అరె గిదేంది? ఎద్దు ఇల్లెక్కుడేంది? గిదేం సిత్రం? గిది నిజంగా ఇసిత్రమే! గీ ఇసిత్రం జరిగింది గా ఆదిలాబాద్ జిల్లల భోరజ్ మండలంల, నిరాల అనే ఊల్లె. ఏమైందంటే…
గా ఊల్లె షేక్ గఫూర్ అనే రైతు ఎప్పటి లెక్కనె ఇంటి ముందల గుంజకు ఎద్దును కట్టేసిండు. ఇగ యేడి నుంచొచ్చినయొ గనీ, గాడికి ఓ మంద లెక్క కుక్కలు వచ్చినయి. ఒచ్చినయి ఒచ్చినట్లే గా ఎద్దు మీద ఎగబడ్డయి. ఇగ గా కుక్కలు గయ్య గయ్య అర్సుకుంట గా ఎద్దుమీద పడ్డయి. ఇగ గీ కుక్కల తక్కెడను సూసిన ఎద్దు, కాసేపు గింజుకున్నది. కాపాడుకున్నది. ఎద్దు ఎంత బలంగల్లదైనా ఒక్కటైపాయె. గా కుక్కలేమో శానైపాయె. ఇగ గిది పని గాదని.. ఒక్కపాలె గా యజమాని కట్టిన పగ్గాన్ని తెంపుకున్నది. ఇగ ఉరుకుడు మొదలు పెట్టింది. కుక్కల బుద్ధి తెలుసు గద. గవాట్ని భయపెడితె భయపడతయి. భయపడితే ఎవ్వల్నైనా భయ పెడతయి. రాయి అందుకున్నట్లు సేత్తనే ఊరుకులు, పరుగులు పెట్టే గా కుక్కలు, ఉరుకుతున్న ఎద్దెనుకబడి గెదుముడే గెదుమినయి. ఎటు పోతే అటు గెదుముతాంటే, ఇగ గా ఎద్దుకు వశం గాలె. ఇగ గా ఓఎద్దు ఉరుక్కుంట ఉరుక్కుంట ఎదురు గా ఇంటి పక్కన అద్దె లెక్క పెట్టిన బండలను ఎక్కింది. ఇంకా గా కుక్కలు ఎగపడ్తాంటే సేసేది లేక గాయింత గా బండల మీదికెలి గా పెంకుటింటి మీదికి పోయింది. ఇగ మొరిగి మొరిగి అలిసిన గా కుక్కలు గాడ్నుంచి పోయినయి. ఇగ గవి పోవంగనే… మెల్లగ గానుంచి ఇంటి ముందల పందిరి లెక్కేసిన రేకుల మీదికి వచ్చి ఆగింది గా ఎద్దు. పానం మీద తీపి ఎంత కైనా తెగిస్తిద గదా?
ఇగ గిదీన్ని సూసి గిదేం ఇచ్చంత్రం? అనుకున్నరు. మెల్లగ పగ్గాలు, తాళ్లతోని గా ఎద్దును దించిండ్లు. గా యీది కుక్కలు ఎంత పని సేసినయి? గీ మద్దెల్నె గీ యీది కుక్కలను పట్టి ఓ దగ్గెర పెట్టుండ్లని గా పెద్ద అదాలత్ సెబితె, గా జంతు పేమికులు అంతంత లేసిండ్లు. గట్లెట్ల? గీ యీది కుక్కలంటే గంత అలుసా? అన్నరు, ఇగ గిది పనిగాదని గా కుక్కలకు పిల్లలు గాకుండ ఆపరేషన్లు చేయన్నరు. గిదంతా అయ్యే పనా? సెప్పుండ్లి? వార్ని గీ కుక్కలు ఎంత పని సేయబట్టె? ఎంత సాదుకున్నా? కుక్క కుక్కే గదా? ఏమంటరు? గిదంత పక్కన పెట్టుండ్లి. కుక్కలతోని సక్కగుండుండ్లి. గంతె!