ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని ఏకగీవ్రంగా ఎంపిక చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. బలాబలాలను బట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే. అయితే ఈ రెండు అభ్యర్థిత్వాలు అద్భుతమైనవే. వాళ్ల రంగాల్లో వారు అత్యున్నతంగా నిలిచారు. ఈ ఎన్నిక ద్వారా దేశంలోని అత్యున్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను, పనితీరును, సమర్థతను తెలుసుకునే సదవకాశం ప్రజలకు దక్కింది. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత గత మూడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ దక్షిణాదికి చెందని వ్యక్తులే అభ్యర్థులుగా నిలిచే అవకాశం రావడం విశేషం. అందులోనూ ఆంధ్రాకు చెందిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కాగా, ఇప్పుడు తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా నిలుస్తుండటం దక్షిణాదికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణం.
ఇప్పటివరకు 16 ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగగా, సర్వేపల్లి రాధాకృష్ణన్, గోపాల్ స్వరూప్ పాఠక్, జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా, శంకర్‌దయాళ్‌శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక 2017లో తొలిసారి జరిగిన ఎన్నికలో అధికారపార్టీ అభ్యర్థి వెంకయ్యనాయుడుపై ప్రతిపక్షాలు గోపాలకృష్ణ గాంధీని నిలబెట్టాయి. 2022లో జరిగిన ఎన్నికలో జగదీప్ ధన్‌ఖడ్‌పై కర్ణాటకకు చెందిన మార్గరెట్ అల్వాను రంగంలోకి దింపాయి. ఇప్పుడు తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేశాయి. ఈ మూడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాదివారే కావడం విశేషం.
ఫలితాలేమైనప్పటికీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రగతిశీల న్యాయ కోవిదుడు. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఉండే వ్యక్తి. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది. ఆయన సుదీర్ఘ కాలం ఎన్నో హోదాల్లో పనిచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం ధైర్యంగా పోరాడారు. అంతకుమించి పేదల పక్షపాతిగా పేరుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు తర్వాత పోటీ చేస్తున్న రెండో తెలుగు వ్యక్తి.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1946 జులై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి వద్ద జూనియర్‌గా చేరారు. హైదరాబాద్ సిటీ- సివిల్‌కోర్టు, హైకోర్టుల్లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1988-90 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో ఆరు నెలలపాటు- కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గానూ పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా, స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబరు 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12 నుంచి 2011 జులై 7 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. ఆనాటి గోవా సిఎం పణిక్కర్ ఏరికోరి సుదర్శన్ రెడ్డిని లోకాయుక్తకు నియమించారు. పారికర్ అంచనాలకు మించి, అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా ఆ పదవిని నిర్వహించి వన్నె తెచ్చారు. ప్రస్తుతం ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా, బీసీ కులగణన అధ్యయన కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మానవ హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు కీలక తీర్పులు వెలువరిం చారు. ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఏర్పడిన సల్వాజుడుంను నిషేధిస్తూ తీర్పు ఇచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన లక్ష్యంగా ఈ తీర్పు వెలువరించారు. ఆర్మీ వైద్య కళాశాలలో పదవీ విరమణ పొందిన సైనికులు, సైనిక సిబ్బంది వితంతువుల పిల్లలకు అడ్మిషన్‌లు నిరాకరించడం చెల్లదని, దీనివల్ల అణగారిన వర్గాలకు న్యాయం జరగదన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో భాగంగా న్యాయమూర్తులపై ఆరోపణలతో వచ్చే ప్రజాప్రయోజన పిటిషన్‌లను అనుమతించరాదని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తూ అసైన్డ్ భూములకు భూసేకరణ చట్టం కింద చట్టబద్ధమైన పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఇప్పటి వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ దన్‌ఖడ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజీనామా చేశారు. ఈ హఠాత్పరిణామం, ఉప రాష్ట్రపతి పదవి విలువపై చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీకి నిలబెట్టేందుకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసింది. సుదర్శన్‌రెడ్డి గతంలో నిజాయితీతో నడిచిన న్యాయకోవిదుడు.
మొత్తంగా ఇప్పుడుసుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వం, అతని తీర్పుల గురించి ప్రజలు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓ రకంగా ఇది సుదర్శన్ రెడ్డ ఔన్నత్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చే ఎన్నికగా చూడాలి.