తెలంగాణ అసెంబ్లీ ఒక్క నిమిషంలోనే వాయిదా పడటం పై BRS ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
BRS ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ శాసనసభ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సభ ప్రారంభమైన వెంటనే వాయిదా వేయడం దురదృష్టకరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలా జరగలేదు” అని విమర్శించారు. “కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం దారుణం. కేబినెట్, అసెంబ్లీ షెడ్యూల్ ముందే ఖరారు చేశారు. మరి ఎందుకు మార్పులు చేశారు?” అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, “బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? బీసీ గణనపై చర్చ అని చెప్పి అసెంబ్లీని వాయిదా వేయడం దారుణం” అని వ్యాఖ్యానించారు. “కేబినెట్‌లో చర్చించకముందే బీసీ గణన నివేదికను ఎందుకు బయటపెట్టారు?” అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని, “మొదట్నుంచి బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తోంది” అని ఆరోపించారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. “తెలంగాణలో 90% మంది బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలే. వారు అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ షెడ్యూల్ ఇచ్చి మాట తప్పారు” అని ఆరోపించారు. “కేబినెట్ మీటింగ్ నిన్నే పెడితే ఏమయ్యేది?” అని ప్రశ్నించారు.
అలాగే, “బీసీలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సభను ఒక రోజు మాత్రమే నిర్వహించడం అన్యాయం. కనీసం నాలుగు రోజులైనా అసెంబ్లీ పెట్టాలి. బీసీల కోసం త్వరలో కొత్త ఉద్యమం రాబోతోంది. ఇది తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఉండబోతోంది” అని హెచ్చరించారు.
దానం నాగేందర్:
ఇదిలా ఉండగా, BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం. అయితే దానం నాగేందర్ స్పందిస్తూ, “నాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదు. వచ్చిన తర్వాత స్పందిస్తా” అని అన్నారు.
అధికారుల వ్యవహారంలో రాజీపడే ప్రసక్తే లేదని, “పేదల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోం. హైడ్రా అంశంలో కూడా వెనక్కి తగ్గను” అని స్పష్టం చేశారు. “నా ఇంట్లో YSR, KCR ఫోటోలు ఉన్నాయి. ఎవరి అభిమానం వాళ్లది. అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. “నాపై ఇప్పటికే 173 కేసులు ఉన్నాయి. అవసరమైతే జైలుకెళ్లేందుకు సిద్ధమే” అని పేర్కొన్నారు.