హైదరాబాద్ మదీనా సర్కిల్‌లో ఉన్న అబ్బాస్ టవర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2:15 గంటలకు అగ్నిప్రమాద సమాచారం అందిందని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ అదనపు డైరెక్టర్ జివి నారాయణరావు తెలిపారు. టవర్స్‌లో సుమారు 300 టెక్స్టైల్, గార్మెంట్స్ దుకాణాలు ఉన్నాయని, మొత్తం 40 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయని చెప్పారు. ఘటనాస్థలానికి 8 అగ్నిమాపక వాహనాలను పంపించామని, భవనంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కుటుంబ సభ్యులు, సమీప భవనంలో ఉన్న మరో 12 మంది సహా మొత్తం 13 మందిని సురక్షితంగా రక్షించామని ఆయన వెల్లడించారు.