తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా లేమి
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వైఫల్యం వున్నట్లు ప్రస్తుత ఘటనతో తెలిసిపోయింది. విషయంలోకి వెళ్తే టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ సెంటర్ లోకి 3 సార్లు వచ్చి వెళ్తూ, రూ.2.82 లక్షలు కాజేశాడు.
ఈ మధ్య తెలంగాణ సెక్రటేరియట్ లోకి 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ఒక వ్యక్తి 3 సార్లు వచ్చి వెళ్ళాడు. ఆ నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్ లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించి మోసం చేశాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.
దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు. అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థపై అవమానం కలగక మానదు అని విమర్శకులు అంటున్నారు.