పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఘోర సంఘటన వెలుగుచూసింది. భర్త కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మించి, ఆ డబ్బుతో ప్రియుడితో పరారైన ఓ మహిళ ఉదంతం సంచలనంగా మారింది.
కిడ్నీ అమ్మాలంటూ భర్తపై ఒత్తిడి
హౌరా జిల్లా సంక్రైల్‌లో నివసించే ఓ దంపతులకు 10 ఏళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా భార్య తన భర్తపై నిరంతరం ఒత్తిడి పెంచేది. “మన కూతురి భవిష్యత్తు కోసం నీ కిడ్నీని అమ్మాలి, లేకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేసేవాళ్లం అవుతాం” అంటూ భర్తను బలవంతపెట్టింది.
పేదరికంతో అల్లాడుతున్న భర్త చివరికి భార్య మాటలు నమ్మి, తన కిడ్నీ అమ్మడానికి అంగీకరించాడు. నెల రోజుల పాటు కొనుగోలుదారుల కోసం వెతికి, రూ.10 లక్షలకు ఒకరికి విక్రయించాడు. భార్యాభర్తలు కలిసి కిడ్నీ ఇచ్చి డబ్బు తీసుకున్నారు.
డబ్బు చేతికొచ్చిన వెంటనే మోసం
ఆ తర్వాత భార్య భర్తను మభ్యపెట్టి “ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తాను” అంటూ మొత్తం డబ్బు తీసుకుంది. తన జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉంచిన భర్త ఆమెను అడ్డుకోలేదు. కానీ ఆ రాత్రే భార్య డబ్బుతో సహా ఇంటి నుంచి పరారైంది.
ప్రియుడితో కలిసి ఉంటూ దొరికిన భార్య
కొన్ని రోజుల తర్వాత భర్త తన భార్య గురించి ఆరా తీయగా, ఆమె బరాక్‌పూర్‌లోని సుభాష్ కాలనీలో ఓ పెయింటర్ రవిదాస్‌తో కలిసి ఉంటుందని తెలిసింది. కుటుంబంతో కలిసి అక్కడకు చేరుకున్న భర్తను చూసిన ఆమె తలుపు మూసేసి, “నీకేం కావాలో చేసుకో, త్వరలోనే విడాకులు పంపిస్తాను” అంటూ అరిచింది.
తన పదేళ్ల కుమార్తె కోసం కూడా కనీసం కనికరం చూపించని భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.