వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం, పర్యావరణం ఇవి మానవ మనుగడుకు అత్యావశ్యం. కానీ, వీటినే మానవుడు అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. మానవుడు పుట్టిన నాటి నుండే ప్రకృతి విధ్వంసం మొదలైంది. ఆ రకంగా చూస్తే మనిషే ప్రకృతికి, పర్యావరణానికి మొదటి శత్రువుగా మారాడు. ఇష్టానుసారంగా అడవులను నరికివేస్తూ, అడవుల్లోని జంతుజాలాన్ని వేటాడుతూ, వాటి ఉనికికే ప్రమాదకారిగా మారాడు. ఈ కారణంగా ఇప్పటికే అనేక జంతు జాతులు నశించాయి. మనం బతికితే చాలు, మిగతా ఏమయితే మనకేమిటన్న ధోరణి ప్రబలింది. ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహిత మానవ ప్రవర్తన వల్ల అడవులు మాత్రమే కాదు. అటవీ జంతు జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదపుటంచుల్లో మనం జీవిస్తున్నాం. పర్యావరణ హితమైన పులుల జాతి కూడా మానవ హింసాత్మక ప్రవుత్తికి బలైపోతోంది. దీన్ని గమనించిన 2010 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూలై 29న ’అంతర్జాతీయ పులుల దినోత్సవా’న్ని పాటించడం ఆనవాయితీగా పెట్టింది. అయితే అది ‘పులుల దినం’గా ఆ రోజుకే పరిమితమై పోవడమే విచారకరం.
పులులను కాపాడుకోవడం, వాటి ఆవాసాలను సంరక్షించుకోవడం, అక్రమ వేటలను మానుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రాధాన్యాన్ని వివరించడం, టైగర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడం, టైగర్ రిజర్వులను నియంత్రించడం లాంటి అంశాల్లో సామాన్య జనాలకు అవగాహన కల్పించడానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలి. పిల్లుల జాతిలో అతి పెద్ద జంతువుగా పులికి పేరుంది. 2025 అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ‘మానవులు, పులులు సామరస్యంగా సహజీవనం చేయడం’ అనే ఇతివృత్తంగా పులుల సంరక్షణ బాధ్యతలను వివరించడం జరుగుతుంది.
కాగా, పులుల వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదు అవుతున్నది. వందేళ్ళ క్రితం లక్ష వరకు ఉన్న పులులు నేడు కేవలం 5,574 మాత్రమే ఉండడం విచారకరం. పులుల్లో చాలా అరుదైన జాతి రాయల్ బెంగాల్ -టైగర్. దీన్ని పెద్ద పులి అంటారు. ఇది మన దేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించదు. బెంగాల్ టైగర్ గాండ్రింపు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఇవి రోజుకు దాదాపు 21 కిలోల మాంసాన్ని తింటాయి. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లల్ని పెడుతుంది. పులులు పుట్టిన 18 నెలల నుంచే వేటాడటం మొదలు పెడతాయి.
ఇటీవల ఆదిలాబాద్ కవ్వాల్ రక్షణకు జివో 49ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. కానీ గిరిజనుల జీవనానికి ఇది అడ్డంకిగా మారిందన్న ఆందోళనతో అది అమలుకు నోచుకోలేదు. నిజానికి జీవవైవిధ్యం కాపాడటంలో పులులదే కీలక పాత్ర. అడవిలో ఒక ప్రాంతంలో గడ్డి, మొక్కలను తినే జీవజాతులను వేటాడే పులి భయానికి కొంత కాలం మేసి, అక్కడి నుంచి అవి మరో చోటకి పోతాయి. పులులు తిరిగి వేటాడుతూ, ఆ చోటకు వెళతాయి. అవి మరో చోటకి… ఇలా వెళ్ళడం వల్ల మొదటి జంతు జీవాలు ఖాళీ చేసిన ప్రాంతం తిరిగి పూర్వ స్థితిని సంతరించుకుంటుంది. ఆ విధంగా అడవి సంరక్షించబడటమేగాక, జీవ వైవిధ్యం కాపాడపడుతుంది. రానురాను అడవులు ధ్వంసం అవుతుండటం, వేటాడటం వల్ల పులుల సంఖ్య తగ్గిపోతోంది. సాధారణంగా ఒక పులి సంచరించే ప్రాంతం చుట్టు-పక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్ పిరమిడ్లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి ఉండాలి. ఒక్కో పులి మనుగడకి 25 వేల ఎకరాల అడవిని కాపాడుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.
ప్రపంచంలోని పులుల సంఖ్యలో సగానికి పైగా మన దేశంలోనే ఉన్నాయి. 1972లోనే పులిని జాతీయ జంతువుగా ప్రకటించి, తర్వాతి ఏడాది నుంచే ప్రాజెక్ట్ -టైగర్ ను ప్రారంభించింది. టైగర్ ట్రాకర్స్ వ్యవస్థను పటిష్ట పరిచింది. పులు వేటని నిషేధించింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. దేశంలో 48 పులి అభయారణ్యాలను ఏర్పాటు- చేశారు. ఇండియన్ రైల్వే, టైగర్ ఎక్స్ ప్రెస్ పేరుతో టూరిస్ట్ రైలు సేవలను కూడా ప్రారంభించింది. ఇందులో బాంధవగడ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్కులో సఫారీకి తీసుకెళ్తారు.
అయితే అడవులు అంతరించడం. అడవుల్లో నీటి కుంటలు లేకపోవడం వల్ల అవి ఊళ్లలోకి వస్తున్నాయి. నగరాల విస్తరణ, గ్లోబలైజేషన్ ప్రభావంతో రానురానూ అడవులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడలో ఉన్నాయి. అనేక టైగర్ జాతులు అంతరించి పోయాయి. పులుల సంఖ్య పెరగడం వల్ల పర్యావరణం పెరిగి, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. పులులు అంతరిపోవడానికి వేట, వాతావరణ మార్పులతోపాటు, పులి చర్మం, గోళ్లకు డిమాండ్ ఎక్కువ. చైనీస్ సంప్రదాయ వైద్యంలో పులుల గోళ్లు, పళ్లు, మీసాలను ఉపయోగిస్తారు. వాటి కోసం ఎక్కువ ధర చెల్లిస్తారు. అందుకే పులుల వేట, స్మగ్లింగ్ కూడా ఎక్కువైంది. దీంతో పులులు మాత్రమే కాక, ఇతర జీవులు కూడా అంతరిస్తున్నాయి. మానవ మనుగడ కోసం పులుల్ని, ఇతర జీవరాశులని సంరక్షించుకోడంతోపాటు అడవులు పెంచడం ఒక్కటే మార్గం.
…..