దేశంలో ఒక విచిత్రం వితండం చేస్తోంది. ఒకవైపు రైతులు తమ చెప్పులు కూడా పెట్టి, గంటలు, రోజుల తరబడి నిలబడి క్యూలైన్లు కడుతున్నారు. మరోవైపు పార్లమెంటులో విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం యూరియాపై పెద్దగా స్పందించడంలేదు. పైగా రైతుల పక్షాన గొంతెత్తిన ఎంపీల గొంతునొక్కుతోంది. ఎదురుదాడికి దిగుతోంది. యూరియా కొరత లేదని బుకాయిస్తున్నది. అన్నదాతలకు, ఆహారంగా వచ్చే పంటలకవసరమైన యూరియాను రాజకీయం చేస్తున్న దురుద్రుష్టం మన దేశంలోనే ఉన్నందుకు సిగ్గులేని మన నేతలను చూసి, మనమంతా సిగ్గుపడాలి.
పంటల సాగుకు అవసరమైన నత్రజని ఎరువులలో యూరియా ప్రధానమైంది. యూరియా వినియోగం పంటల సాగుపై ఆధారపడి ఉంటుంది. వరి, గోధుమ వంటి పంటలకు యూరియా చాలా అవసరం. దేశీయంగా యూరియా ఉత్పత్తి సరిపోనందున, దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. యూరియా కొరత పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది 10 నుంచి 20శాతం వరకు ఉంటుందని అంచనా. రష్యా, అమెరికా, ఉజ్బెకిస్తాన్ దేశాలు అత్యధికంగా ప్రపంచానికి యూరియా ఎగుమతులు చేస్తుండగా, మన దేశం యూరియా వినియోగంలో రెండో అతి పెద్ద దేశంగా ఉంది. మన ఉత్పత్తులకు మించి, అవసరాలు తీరడానికి ఒమన్, చైనా, ఖతార్, రష్యా, సౌదీ అరేబియా నుండి దిగుమతి కూడా చేసుకుంది. అయితే, ప్రభుత్వాల దగ్గర దేశంలో రైతాంగానికి అవసరమైన యూరియా అంచనాలే తప్ప కచ్చితమైన లెక్కలు లేకపోవడం విచాకరమే కాదు. విషాదం కూడా. అయితే దేశంలో ప్రతి ఏటా 3 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం అవుతున్నట్లు అంచనా. 2023–24 ఏడాదిలో ఒక్క తెలంగాణలోనే 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరగగా, దేశంలో 3కోట్ల 58 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు వినియోగించినట్లు కేంద్రం నివేదిక తెలుపుతోంది.
తెలంగాణలో ఖరీఫ్ కి 10 లక్షల 48వేల మెట్రిక్ టన్నులు అవసరముండగా, కేవలం 9 లక్షల 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ఆగస్టు ఒక నెలలోనే మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, కేవలం లక్షా 70వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం.
2024 ఖరీఫ్‌లో ఏపీ యూరియా వినియోగం 6.32 లక్షల టన్నులు కాగా 2025లో 6.22 లక్షల టన్నులకు కేటాయింపు తగ్గింది. జులైలో 3.05 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2.85 లక్షల టన్నులే వచ్చాయి. ఒకవైపు యూరియా కేటాయింపులు 5 శాతం నుంచి 10శాతం తగ్గుతుండగా, మరోవైపు వినియోగం 15 శాతం నుంచి 20శాతం పెరుగుతోంది.
గత ఖరీఫ్‌లో నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో సీజన్ నెల రోజులు ముందుకొచ్చింది. రైతులు మందస్తుగానే పంటలు వేశారు. దీంతో వినియోగం నెల ముందు నుంచే ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా డిమాండ్ కూడా ముందుగానే పెరిగింది. చాలీచాలని యూరియా తక్కువతోపాటు ఆలస్యంగా అందుబాటులోకి రావడంతో రైతుల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇక ప్రభుత్వం రూ.242 రూపాయల నిర్ణయించిన 45 కిలోల యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్ లో రూ.350 నుంచి 450 వరకు నడుస్తోంది.
ఇందుకే ఇప్పుడు రైతులు యూరియా అందక క్యూలో నిలబడుతుంటే, పార్లమెంటులో విపక్షాలు యూరియా కేటాయింపుల కోసం తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగాఉన్నందున ఏపీ అధికార కూటమి ఎంపీ ఆందోళనలకు దూరం గప్ చుప్ గా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణకు ఇంకా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా యూరియా కొరత ఇలా ఉండగా, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్, దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపిస్తోంది. బీజేపీ ఎంపీలు, నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. భారాన్ని రైతుల మీదకు తోసేశారు. అన్నదాతల అవసరాలపై కూడా రాజకీయం చేసే సిగ్గుమాలిన అరాచకం తాండవిస్తుండటం శోచనీయం.
కేంద్రం ఎరువుల కేటాయింపులను తగ్గిస్తుంటే, అధికార ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు మౌనముద్ర దాల్చారు. రైతుల తరపున ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం చేయడం లేదు. ఎన్‌డీఏ ఎంపీలు మాటమాత్రానికైనా ప్రధాని మోదీకి చెప్పలేకపోతున్నారు.
వ్యవసాయరంగంపై సరైన అవగాహన లేని పాలకుల తీరుకారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ఎంత ఇచ్చాం..ఎంత అవసరం అన్నది కూడా తెలియకుండా విమర్శలతో కాలం గడిపితే నష్టపోయేది రైతులే. రైతులకు అసవరమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కోసం రోడ్డెక్కకుండా చూడడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.
ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీని భారంగా భావించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తూ వస్తోంది. వ్యవసాయం, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఇందుకు ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. రైతులను చైతన్యపరచడం వంటి తగిన కార్యాచరణ లేకుండానే కోతలు విధించడం, పైగా అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం సరికాదు. ధరలు, తెగుళ్లు, నీటికొరత, ఇత్యాది కారణాలతో రైతులు పంటలను మారుస్తున్నారు. యూరియా డిమాండ్‌కు ఇది కూడా కారణం. ఇవన్నీ కలిసి రైతును రోడ్డున పడేస్తున్నాయి.