ఆన్‌లైన్ బెట్టింగ్ పర్వాలపై కఠినంగా స్పందించిన సైబరాబాద్ మాజీ కమిషనర్ సజ్జనార్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “వస్తువులను కొనడం ఎంత సులువో చూపించాలనే నెపంతో షాప్‌కు వెళ్లి, అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభాలతో నచ్చిన వస్తువును కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్న వీడియోలు చేసేందుకు దిక్కుమాలిన తత్వం ఏమిటి?” అంటూ ప్రశ్నించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లను పెంచుకోవడానికి, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం సరైంది కాదని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితిలో ఇలాంటి వీడియోలు యువతను తప్పుదారి పట్టించవచ్చని హెచ్చరించారు. “ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.