ప్రఖ్యాత స్వచ్ఛంద సంస్థ దేశ్‌పాండే ఫౌండేషన్ తెలంగాణలో తన సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యి సేవా కార్యక్రమాలపై చర్చించారు. కస్తూర్బా బాలికల పాఠశాలల నిర్వహణలో ఫౌండేషన్ పాలుపంచుకోవాలని, అలాగే మహబూబ్‌నగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని సీఎం సూచించగా, సంస్థ దీనికి అంగీకారం తెలిపింది. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురురాజ్ దేశ్‌పాండే, జయశ్రీ దేశ్‌పాండే, దేశ్‌పాండే స్టార్టప్స్ రాజు రెడ్డి, ప్రతినిధి జి. అనిల్ పాల్గొన్నారు. అమెరికాతో పాటు పలు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం దేశ్‌పాండే ఫౌండేషన్ పనిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల శిక్షణ, నైపుణ్య పెంపు కార్యక్రమాలు చేపడుతోంది.