గతంలో నాయకులు సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. నిస్వార్థంగా సేవ చేసేవారు. నిష్టతో నిరుపేదలని ఆదుకునేవారు. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితో నిస్వార్థ ప్రజాసేవకే వాళ్ళ జీవితాలను అంకితం చేసేవారు. అందుకే గాంధీజీని ఇంకా మనం మన జాతిపితగా, నెహ్రూని భారత నిర్మాతగా, పటేల్ ని ఉక్కు మనిషిగా, శాస్త్రిని ఆదర్శవాదిగా, అబ్దుల్ కలామ్ ని నిరాడంబర జీవిగా, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, బతికినంత కాలం అదే ఆశయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీని కొనియాడుతున్నాం. వాళ్ళను అనుకరించే వాళ్ళు కూడా ఇంకా అక్కడో, ఇక్కడో, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉన్నారు కాబట్టే రాజకీయాలు కూడా నడుస్తున్నాయనేవాళ్ళూ ఉన్నారు. రాను రాను రాజకీయాలంటే అరాచకంగా మారిపోయాయి. పార్టీలు, నేతలూ అంతా కలగలిసి దోచుకుందాం, దాచుకుందామనే పనిలోనే ఉన్నారు. ఇందుకు వాళ్ళు ఆడని అబద్ధం లేదు, చేయని తప్పు లేదు. తత్ఫలితంగా మొత్తం దేశం, రాష్ట్రాలు దివాళా తీసేస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అప్పులు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి. ఒకరిని మించి ఒకరు అప్పులపైనే ఆధారపడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వానికి కేర్ టేకర్లుగా వ్యవహరించాల్సిన పీఎం, సీఎంలు రియల్ ఎస్టేట్ సీఇఓలు గా వ్యవహరిస్తున్నారు. చేసిన వేలకోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు తప్ప, దుబారాను అరికట్టే ప్రయత్నం చేయడం లేదు. నేతల జీతభత్యాలు, పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలీక్యాప్టర్లకయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఉచిత పథకాల పద్దు ఎలాగూ ఉంది. ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడితే, తిరిగి వారిమీదే ఆ ఆర్థిక భారం పడుతుంది. ఏ పార్టీ, ఏ నేతా వారి జేబుల్లో నుంచో, లేక వారు ఆబగా అడ్డంగా సంపాదించిన ఆస్తులమ్మో వారి పార్టీలను, ప్రభుత్వాలను నడపరు. ప్రజలు కట్టే పన్నుల నుంచే అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం, పాలకులు, అధికార యంత్రాంగం, సేవలు, ఆర్టీసీ అన్నీ అందులోనుంచే నడుస్తాయన్నది మరచిపోవద్దు.
అధికార వ్యామోహానికి వ్యసనంగా అలవాటు పడ్డ మన నేతలు ఆ పదవులను కాపాడుకోవడానికి, తిరిగి పొందడానికి ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అమరావతి, పి-4 అంటూ పరుగులు తీస్తున్నారు. ఉన్న భూమి చాలదన్నట్లు మరో 45 వేల ఎకరాలకు టెండర్ పెట్టారు. జగన్‌ను విమర్శిస్తూనే, మరిన్ని అప్పులు చేసేస్తున్నారు. వడ్డీల భారం ప్రజలకు తప్పడం లేదు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు రాజకీయంగా ఎదురుదాడితో నిరంతరం విమర్శలకు దిగుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటున్నారు సరే, వాటికి నిధులేవీ? అంటే తిరిగి అప్పులే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఎజెండా చేసుకుని అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జగన్ అధికారంలో ఉండగా అంతకుమించి అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ కూటమికి సమయం వచ్చింది. అంతే. సింగపూర్ పర్యటనను కూడా రాజకీయం చేసేశారు. ఇంతకూ ఎవరి మీద ఎవరు కేసులు పెడతామన్నారనేది త్వరలో ప్రజలకు తెలుస్తుంది. ఏపీలో జగన్ వర్సెస్ కూటమిగా రాజకీయం నడుస్తుంటే, చెల్లి షర్మిల సమయం చిక్కినప్పుడల్లా అన్న జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 42శాతం బీసీ రిజర్వేషన్ల రాజకీయం నడుస్తోంది. ముడు ప్రధాన పార్టీల ఒకరిని ఒకరు నిందించుకుంటున్నాయి. వేర్వేరుగా ఏ ఒక్క పార్టీ కానీ, కలిసి మూడు పార్టీలు కానీ బీసీల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధిగా పని చేయడం లేదు. ఈ డ్రామా స్థానిక ఎన్నికల తర్వాత కూడా కొనసాగేలా ఉంది. మరో విచిత్రం ఏమంటే, మూడు పార్టీలు మిగతా రెండు పార్టీలను కుమ్మక్క అయ్యాయని పరస్పరం నిందించుకుంటున్నాయి. రాజకీయ మైలేజీ కోసం నానా తంటాలు పడుతున్నాయి.
ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో తమాషా నడుస్తోంది. బీజేపీలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లు మూడు శిబిరాలైతే, ఈటలకు పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుకుండా మిగతా రెండు శిబిరాలు కలిసి అడ్డుకున్నాయి. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ బయటకు కనిపిస్తుంది. కానీ లోలోన అంతా ఒక్కటే. బీఆర్ఎస్, బీజేపీ విలీనాన్ని తాను జైల్లో ఉండి ఆపానని కవిత అంటుంటే, ఆమె వెనక అదృశ్య శక్తులు చేరాయని విధేయ నేతలతో ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ది ఓ కలహాల కాపురం అనేక గ్రూపులుగా అంతా కలిసే వున్నారు. పానకంలో పుడకలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.
ఒకప్పుడు కుటుంబానికో రాజకీయ నేతలుంటే మహా ఎక్కువ. ఇవ్వాళ అన్నీ కుటుంబ రాజకీయాలే! రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా మారాయి. అందుకే అన్ని పార్టీల రాజకీయ నేతలూ నాటకాలు ఆడుతున్నారు. పార్టీలు కూడా కొన్ని కులాలు, కుటుంబాలు, వ్యక్తులు, వర్గాల చేతుల్లో బందీగా మారాయి. ఇప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ‘వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడి…’ అనే సినిమా డైలాగ్ లాగా, పరిస్థితి దాపురించడంతో అన్నీ పార్టీలు అడిందే ఆట, వేసిందే డ్రామాలా మారిపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడే స్పందిస్తారన్నది మరచిపోవద్దు.