ప్రపంచంలో ప్రతీ దేశం ఓ రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి. ఆ దేశ వ్యాపార, వాణిజ్య అవసరాలను, అధికారాలను, ఏ దేశంతో ఎలా వ్యవహరించాలనే అంశాలను ప్రశ్నించే హక్కు ఏ దేశానికీ లేదు. ఆయా దేశాల అంతర్గత, బహిర్గత అంశాలను ధిక్కరించే అధికారం కూడా ఏ దేశానికి లేదు. ఏ దేశం, ఏ దేశంతో వ్యవహరించాలన్నది కూడా ఆయా దేశాల ఇష్టానుసారం ఉంటుంది. అలాగని ఏ దేశం ఆ దేశ వనరుల మీద మాత్రమే ఆధారపడి మనుగడ సాగించలేదు. ఒక్కో దేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. అందుకే దేశాల మధ్య సుహృద్భావ, ఆరోగ్యకర, పరస్పర అవసరాలు తీరే విధంగా వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు, జరుగుతూ ఉంటాయి. అంతేకాదు కొన్ని దేశాల్లో విపత్తులు సంభవించినప్పుడు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు మానవతా దృక్పథంతో వేల, లక్షల కోట్లు ఉచితంగా అందచేసి ఆదుకోవడం కూడా చూస్తున్నాం. కానీ, అమెరికాలా కర్ర పెత్తనం చేయడం, బెదిరింపులకు పాల్పడటం, బ్లాక్ మెయిల్ చేయడం, యుద్ధాలకు పురికొల్పడం, ఒకవైపు తానే ఉండి యుద్ధం చేస్తూ, మరోవైపు శాంతి ప్రవచనాలు పలకడం, నోబెల్ శాంతి బహుమతి కావాలనుకోవడం మానసిక దౌర్బల్య వైపరీత్యానికి పరాకాష్ట. అమెరికా అధ్యక్షుడు ట్రంపరితనానిని ట్రేడ్ మార్క్.
ట్రంప్ విపరీత ధోరణి ప్రపంచానికి పెను సవాల్ గా మారనుంది. ట్రంప్ విధానాలు అమెరికా ఆధిపత్య ధోరణికి, ఏ దేశమైనా తమకు గులాం కావాలన్న వైఖరికి అద్దం పడుతున్నాయి. ప్రపంచ దేశాలు తమ ఆయుధాలు కొని, తమతోనే వాణిజ్యం చేయాలనడం, లేదంటే అక్కసు వెళ్లగక్కడం, విపరీతంగా సుంకాలు విధించడం, మేం చెప్పినట్లుగానే నడచుకోవాలనడం, ఫలానా దేశంతో వాణిజ్యం చేయవద్దనడం, అమెరికాకు వచ్చే విద్యార్థులపై ఆంక్షలు పెట్టడం వంటివన్నీ పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నాయి. ఇంత దారుణంగా గతంలో ఏ రాజ్యాధినేతా వ్యవహరించలేదు. ఏ దేశం ఏ దేశంతో వ్యాపార్యం చేయాలో నిర్ణయించడానికి ట్రంప్ ఎవరు? దేశాల మధ్య స్నేహ సంబంధాలను కూడా ట్రంపే నిర్దేశిస్తాడా? బుడ్డ పెత్తనాలు చేయడం, లేని పెత్తనాన్ని నెత్తికెత్తుకోవడం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం.
ఏ దేశమైనా తాను ఉత్పత్తి చేసే సరుకులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. తనకు అవసరమైన వస్తువులను అనువైన ధరలకు ఇచ్చే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. వ్యాపార, వాణిజ్యాలపై ఆయా దేశాలకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎక్కడి నుంచి ఏయే వస్తువులు ఎంతకు కొనాలో, సుంకాలు ఎంతెంత ఉండాలో ఏ దేశమూ ఏకపక్షంగా నిర్ణయించజాలదు. అమెరికా ఆధిపత్య ధోరణి ఈ ప్రాథమిక సూత్రానికి భిన్నంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే రష్యా అత్యంత చౌకగా ముడి చమురు, సహజ వాయువును సరఫరా చేస్తోంది. భారత్, చైనా తమ అవసరాలకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా అనుంగు ఆయిల్ కంపెనీలకు ఇది నష్టదాయకంగా పరిణమించి ఉండవచ్చు గాక, రష్యాతో ఎలాంటి వాణిజ్య లావాదేవీలు జరిపినా ఊరుకునేది లేదని నెలరోజుల క్రితం అమెరికా హూంకరించింది. ఇప్పుడు మనతోసహా, ఒక్కోదేశంపై ఆంక్షలు విధిస్తోంది. సుంకాలు పెంచుతామని బెదిరిస్తోంది. అమెరికా బెదరింపులకు తలొగ్గితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. పెట్రో ధరలు పెరిగి, నిత్యావసరాలపైనా ఆ భారం పడుతుంది. ఇప్పటికే నిరుద్యోగం, అల్పాదాయాలు, అధిక ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజానీకానికి ఇది మరింత దుర్భర స్థితిని కలిగిస్తుంది. కాబట్టి మోదీ ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టేలా అమెరికాకు గట్టి సమాధానం చెప్పాలి.
ఇదే సందర్భంలో నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కూడా తీవ్రమైన పరిభాషతో మన దేశాన్ని హెచ్చరించాడు. రష్యాతో వాణిజ్య వ్యాపారాలను వెంటనే నిలిపేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని బెదిరింపులకు తెగించాడు. ఒక సర్వ సత్తాక స్వతంత్ర దేశాన్ని ఇలా బెదిరించటానికి అతగాడికున్న హక్కు ఏంటి? మనతో శతృత్వం పెంచుకున్న పాక్‌ను చేరదీయడం, ఆయుధ సంపత్తిని, ఆయిల్‌ను పంపడం, ఆర్థిక సాయం చేయడం పాముకు పాలు పోసి పెంచుతున్నట్లే! అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేతను ట్రంప్ మరిస్తే, ఆ దేశానికి పాక్‌తో ఎప్పటికైనా పెను ప్రమాదం తప్పదు. భారత దేశం, మోదీ నమ్మకైన మిత్రడుంటూనే, ఈ తరహా బెదరింపులేంటి? ఆధిపత్య ధోరణికి అహంకారం, అరాచకం తోడైతే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతెన్నులను పరికిస్తే అర్థమవుతుంది. ఎలాన్ మస్క్ కే మస్కా కొట్టిన ట్రంప్ ఎంతటి ద్రోహియో అర్థం చేసుకోవచ్చు.
అధిక సుంకాలు విధిస్తానని గత ఏప్రిల్‌లోనే ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా సహా 30 దేశాలను బెదిరించిన ట్రంప్ చైనా తదితర దేశాల నుంచి ఎదురు సుంకాలు గొంతెత్తటంతో- అమలుకు 90 రోజులు గడువంటూ మిన్నకున్నాడు. ఒక పక్క ఇండియా – అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే- మన ఎగుమతులపై 25 శాతం సుంకాలను విధించటం, ఇది ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తుందంటూ ఏకపక్షంగా ప్రకటించటం తెలిసిందే. మన దేశంపై ఒత్తిడి తెచ్చి, తమ వాణిజ్య ప్రయోజనాలను సాధించాలన్నది అమెరికా వ్యూహంగా ఉన్నట్లుగా ఉంది. మన పక్కనే పక్కలో బల్లెంలా ఉన్న పాక్ ని ప్రోత్సహించడం, మనం వినకపోతే పాక్ మెడపై తుపాకీ పెట్టి మనల్ని కాల్చడమనే పన్నాగం కూడా ఉండి ఉంటుంది. ఇరాన్ పై దాడిని గమనిస్తే ఇలాంటి వ్యూహాలు అమెరికాకు ఆయుధాలతో నేర్చిన విద్యంగా గత చరిత్ర చెబుతున్నది. అయితే ట్రంప్ పెడధోరణిని అక్కడి ప్రజలే సహించడం లేదు. దీనికి భారత్ దీటైన సమాధానం ఇవ్వటం, అవసరమైతే అన్ని దేశాలను కూడగట్టడం అవసరం. అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవడానికి ఈ పిచ్చి ప్రేలాపణలను పరిష్కారంగా ఎంచుకొన్నుట్లుగా కనిపిస్తున్నది.
విస్తారమైన వ్యాపార అవకాశాలు ఉండడంతో మనదేశంలోకి తమ వ్యవసాయ, డైరీ, ఫార్మా ఉత్పత్తులతో ముంచెత్తాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోదీ, లక్షల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు, చమురు దిగుమతికి అంగీకరించింది. మరింత వాణిజ్య చొరబాటుకు ట్రంప్ దూకుడును పెంచాడు. తన కార్పొరేట్ తాబేదార్లను మన దేశంలో దించాలని ప్రయత్నిస్తున్నాడు. మేకిన్ ఇండియా అంటున్న మోదీ గట్టిగా స్వదేశీ నినాదంతో ముందుకు సాగాలి. అమెరికాయేతర దేశాలను కూడగట్టి చైనాలా నిలవాలి.
అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయలేమా!?|EDITORIAL
