ఒక విషయాన్ని ఎవరైనా సరే, వారి దృక్కోణం నుంచే చూస్తారు. ఆ విధంగానే స్పందిస్తారు. ఇది సాధారణం. కానీ, రాజకీయ నాయకులకు ఏది ఏ విధంగా, యధాతథంగా అర్థమైనా సరే, వారి మైలేజీని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు విషయంలోనూ ఈ విధంగానే స్పందించారు. నిజానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పెద్దగా కలిగించలనమేమీ కలిగించలేదు. తీర్పులో కొత్త విషయమేమీ లేదు. స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యం మంచిది కాదు. త్వరగా నిర్ణయం తీసుకోండి. మూడు నెలల గడువులోగా అయితే మంచిది. ఫిరాయింపులపై పార్లమెంటు స్పందించాలి. అన్న సూనలే చేసింది. కోర్టు పరిధిలోనే సుప్రీం తీర్పుంది. సూచనలు సరే, సరి. ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడుతుందని బీఆర్‌ఎస్ గట్టిగా నమ్మింది. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ సహా, ఫిరాయంపుదారులు కొంత భయపడినా, అంతగా ఏమీ జరగలేదు. ఒక రకంగా తీర్పు రాజ్యాంగానికి లోబడి, తటస్థంగా ఉంది. అయితే ఈ తీర్పుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా భాష్యాలు చెప్పుకున్నారు.
ఈ కోర్టు తీర్పులో చట్టాలను తయారు చేస్తున్న వారిని, సమీక్షించమని కోర్టు కోరింది. కానీ, ఆ చట్టాలను తయారు చేస్తున్న వాళ్ళే ఉల్లంఘిస్తున్న తీరు అత్యంత విషాదం. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. తమ పదేళ్ళ అధికారంలో టీడీఎల్పీని విలీనం చేసుకుని, కాంగ్రెస్ ను కకావికలం చేసి, కమ్యూనిస్టులను కూడా తమలో కలుపుకున్న బీఆర్ఎస్, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. కోర్టుకు వెళ్ళింది. నానా హంగామా చేసింది. గులాబీలను ఎవరూ పట్టించుకోలేదు. తీర్పులపై కూడా పెద్దగా ఆసక్తి కనబడలేదు. సుప్రీం తీర్పు వచ్చినా ప్రజల్లో చర్చ జరగలేదు. పైగా రాజకీయ పార్టీల అసలు రూపాలు ప్రజలకు అర్థమవుతున్న కొద్దీ రాజకీయ రంగంపైనే కాదు, నాయకుల మీద కూడా నమ్మకం సన్నగిల్లుతోంది.
ఇక కోర్టులు, వాటి తీర్పులపై రాజకీయ నాయకులకు, ఆయా పార్టీలకే కాదు బీఆర్ఎస్ కు కూడా విశ్వాసం ఉన్నట్లుగా ఎక్కడా కనిపించదు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపునే తీసుకుంటే, ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించారు. సుదీర్ఘ విచారణల తర్వాత చివరకు సుప్రీం కోర్టు జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు అప్పగించాలని ఆదేశించింది. ‘సుప్రీం’ చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాన్ని కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆనాడు సుప్రీం తీర్పును పట్టించుకోని, ఆదేశాలను అమలు చేయని బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు సుప్రీం తీర్పుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? తీర్పులను లెక్క చేయకపోవడం, చట్టాలను ఉల్లంఘించడం, అమలు చేయకపోవడం, అవినీతిలో కూరుకుపోవడం, కుటంబ సభ్యులకే పదవులు కట్టబెట్టుకోవడం వంటి అనేక అరచకాలను ఆనాడు ప్రజల అనుభవంలోనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతున్న మాట నిజం. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందన్న భ్రమల్లో బీఆర్ఎస్ ఉన్నట్లు ఉంది. పైగా జనం కాంగ్రెస్ కు ఓట్లు వేసి తప్పు చేశారని, వారే తిరిగి తమను గెలిపిస్తారని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు తమదే అన్న ధీమాతో కూడా ఆ పార్టీ ఉండటంలో తప్పులేదు. కానీ, కాంగ్రెస్ వైఫల్యాలకంటే బీఆర్ఎస్ అవినీతే ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. అందుకే భా పార్టీని ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జాన్ అబ్రహం వంటి వారు ఆ పార్టీని వీడుతున్నారు. అంతకుముందే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కంగ్రెస్ లో కలిసిపోయారు. ఫిరాయింపు భయం ఎంతో కొంత లేకపోతే, ఏ పార్టీలో గెలిచినా, ఎమ్మెల్యేంతా అధికార పార్టీల్లోనే ఉండేవారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా కాపాడు కోవడంతో పాటు, పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణుల్లో నమ్మకం కల్పించేం దుకు కేసీఆర్ కుటుంబం నానా తంటాలు పడుతోంది. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని ఆశపడుతోంది. అందుకే 3నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.
ఒకప్పుడు స్పీకర్లు పార్టీలకు అతీతంగా, న్యాయబద్ధంగా నడుచుకొనేవారు. వారి నిర్ణయాలు పార్టీలకు అతీతంగా చట్టాలకు నిబంధనలకు లోబడి ఉండేవి. కాలక్రమంలో స్పీకర్లు అధికార పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టారు. గత బీఆర్‌ఎప్ ప్రభుత్వ హయాంలో పాటించని నిబంధనల గురించి ఇవ్వాళ బిఆర్‌ఎస్ వాదిస్తోంది. స్పీకర్లు తమ స్వేచ్ఛను కోల్పోవడం వల్లే వారి అధికారాల్లో జోక్యం చేసుకోవాలని సుప్రీం గడప తొక్కుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం పరిమితులు ఉన్నందున వివాదాలు సత్వరం పరిష్కారం కావడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మరికొందరు పార్టీని వీడకుండా బీఆర్‌ఎస్ అడ్డుకోగలిగింది. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించింది. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనుకున్నా, చట్టసభలు-న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ తలెత్తరాదన్నా, పార్లమెంటు సమీక్షించాలని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. చట్టాలు సక్రమంగా అమలు కావాలి. ఉమ్మడి ఏపీలో వైఎస్ 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. అప్పుడు నైతికం, అక్రమమని కేసీఆర్ ఆక్రోశించారు. కేసీఆర్ సీఎం అయ్యాక అదే పని చేశారు. రెండోసారి సీఎం అయ్యాక స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. స్పీకర్లు, పాలకులు, పార్టీలు చట్టబద్దంగా వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
…..