దేశవ్యాప్తంగా జనగణన లెక్కలు సేకరించే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన తాజా బడ్జెట్లో జనగణన (Census) మరియు జాతీయ జనాభా పట్టిక (NPR) కోసం కేవలం రూ.574.80 కోట్లను కేటాయించారు. 2021-22లో ఈ ప్రక్రియకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినా, ఇప్పటికీ పురోగతి కనిపించలేదు. 2023-24లో రూ.578.29 కోట్లను కేటాయించగా, 2024-25లో రూ.1,309.46 కోట్లకు పెంచారు. అయితే, 2025-26 బడ్జెట్లో ఆ మొత్తం తిరిగి సగానికి పైగా తగ్గించడం గమనార్హం. 2019 డిసెంబరులో కేంద్ర కేబినెట్ జనగణనకు ఆమోదముద్ర వేసినప్పటికీ, 2020లో ప్రారంభించాల్సిన ఈ ప్రక్రియ కొవిడ్-19 కారణంగా నిలిచిపోయింది. 2023లో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించినా, ఇందుకు సరైన లెక్కలు లేవు. ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ 2011 జనగణన ఆధారంగా రూపుదిద్దుకుంటున్నాయి. సరైన గణాంకాలు లేకుండా నీతి ఆయోగ్ ప్రకటించిన పేదరికం తగ్గిన లెక్కలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగణన పూర్తి అయ్యే వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరగదు.