PALAKURTHI|పాలకుర్తి సాహితీ ప్రస్థానానికి పాదాభివందనం
ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న|GORATI VENKANNA
డాక్టరేట్ ప్రకటించాక తొలిసారి పాలకుర్తికి వచ్చిన వెంకన్న
గోరేటికి ఘనంగా SOMANATHA KALA PITHAM|సోమనాథ కళాపీఠం సత్కారం
LANGUAGE|భాషా, LITERATURE|సాహిత్య కేంద్రంగా పాలకుర్తి
కవి సంగమం వ్యవస్థాపకుడు, కవి యాకూబ్
గోరేటి, యాకూబ్, దినకర్, ఒద్దిరాజులకు సన్మానం
పాలకుర్తి, సెప్టెంబర్ 26 (అడుగు న్యూస్):
తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి నేల అజరామరమైన స్థానం సంపాదించుకుందని, ఈ ప్రాంతానికి చేతులెత్తి వందనం సమర్పిస్తున్నానని ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. కవి సంగమం వ్యవస్థాపకులు, బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, కవి వద్దిరాజు ప్రవీణ్ కుమార్ తో కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో శుక్రవారం జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరై, తిరిగి హైదరాబాద్ కు వెళ్తూ, మార్గమధ్యంలో, తొలి తెలుగు కవి, ఆది కవి పాల్కురికి సోమనాథుడి స్వస్థలం పాలకుర్తిలో, ఆయన చిరకాల మిత్రుడు, సోమనాథ కళాపీఠం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణను కలిశారు. ఈ సందర్భంగా సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు, కవి పండితుడు, బహుభాషావేత్త, డాక్టర్ రాపోలు సత్యనారాయణ క్లినిక్ లో ఆగి కాసేపు సాహిత్య కలబోతను నిర్వహించారు. డా. మార్గం నాగర్ కర్నూల్ లో చేసిన వార్తల యుద్ధం నుండి కేసుల పర్వం వరకు అప్పటి రోజులను నెమరు వేసుకున్నారు. అడుగు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగేది అంటూ మార్గం కుటుంబంతో వారికున్న సాన్నిహిత్యాన్ని అక్కడి వారితో పంచుకున్నారు. ఇదే సమయంలో ఈ నెల 25న డా. బి ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం గోరేటి వెంకన్న కు డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా సోమనాథ కళాపీఠం, పాలకుర్తి ప్రజల తరపున సన్మానించారు. శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పాలకుర్తి, చిట్యాల/చాకలి ఐలమ్మ జయంతి కావడంతో చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం గోరేటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, సాహిత్యాన్ని అంతపురాల నుంచి అనంత ప్రజల్లోకి తీసుకువచ్చిన మహాకవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన నేల పాలకుర్తి, ఆయన భాషను జీవ భాషగా నిలబెట్టి, జాను తెలుగులో ద్విపద కావ్యాలను సృష్టించి, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి అమూల్యమైన కావ్యాలను సమాజానికి అందించారన్నారు. సోమనాథుని రచనలు కేవలం కవిత్వమే కాదు, సమాజ మార్పులకు దిక్సూచి. ఆయన సాహిత్యం సమాజంలోని ప్రతి రంగాన్నీ తాకి, భవిష్యత్తు దశ, దిశలను నిర్దేశించింది. అందుకే నేటికీ పాలకుర్తి, తెలంగాణతో పాటు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాహిత్య వాతావరణాన్ని నింపుతూ డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీనారాయణ వంటి మిత్రులు పనిచేయడం విశేషమన్నారు. నగరాల్లో సాహిత్య వ్యాప్తి సులభం, కానీ పల్లెల్లో అలా చేయడం గొప్ప కృషి అని కొనియాడారు. సోమనాథ కళాపీఠంకు అభినందనలు తెలిపారు.
అలాగే తాను రాసిన ప్రతి కవిత, పాటలో పాల్కురికి సోమనాథుడి ప్రస్తావన తప్పనిసరి అని, అంటే తనపై పాల్కురికి సోమనాథుడి ప్రభావం ఎంతో ఉందన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనలు తెలుగు సాహిత్యానికే మార్గదర్శకులు అన్నారు. అలాగే తెలుగు సాహిత్యం ఆశు సంప్రదాయంగా ఆరంభమై, తరువాత లిఖిత సంప్రదాయంగా రూపుదిద్దుకుందన్నారు. యతి, ప్రాసలకు జన్మనిచ్చిన ఈ పవిత్ర నేల పాలకుర్తి అని, ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టం అన్నారు. తనకు డాక్టరేట్ ప్రకటించిన తర్వాత పాలకుర్తికి రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో తన మిత్రుడు డా. మార్గం గురించి మాట్లాడుతూ, ఏదైనా విషయంలో తనకు అనుమానం వస్తే దాన్ని చీల్చి చెండాడే దాకా వదలడని, నాగర్ కర్నూల్ ను తాను ఉన్నన్ని రోజులు గడగడలాడించాడని చెప్పారు. ఆ రోజుల్లో నాగర్ కర్నూల్ లో మార్గం ఉన్నాడో లేడో తెలుసుకొని అప్పటి ప్రజా ప్రతినిధులు వచ్చేవారని, ఉన్నాడంటే అక్కడికి రావడానికే భయపడే వారని చెప్పారు. 35 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం వున్న వ్యక్తి నేటి తరానికి తగ్గట్లుగా, అడుగు డిజిటల్ మీడియా పెట్టడం, తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. అలాగే అడుగు డిజిటల్ మీడియాను టెక్నికల్ గా, క్రియేటివ్ గా మార్చుతున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను కూడా అభినందించి, ఆశీస్సులు అందించారు.
అంతకముందు కవి సంగమం వ్యవస్థాపకులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ మాట్లాడుతూ, పాలకుర్తి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని సాహిత్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి చరిత్రను మిత్రులు డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీ నారాయణలు వివరిస్తుంటే తాను ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ఈ ప్రాంతానికి కవులు, రచయితలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతానికి సాహిత్య యాత్రకు రావాలన్నారు. ఇక నుండి సోమనాథ కళా పీఠం సాహిత్య కార్యక్రమాలకు తాము వస్తామన్నారు. మేము వస్తుంటే ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉందని, ఇలాంటి ప్రశస్తమైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ ప్రాంతానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.
చాకలి ఐలమ్మ కు నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో మారం రవికుమార్, రేపాల అశోక్, రాపాక ఉదయ్, రాపోలు రాంబాబు, అబ్బోజు యాకస్వామి, రాపోలు సోంసాయి, మచ్చ సునీల్, కమ్మగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.