ప్రభంజన్ కుమార్ యాదవ్ ప్రతిభ గల జర్నలిస్టు, కవి, రచయిత, వరంగల్ జిల్లా వాసి. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. భాషా శాస్త్రం, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ & జర్నలిజం (ఎం.సి.జె.) చదివిండు. రూరల్ & డెవలప్మెంట్ కమ్యూనికేషన్ ఐచ్ఛికంగా ఎం.ఫిల్ పూర్తి చేసిండు.
1988 నుంచి వివిధ తెలుగు పత్రికల్లో దశాబ్ద కాలం జర్నలిస్టుగా పనిచేసిండు. జర్నలిజంలో నిలదొక్కుకోవాలనుకున్నడు. 1998లో భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్షేత్ర ప్రచార శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా, స్వభావ రీత్యా నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో నిమగ్నమైండు. ఆత్మవంచన, శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేసే బహుకొద్దిమంది ప్రభుత్వ అధికారుల్లో ప్రభంజన్ కుమార్ యాదవ్ ఒకడు.
స్వభావ రీత్యా ప్రభంజన్ చాల సెన్సిటివ్. పేద ప్రజల పట్ల, ఉత్పత్తి కులాల పట్ల అభిమానం, ఆదరణ గల వ్యక్తి అనడానికి ఆయన రచనలే ప్రత్యక్ష సాక్ష్యం. జర్నలిస్టుగా ప్రభంజన్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను పుస్తకంగా తీసుకురావడం సంతోషం. నడుస్తున్న చరిత్రను సజీవంగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభంజన్ ది. నిజాలను నిర్భయంగా రాసే సాహసం ఆయన కలానిది. అన్యాయం ఏ రూపంలో ఉన్నా ప్రశ్నించడం ప్రభంజన్ మనస్తత్వం. రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం ఆయనది. ఏ రోటికాడి మాట ఆ రోటికాడ చెప్పడం చాతకానివాడు. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరగటం తెలియనివాడు. నిష్టూరమైనా పరవాలేదని నిగ్గు తేల్చాలనుకునేవాడు. కష్టాలకు, నష్టాలకు వెరవడు. ఏటికి ఎదురీదడమే తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభంజన్ ప్రజల పక్షపాతి. ఆయన రచనల్లో ప్రతిబింభించిన ఉత్పత్తి కులాల ఆవేదన, బీదల బాధలు అందుకు నిదర్శనం. ప్రజల ఆలోచనలకు, ఆవేదనలకు ప్రభంజన్ అక్షర నివేదనే ఈ వ్యాస సంకలనం.
‘ప్రభంజన పథం’
“గొల్లల సంస్కృతి-గొప్ప సంస్కృతి” అనే పరిశోధన వ్యాసంతో మొదలైంది ఈ పుస్తకం. ఈ సమాజానికి తన కులం ‘అయిదు రకాల పరిశ్రమలను, ఉత్పత్తులను అందించినందుకు ప్రతిఫలం అవమానమా?’ అని ప్రభంజన్ నిలదీసిండు. శ్రమను గౌరవించని దోపిడి సంస్కృతిని ఈసడించుకున్నడు. వెట్టిచాకిరి చేస్తున్న రజకుల కష్టాలు తీరాలన్నడు. గీత కార్మికులకు ఊతం యివ్వాలని, వెలవెల బోతున్న నేతగాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాలన్న ఆశతో రాసిండు. మూలవాసుల విముక్తి బాటలో కలిసి పయనించిండు. దళిత గేయాలు రాసి పల్లవి కలిపిండు. దళిత రచయితల, కళాకారుల, మేధావుల (దరకమే) ఐక్యవేదికలో, నాస్తిక సంఘంలో పనిచేసిండు. రచనలు, ఉపన్యాసాలతోనే ఊర్కోలేదు. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నడు. జన చైతన్యం కోసం సంఘటిత ఉద్యమాల్లో భాగస్వామి అయిండు. ఆచరణే గీటురాయని నిరూపించిండు.
‘చూడు చూడు వాడలు నిర్లక్ష్యపు నీడలు’ అన్న వ్యాసంలో ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టిండు. ‘జనజీవనాడి పాట’, ‘పరిగెత్తే కాలంతో పయనించలేక’, ‘బతుకు బాటలో ఒంటరి పయనం’, ‘బూటకపు ఎన్ కౌంటర్లలో బలహీన వర్గాలే బలి’, ‘కమ్యూనిస్టులకు కనువిప్పు కలిగే మేడే ఏనాడో!’, ‘కమ్యూనిస్టులకు కుల నిర్మూలన ఇప్పుడు గుర్తొచ్చిందా!’, ‘సామాన్యుడి ముంగిట ఇంకా వికసించని విద్యుత్తేజం’ అన్న వ్యాసాలతో అన్ని వర్గాల ప్రజల కోసం స్పందించిండు. కమ్యూనిస్టు పార్టీలు కుల సమస్యను గుర్తించినా సామాజిక అసమానతలను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణకు ఉపక్రమించలేదని ప్రశ్నించిండు. కమ్యూనిస్టులే ఐక్యం కానప్పుడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపివ్వడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసిండు.
ప్రభంజన్ వ్యంగ్య రచనలు కూడా చేసిండు. ‘లత్కోర్ కౌంటర్’, ‘భలే ఓట్లు…. బాయినెట్లు’, ‘రామోజీరావు గారు అందుకో ఈ లేఖ’, ‘నేనే రారాజు చూసేవాళ్లే బేజారు’ అన్న రచనల్లో సూటిగా చురకలంటించిండు. కథనం చాల సాఫీగా సాగిపోయింది.
ఈ రచనలతో పాటు ప్రభంజన్, యాదవ కులాన్ని సమీకరించిండు. సమాజంలో యాదవులు బాగా వెనకబడి ఉన్న సంగతి తెలిసిందే. యాదవ కులంలో మేధావి వర్గం కూడా తక్కువే. అటువంటి యాదవ కులాన్ని సమీకరించడమే కాక, మేధావి వర్గాన్ని ఆర్జనైజ్ చేయాల్సిన అవసరముందని గుర్తించిండు. యాదవ మేధావుల ఫోరానికి వ్యవస్థాపక కన్వీనర్ గా పనిచేసిండు. నేను రాసిన “గొల్ల కురుమలు ఈ సమాజానికి ఏం చేసిండ్రు?”, “డోలు దెబ్బ” పాటల సంకలనాన్ని మేధావుల ఫోరం తరపున వెలువరించడంలో కన్వీనర్ గా కీలకపాత్ర పోషించిండు.
ప్రభంజన్ పాటలు కూడా రాసిండు. దొడ్డి కొమురన్న పాట చాల మంచి పాట. దొడ్డి కొమురయ్య జీవితాన్ని తిరిగి మనకు గుర్తు చేస్తుంది. ‘మంద కదిలింది రా జంబాయిరే’ అనే పాట కూడా యాదవ జీవన పోరాటాన్ని అద్దంలో చూపుతుంది.
ప్రభంజన్ వ్యాసాలు, పాటలు, కవితలు, కథలు కూడా రాసిండు. రచనలన్నీటిలోనూ సామాజిక స్పృహ, చైతన్యం కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనం లేని రచనలు చేయడమెందుకని ప్రశ్నిస్తాడు కూడా!
-ఆచార్య కంచె ఐలయ్య
(23/3/2004న రాసిన వ్యాసం)