తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రులు, సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు అపారమని, ఆయన భారతరత్నకు పూర్తిగా అర్హుడని అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ, అనవసర ఖర్చులు లేకుండా నిష్కళంకంగా పాలన సాగించిన మన్మోహన్ సింగ్ అందరికీ ఆదర్శమన్నారు. ఆయన క్యాబినెట్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భాగమైన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా పీవీ నరసింహారావు అంశాన్ని ప్రస్తావిస్తూ, మన్మోహన్‌కు సమానంగా పీవీకి గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పీవీకి ప్రత్యేకంగా మెమోరియల్ లేకపోవడం తెలుగు వ్యక్తుల తలవంపుగా ఉందని, దీనిపై తగిన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీవీ దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసిన గొప్ప నేత అని, ఆయనకు సరైన గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని కోరారు .