1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది. రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన మన దేశం, ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఆ బంధనాల నుంచి విముక్తి పొందింది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛతో పాటు అభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన భారతావనిని కలగన్నారు. భవిష్యత్తు తరాలు సమృద్ధి చెందిన దేశంలో జీవించాలని కోరుకున్నారు.
దేశంలో రవాణా, విద్య, సాంకేతికత, వైద్యం వంటి రంగాల్లో పురోగతి కనిపించినా, అది సమగ్రాభివృద్ధిగా చెప్పుకోదగినంత స్థాయికి చేరుకోలేదు. మన తర్వాత చాలా కాలానికి స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఆర్థికపరంగా, సామాజికంగా, సాంకేతికంగా మన దేశాన్ని ఎప్పుడో దాటిపోయాయి. ప్రధానంగా అవినీతి, రాజకీయ అస్థిరత, అసమాన వనరుల పంపిణీ, పౌరులలో బాధ్యతాభావం, సమర్థమైన ప్రణాళికల లోపం వంటి అంశాలు మన అభివృద్ధికి అడ్డంకులు అయ్యాయి. మొదటి కొన్ని దశాబ్దాలు దేశ పునర్నిర్మాణం, ఆహార భద్రత, ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినా, దీర్ఘకాల దృష్టి, సమన్వయం, అమలు సామర్థ్యం లోపించాయి.
ముఖ్యంగా, రాజకీయ నాయకత్వం తమ స్వప్రయోజనా లకన్నా దేశ ప్రయోజనాలను ముందుకు పెట్టడంలో విఫలమైంది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంస్కరణలు చాలా చోట్ల కాగితాల మీదే మిగిలిపోయాయి. కొన్ని మంచి విధానాలు అమలులోకి వచ్చినా, వాటి ప్రభావం సర్వసాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో సరిగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యువత పాత్ర అత్యంత కీలకమైనది. యువత మార్పు కోసం పని చేయాలి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. విద్య, నైపుణ్యం, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సమ సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ యూత్ కు బలం. ఈ బలాన్ని దేశ నిర్మాణానికి వినియోగించాలి.
దేశాభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. సమాన అవకాశాలు, అవినీతి రహిత పాలన, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల ఆరోగ్య భద్రత, విద్యా ప్రమాణాల పెంపు ఇవన్నీ కలిస్తేనే నిజమైన అభివృద్ధి. అందుకు యూత్ ముందుకు రావాలి. రాజకీయ రంగంలో నిజాయితీ గల నాయకత్వం కోసం యువత నడుం బిగించాలి. మార్పు ఒక్కరోజులో రాదు. దానికి సహనం, కృషి, దీక్ష అవసరం. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు. జాతీయ గీతం పాడటం కాదు. ప్రతి పనిలోనూ అవి ప్రతిబింబించాలి. ఒక విద్యార్థి చదువులో ప్రతిభను చూపడం, ఒక రైతు కొత్త పంటలు పండించడం, ఒక వ్యాపారి నిజాయితీగా పన్నులు చెల్లించడం, ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా విధులు నిర్వర్తించడం లాంటివి కలిసే దేశాభివృద్ధికి తోడ్పడతాయి.
ఇప్పటికైనా మనం మేల్కొనాలి. దేశం నాకేమిచ్చిందని కాకుండా, దేశానికి మనమేమిచ్చామన్నదే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన 78 ఏళ్ల తరువాత కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. గడచిన కాలం పాఠాలు మనకు మార్గదర్శకాలు కావాలి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనించాలంటే, యువత కంకణబద్ధులై, నిస్వార్థంగా, దృఢ సంకల్పంతో దేశ సేవలో తలమునకలవ్వాలి. అప్పుడే మన జాతి నేతలు కలలగన్న పురోగామిక భారతం, సమగ్రాభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన దేశం వాస్తవ రూపం దాల్చుతుంది. అప్పుడే మనది నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది.