ప్రజలు, వారి ప్రతినిధుల ద్వారా ప్రజల కోసమే జరిగే పరిపాలన ప్రజాస్వామ్యం. రాను రాను ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేతలు, నిరంకుశంగా పాలించడం, నిరపేక్షంగా అధికారాన్ని చెలాయించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ నింరకుశంవైపు, నిరంకుశాలు నియంతృత్వంగా మారుతుండటం విచారకరం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేత అధికారాలు కేంద్రీకృతమై, ప్రజల స్వేఛ్ఛా హక్కులను హరించడమే దీని ఉద్దేశ్యం. ఇది ప్రజాభిప్రాయాన్ని అణచివేస్తుంది. వివిధ సంస్థలను హస్తగతం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశ ప్రవృత్తి మెల్లగా ప్రబలడం ఎంతో ప్రమాదకరం.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరిచి, అధికారంలోకి వచ్చాక తమ స్వంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవడం.. హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు జరగకుండా అణచివేయడం.. భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్రవేసి, విపక్షాలను విచారణల పేరుతో వేదించడం.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని అణచడానికి న్యాయ వ్యవస్థను లేదా చట్టాలను ఉపయోగించడం వంటివన్నీ నిరంకుశ ధోరణులే. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం వంటి నినాదాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. హిట్లర్ తరహాలోనే వీరు వ్యవహరిస్తున్నారు. శాసన సభలను రద్దు చేయడం, గవర్నర్ల వ్యవస్థను వాడుకోవడం, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్య బలహీనతలుగా చూడాలి.
బలమైన పౌర సమాజం ఏర్పడాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగాలి. హక్కుల విషయంలో గళమెత్తే శక్తిని ప్రజలు కలిగి ఉండాలి. ప్రశ్నించే మీడియా ఉంటే ప్రభుత్వ చర్యలు ప్రజలకు స్పష్టమవుతాయి. ప్రభుత్వానికి అతీతంగా స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఓటు హక్కును వినియోగించడమే కాక, ప్రభుత్వ చర్యలను గమనిస్తూ, ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలు చూపాలి. అప్పుడే నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుత రాజకీయ వాతావరణం కనిపించకుండా పోతోంది. అధికారం చేపట్టిన నేతలు నిరంకుశమనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు మీడియా పైనా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల దాకా వెళుతున్నారు. సొంత మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మోదీ, మమతా బెనర్జీ, నిన్న మెన్నటి దాకా కేసీఆర్, జగన్ వంటి వాళ్లంతా అహంకార పూరితంగా పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, వారిచ్చే ఓటుతో గెలిచి సుపరిపాలన అందించాలి. ఓట్లేయించుకోవడం, వేసుకోవడం ఎలాగో తెలుసుకుని రాజ్యమేలుతున్న మన రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలను పురుగుల్లా చూస్తున్నారు. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఊహించి ఉండరు. లేకుంటే ఎక్కడో అక్కడ ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేవారేమో!
దేశంలో ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ కాలంలోనూ, ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, వైఎస్ లాంటి నేతలు కూడా ఇంత నిరంకుశంగా పాలించ లేదు. ప్రజా సంక్షేమం పేరుతో, డబ్బుల పందేరంతో ఖాజానాను ఊడ్చేస్తున్న నాయకులు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్న వారు నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వారిని ఆదరిస్తారు. లేదంటే అత: పాతాళానికి తొక్కేస్తారు.
ప్రజాస్వామ్యానికి అసలైన శక్తి ప్రజలే. అయితే ప్రజల మౌనం, ఓటింగ్ పై ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత లాభం కోసమే ఓట్లేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి చేటు, నిరంకుశత్వానికి బలం చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. పాలకులను ప్రశ్నించగలగాలి. లేదంటే ప్రజాస్వామ్యం నెమ్మదిగా నియంతృత్వాన్ని సంతరించకోవడం ఖాయం.
…..
నిరంకుశం వైపు ప్రజాస్వామ్యం పరుగులు!|EDITORIAL
