గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కింద నల్లమల అడవుల్లో 27 కి.మీ పొడవున భూగర్భ టన్నెల్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. బొల్లాపల్లి జలాశయంలో నిల్వ చేసిన నీటిని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు మళ్లించేందుకు ఈ టన్నెల్ నిర్మాణం కీలకమని భావిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం గుండా నీటి ప్రవాహం సాగేందుకు భూగర్భ టన్నెల్ నిర్మాణమే సరైన మార్గమని నిర్ణయించారు. మొత్తం 118 కి.మీ పొడవున గ్రావిటీ కాలువను తవ్వుతారు, ఇందులో మూడుచోట్ల నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానికి 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో బొల్లాపల్లి జలాశయానికి 15 వేల ఎకరాలు అవసరమవుతాయి.
పోలవరం జలాశయం నుంచి కృష్ణా నదికి వరద జలాలు మళ్లించేందుకు ప్రస్తుత కాలువల సామర్థ్యాన్ని పెంచుతారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 28 వేల క్యూసెక్కులకు విస్తరించనున్నారు. తాడిపూడి ఎత్తిపోతల కాలువలను 108 కి.మీ మేర పొడిగించి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి వృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పెద్ద సవాలు కాకపోవచ్చని భావిస్తున్నారు. అయితే 5,000 మెగావాట్ల విద్యుత్తు అవసరం, నిర్వహణ ఖర్చులు కీలక సవాలుగా నిలుస్తాయి. ప్రతి ఏడాది విద్యుత్తు ఖర్చుల రూపంలో వేల కోట్ల వ్యయం ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు