దోయి, దాయి అన్నది పవర్ లోకి వచ్చిన పార్టీ ప్రభుత్వాల పనిగా మారింది. అధికారం అందితే చాలు, దొడ్డి దారిన దోపిడీ చేయాలి. దొంగదారిలో దాచుకోవాలి. అవకాశం దొరికితే కాదు, కల్పించుకుని మరీ ఏదో రకంగా డబ్బులు వెనకేసుకోవడం రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పాలకులు అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నా, కేంద్రం చోద్యం చూస్తోంది. ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇప్పుడు బీజేపీ వంతపాడుతోంది. ఏపీ తానా అంటే కేంద్రం తందానా అంటోంది. చంద్రబాబు ఎంపీల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. బాబు కూడా ఇదే అదనుగా తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. మోడీ, అమిత్ షాలు కూడా బాబు ఆడించినట్లు ఆడుతున్నారు.
విశాఖ ఉక్కుకు నిధులు కేటాయించారు. పోలవరంకు పోలోమంటూ నిధులిచ్చారు. అమరావతికి అడిగినన్ని ఇచ్చేశారు. విశాఖలో యోగా డేకు రమ్మనగానే కిమ్మనకుండా ప్రధాని వచ్చారు. కేంద్ర మంత్రులు వలస పక్షుల్లా ఏపీకి అదేపనిగా వచ్చి వాలుతున్నారు. అశోకగజపతిని గవర్నర్‌ను చేశారు.
ఇదే అదనుగా చంద్రబాబు అమరావతిలో ఇప్పటికే సేకరించిన 35వేల ఎకరాలు సరిపోవంటూ మరో 40వేల ఎకరాలకు ఎసరు పెట్టారు. విభజన తర్వాత తొలి ఐదేళ్లలో అమరావతిని పూర్తి చేయలేదు. పోలవరాన్ని పట్టాలెక్కించలేదు. పోలవరం నిర్వాసితులను నిలువునా ముంచారు. ఇప్పటికీ వారు కూడు, గూడు కోసం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు. విభజన టైమ్ లో ఏపీలో కలుపుకున్న ఐదు మండలాల సంగతి మాట్లాడటం లేదు. భద్రాచలం ఇవోపై దాడి చేసినా దిక్కు లేదు. పోలవరం ఇంకా పూర్తి కానేలేదు. పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చంద్రబాబు హడావుడి చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నదుల నీటి సమస్యలపై రాష్ట్రాల రౌడీల్లా తన్నుకున్నా పట్టించుకోని కేంద్రం, చంద్రబాబు చెప్పగానే బనకచర్లపై మాట్లాడుకుందాం రా.. అంటూ తెలంగాణ సీఎంకు కబురు పెట్టడం ఆశ్చర్యమే. అసలు నీటి కేటాయింపుల వివాదాలు మిగిలి ఉండగానే, కొత్తగా బనకచర్లపై కేంద్రం మధ్యవర్తిత్వమేంటి? ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచించకుండా, చర్చలేంటి?
చంద్రబాబు చేస్తున్న హడావుడి చూస్తుంటే బనకచర్ల మరో కాళేశ్వరంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. కేవలం డబ్బులు దండుకోవడానికే ఈ ప్రాజెక్టుపై తెగ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పుల పాలైన ఏపీ సర్కారు, బనకచర్ల కోసం మరో రూ. 82వేల కోట్ల అప్పు చేసేందుకు ఎందుకు ఉబలాటపడుతోంది? అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు మొత్తుకుంటున్నా వినడం లేదు? ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్ నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు? చంద్రబాబు ఎక్కిడికి వెళ్లినా బనకచర్లను బంకలా పట్టుకున్నారు. మిగులు జలాలని తెగ పలవరిస్తున్నారు. గతంలో తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు అటు- ఏపీలో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ బడా కాంట్రాక్ట్ సంస్థే.. ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టునూ చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. కావాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఆ కాంట్రాక్ట్ సంస్థ ఆఫర్ ఇచ్చినట్లు అక్కడి అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17 వేల ఎకరాల అటవీ భూములు సేకరించి, 18 గ్రామాలను ముంచి, 10 లిఫ్టులు పెట్టి, వేల కోట్లు కరెంటుకు ఖర్చు పెడ్తూ, 575 కిలోమీటర్ల మేర నీటిని ఎత్తిపోయడం అసాధ్యమని వేరుగా చెప్పనక్కరలేదు. కాళేశ్వరాన్ని మహాద్భుత కట్టడంగా కేసీఆర్ ప్రచారం చేసి లక్ష కోట్లు తగలేశారు. అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఏసీబీకి చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. బనకచర్ల పేరుతో ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ డెవలప్ చేసి, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని మళ్లించే ఎత్తుగడ కుట్ర కోణం కూడా ఇందులో దాగివుందని స్పష్టమవుతున్నది. బీఆర్‌ఎస్ హయాంలో లాగే ఏపీలోనూ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఫాలో అవుతున్నట్లుగా ఉంది. బనకచర్లకు రూ.82 వేల కోట్లన్నది ప్రస్తుత అంచనా మాత్రమే అది లక్ష కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లను తరలించే సెగ్మెంట్ పనులకు టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. పనిలో పనిగా సెగ్మెంట్ పనులను సైతం సమాంతరంగా చేసే అంశంపైనా కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం రీతిలో సబ్ కాంట్రాక్టుల దందాకు తెరలేపు తున్నట్టు తెలుస్తోంది. లక్షల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంజనీర్లు, మేధావులు అంటున్నారు. పోలవరం పూర్తయితే తప్ప నీటి చుక్క కూడా తరలించే పరిస్థితి లేనప్పటికీ చంద్రబాబు మాత్రం బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పడంపై ఏపీలో ఇరిగేషన్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. బనకచర్లకు వ్యతిరేకంగా విజయవాడ కేంద్రంగా ఇటీవల ఆలోచనాపరుల వేదిక పురుడుపోసుకుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేదిక బాధ్యులు మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వర్రావు, కంభంపాటి పాపారావు, అక్కినేని భవాని ప్రసాద్, టి.లక్ష్మీనారాయణ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిన ఏపీపై బనకచర్ల పెనుభారం కానుందని, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. మరివి ప్రజలకు పట్టేనా?