ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ పై భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఒక రీల్ హీరోగా కాకుండా రియల్ హీరోగా ఉంటే ప్రజల సమస్యలను గౌరవించి స్పందిస్తే బాగుంటుందని అన్నారు. నిన్నటి ప్రెస్ మీట్ సమయంలో ప్రజలు ఒక మంచి సందేశం ఆశించారని, కానీ అల్లు అర్జున్ ఇచ్చిన ప్రసంగం ప్రజల్లో అసంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు.
అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనను విషయంలో “మీరు సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ వెలుపల అంబులెన్స్ వచ్చింది, ఆ సమయంలో అక్కడ ప్రజలు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. కానీ మీకు ఆ పరిస్థితిపై ఎలాంటి జాగ్రత్త లేదు. మీ దృష్టి మొత్తం మీ సినిమా కలెక్షన్లపై ఉంది,” అని విరుచుకుపడ్డారు.
నిన్నటి ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. “మీరు మాట్లాడిన తీరు పూర్తి స్క్రిప్ట్ యే నని, మీకు ఏం చెప్పాలో స్పష్టత లేదు. మీరు రియల్ హీరోలా మాట్లాడి ప్రజలకు భరోసా కల్పించవలసింది. కానీ మీరు మాటలతో మాత్రమే కాలం గడిపారు ” అని ఆయన విమర్శించారు.
ప్రజలు తమ అభిమాన నటులను స్ఫూర్తిగా తీసుకుంటారని, వారు మాట్లాడే ప్రతీ మాట బాధ్యతాయుతంగా ఉండాలని చామల చెప్పారు. అల్లు అర్జున్ తన క్యారెక్టర్ గురించి బాధపడుతున్నట్లు చెప్పడాన్ని ఆయన విడ్డూరంగా వుందన్నారు . “సినిమాలో మాత్రమే కాదు, నిజజీవితంలోనూ మీరు రియల్ హీరోలా ఉంటేనే మీకు నిజమైన గౌరవం దక్కుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, వారికి నష్టం జరగకుండా ఉండాలి,” అని ఎంపి చామల సూచించారు.
ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి చివరగా , “మీ అభిమాన నటులు చేసే ప్రతీ పని, మాట్లాడే ప్రతీ మాట మీరు గమనించాలి. వారిని ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఉండేలా చూస్తే సమాజానికి అది మేలుకలిగే దిశగా వుండాలి. ఆరాధనతో పాటు సవాలక్షణంగా కూడా చూడాలి,” అని అల్లు అర్జున్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.