ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఈజీ మనీ కోసం ప్రజలు ఎక్కువగా ఆరాటపడుతున్నారు. కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కొందరు చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ల ఘటనలో పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కు బానిసై చివరకు రూ.80 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అయితే అప్పులు తిరిగి చెల్లించాలని ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో.. జీవితం కొనసాగించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని మృతుడి భార్య కోరింది.
ఇక సంజయ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెట్టింగ్ యాప్ ల ద్వారా సంజయ్ ఎంత నష్టపోయాడు? ఎవరి వద్ద ఎంత అప్పులు చేశాడు అని పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్ లకు పాల్పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.