఉన్నదని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ ఆక్ట్ 2001 కు విరుద్ధంగా ఉన్నదనీ అందువల్ల రెండింటినీ “సెట్ ఎ సైడ్” చేయమని కోరుతూ ఆర్యవైశ్య మహాసభ తరుపున హై కోర్టులో కేసు (కేసు నంబర్ డబ్యూపీ 6290/2025) దాఖలు అయ్యింది. ఈ కేసును మహాసభ ప్రతినిధిగా ఆ సభ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రేణుకుంట్ల గణేష్ గుప్త వేశారు. ఈ కేసు తేదీ: 3-3-2025 కు లిస్టింగ్ అయ్యింది.
ఎన్నికలు యథావిధిగా నిర్వహిస్తామంటున్న మహాసభ ప్రతిపాదిత అధికారి
ఇంకోవైపు అర్యవైశ్య మహాసభ నియమించిన ఎన్నికల అధికారి పొదుపునూరి చంద్రపాల్ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు. హైదరాబాద్ సిటీ సీవిల్ కోర్టు 3వ అడిషనల్ చీఫ్ జడ్జి తేదీ: 18-02-2025న యధాతథ స్థితి (స్టేటస్కో)ని కొనసాగించాలని ఇచ్చిన ఆదేశాలు, ఇదే విషయంలో అదే జడ్చి, తేదీ: 27-02-2025న స్టేటస్కోని ఎత్తివేస్తూ, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయమని, ఫలితాలను ప్రకటించకుండా సీల్డు కవర్ లో ఉంచవలసిందిగా ఇచ్చిన ఆదేశాలను ఉటంకిస్తూ, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, ఎన్నికల ప్రక్రియను స్క్రూటినీతో ప్రారంభించి, ముగిస్తామని ప్రకటించారు.
అంతకుముందే మరికొన్ని కేసులు
అంతకుముందు మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఆర్యవైశ్య మహాసభ కాకుండా ఇతర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వంటి సంస్థల్లో ఉన్నవారు అధ్యక్ష ఎన్నికకు అనర్హులన్న ఆర్యవైశ్య మహాసభ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు.
అసలు ఎన్నిక కోసమే కోర్టుకు వెళ్ళాలని ప్రయత్నాలు
11 ఏండ్ల కింద తెలంగాణ ఆవిర్భావానికి ముందు టీజీ వెంకటేశ్ జోక్యంతో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమైంది. సభ నిబంధనల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి ఎన్నిక జరగాలి. కానీ, ఆ నాటి నుంచి అదే అభ్యర్థి రకరకాల కారణాలతో మహాసభకు ఎన్నిక జరగకుండా జాగ్రత్త పడుతూ, అదే పదవిలో కొనసాగుతున్నారు.అనేది ఆయన ప్రత్యర్థుల ఆరోపణ. అయితే సభ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరగాల్సిందేనని మరో వర్గం పట్టుపట్టింది. ఎంతకూ వీలు కాకపోవడంతో, కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. కోర్టు ఆదేశిస్తే, శిరసావహించాల్సి వస్తుందన్న భయంతోపాటు, అధ్యక్ష పదవిలో ఉండగానే, మళ్ళీ పవర్ దక్కించుకోవడం ఈజీ అన్న ముందుచూపుతో ఎన్నికల ప్రక్రియను పాతుకుపోయిన పాత వర్గం ప్రారంభించింది.
సరే, వాట్ నెక్ట్స్?
మహా సభ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ పరంగా జరిగింది. సభ ఉనికి, గుర్తింపు, కోట్లాది రూపాయల విలువైన 5 ఎకరాల భూమి కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వ కమిటీ నే రద్దు చేయాలని ఇప్పడు మహా సభ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం తలచుకుంటే మహా సభ గుర్తింపునే రద్దు చేయవచ్చు. 5 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవచ్చు. పైగా ప్రతి రెండేండ్లకు ఎన్నిక జరగాల్సి ఉండగా, 11 ఏళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు లేకుండా అధ్యక్షుడు సహా, ఒకే కార్యవర్గం పదవిలో ఉంది. ఈ ఉల్లంఘనల ఘనులు ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు? తమని తాము రక్షించుకుంటారు?
ఇప్పుడు మహాసభ సమస్య ఆర్యవైశ్యులు, వారి సంఘంలోని వర్గాల నుంచి, ప్రభుత్వం వర్సెస్ న్యాయస్థానం అన్నట్లుగా మారిపోయింది. మహాసభ అధ్యక్ష ఎన్నికపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది. న్యాయస్థానాల్లో ఎలా వాదిస్తుంది? న్యాయస్థానాల తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో? ఏ మజిలీకి చేరుతుందో? వేచి చూడాలి.