ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ పల్లె వాతావరణం ఉల్లాసంగా మారింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆదివారం మద్దిరాల మండల వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ పూల పండుగలో మహిళలు, చిన్నపిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. తంగేడు, టేకు, బంతి, చామంతి వంటి పూలను ఉదయం నుండే సేకరించి బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. తొలి రోజు ఎంగిలిపూలతో బతుకమ్మలను సిద్దం చేసి ఊరేగింపుగా ముత్యాలమ్మ చెరువుకు తీసుకెళ్లారు.
మహిళలు సాంప్రదాయ బద్ధమైన పట్టుచీరలు, చిన్నపిల్లలు లంగా వోనీలు ధరించి, తల నిండా పూలతో, చేతుల్లో బతుకమ్మలతో ఊరేగింపు చేయడం ఆహ్లాదకర దృశ్యంగా మారింది. డప్పు వాయిద్యాలు, జానపద గీతాలు, కోలాటాలతో కూడిన వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ సాంప్రదాయ పాటలు, ఆధునిక బతుకమ్మ గీతాలతో ఉత్సాహంగా నృత్యం చేసి, చివరగా ముత్యాలమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. అన్ని వయసుల మహిళలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలు బతుకమ్మ పండుగ తమకు అత్యంత ప్రియమైనదని, ప్రతి సంవత్సరం ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తామని తెలిపారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పండుగలో కీలక పాత్ర పోషించారు. నిమజ్జన సమయంలో నడుము లోతు నీటిలోకి దిగి మహిళల నుండి బతుకమ్మలను స్వీకరించి చెరువులో సమర్పించారు. ఈ సేవలను స్థానికులు అభినందించారు. పూల సువాసన, జానపద గీతాలు, ఆటల సందడి గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తాయి.