ప్రపంచమంతా అప్పుల్లోనే…
పాలకులంతా గొప్పల్లోనే…
ప్రపంచం అప్పుని ప్రతి ఒక్కరికీ పంచితే రూ.11 లక్షలు
మన రాష్ట్రాల అప్పుని పంచితే ఒక్కొక్కరిపై రూ.1.18 లక్షలు
కాదే దేశం రుణాలకనర్హం! ప్రపంచమంతా అప్పుల మయం!! పాలకుది గొప్పల జపం!!! చివరకు ఆ దెయ్యాల దిబ్బ కూడా.. గొప్పల కొప్పుల అప్పుల కుప్పే!?
ప్రపంచంలో ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రపంచం మొత్తం అప్పు 102 ట్రిలియన్ డాలర్లు అంటే రూ. రూ.8,67,53,95,80,00,00,001. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి కంటే ప్రపంచ రుణం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ రుణం మొత్తం జీడీపీలో 93 శాతానికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యధిక రుణాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం ఆ అప్పుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పంచితే దాదాపు రూ.11 లక్షల ఉంటుంది. దేశంలో యూపీఏ హయాం వరకు 60 లక్షల కోట్లు ఉన్న దేశం అప్పు, వడ్డీలకి కావాల్సిన కొత్త అప్పులతో రూ.160 లక్షల కోట్లుకు చేరుకుంది. ఇక దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు రూ.8.3 లక్షల కోట్లతో 1వ స్థానంలో ఉంది. తెలంగాణ రూ.5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ రూ.4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తిపై దాదాపు రూ.1.18 లక్షలు అప్పు ఉన్నట్లు తేలింది!
‘అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు. జోడెద్దుల్లా ప్రభుత్వాలను నడిపిస్తున్నవి అవే. బండికి రెండు ఇరుసుల్లా ఆ రెండే ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి.’ ఇలా పాలకుల ఆర్భాటాలు, ప్రచార పటాటోపాలు ఉంటున్నాయి. బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి చెరి సమానమైన కేటాయింపులు ఉంటున్నాయనేది ఈ మాటల అర్థం. కానీ, పరమార్థం వేరే ఉంది. మొత్తం బడ్జెట్ లో సగం ఉద్యోగుల జీత, భత్యాలకే పోతోంది. మిగిలిన సగంలోనే చెరిసగం కేటాయింపులుంటున్నాయి. ఇందులోనూ మరో మాయ ఉంది. ఫలానా చోట నుంచి నిధులు వస్తాయని ఊహించి లేదా అంచనా వేసి, రాబడిని అధికంగా చూపి, ముందుగా బడ్జెట్ ని అమాంతం పెంచేస్తారు. ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ పెట్టామని గొప్పలు పోతారు. కేటాయింపుల్లో అరకొర కూడా ఖర్చు చేయరు. ప్రభుత్వాల ప్రాథామ్యాలన్నీ, ప్రజావసరాలు కాకుండా..పార్టీల, పాలకుల ప్రాధాన్యతలను బట్టి ఉంటాయి. అధికారంలోకి రావడానికి అవసరమైన హామీలేవో ఇచ్చేస్తారు. వాటిని అమలు చేయడానికి నానా తంటాలు పడుతూంటారు. దీంతో అసలు బడ్జెట్ కు, కేటాయింపులకు, చేసే ఖర్చులకు, అమలు జరిగే పనులకు, వాటి ద్వారా జరిగే అభివృద్ధికి ఏమాత్రం పొంతన, పోలికలుండవు. ఇది సాధారణంగా ప్రభుత్వాల్లో జరిగే తంతు. పైకి మాత్రం పటాటోపం ప్రదర్శిస్తుంటారు. పవర్ లో ఉంటారు కాబట్టి వారు చెప్పిందే వేదంలా ఉంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే, ప్రతిపక్షాల అరుపులకు చిల్లిగవ్వా రాలదు. పైగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా చేయలేదా? ఇలా మేం చేస్తే తప్పేంటి? అన్న అహంకార పూరిత బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అధికార, ప్రతిపక్షాలు ఇవ్వాళ నీవంతైతే, రేపు నావంతు! అన్నట్లుగా పైకి బాగా తిట్టుకుంటూ, లోపల ఒకరికొకరు సహకరించురకుంటూ హాపీగా కాలం గడిపేస్తుంటారు. పిచ్చి ప్రజలు మాత్రం తమకేదో ఒరుగుతుందని బోలెడు భ్రమల్లో కాలం వెల్లదీస్తూంటారు.
ప్రపంచంలో ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రపంచం మొత్తం అప్పు 102 ట్రిలియన్ డాలర్లు అంటే రూ. రూ.8,67,53,95,80,00,00,001. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా అత్యధిక రుణాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం ఆ అప్పుని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పంచితే దాదాపు రూ.11 లక్షల ఉంటుంది. దేశంలో యూపీఏ హయాం వరకు 60 లక్షల కోట్లు ఉన్న దేశం అప్పు, వడ్డీలకి కావాల్సిన కొత్త అప్పులతో రూ.150 లక్షల కోట్లుకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే, దేశంలో ప్రతి భారతీయుడి మీదా 11 లక్షల అప్పు ఉందని ఓ అంచనా. ఇక దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు రూ.8.3 లక్షల కోట్లతో 1వ స్థానంలో ఉంది. తెలంగాణ రూ.5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ రూ.4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తిపై దాదాపు రూ.1.18 లక్షలు అప్పు ఉన్నట్లు తేలింది.
పాలకుల ధోరణి ఎంత దౌర్జన్యంగా మారిందంటే, అప్పులు చేసి అభివృద్ధి చేశామని, ఆస్తులు పెంచామని నిస్సిగ్గుగా ప్రకటిస్తుంటారు. పైగా అప్పులు చేయందెవరు? అంటూ దబాయిస్తారు. ఇదే వైఖరిని ఆర్థిక క్రమశిక్షణ అంటూ ప్రచారం చేసుకుంటారు. పాలకుల ఈ ధోరణుల కారణంగా ఏటేటా అప్పులు పెరుగుతున్నాయి. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోక, స్టేటు రియల్ ఎస్టేటుగా మారుతోంది. సీఎంలు సీఇఓలుగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా రియల్ దందా చేస్తూ, పాలకులు, ప్రతిపక్షాలు వెరసి నేతలంతా కలిసి కమీషన్ ఏజెంట్లుగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. ప్రభుత్వాలనే రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మార్చి, ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ పోతున్నారు. ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా పందేరం చేసి, ఖజానాను ఖాళీ చేసేస్తున్నారు.
సంక్షేమ పథకాలే అభివృద్దికి సోపానాలన్న చందంగా పాలన సాగుతోంది. విద్య, వైద్య రంగాలను విస్మరించారు. మంచినీటి సరఫరా సరిగా జరగడం లేదు. రోడ్ల విస్తరణ కానరావడం లేదు. దోమల నిర్మూలన అటకెక్కింది. పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో ఆర్థిక కార్యకాలాపాలు సాగడం లేదు. అయినా కొత్త కొత్త ఉచిత సంక్షేమ పథకాలతో దానకర్ణుడి పోజు కొడుతున్నారు. చేతికి ఎముకే లేదన్నట్లుగా దాన ధర్మాలు చేసేస్తున్నారు. ఇదే అసలైన అభివృద్ధి నమూనా అంటూ, దేశానికి ఆదర్శ పాఠాలు వల్లె వేస్తున్నారు.
ఉచిత విద్యుత్, ఉచిత బియ్యం, అందులోనూ సన్న బియ్యం, ఉచిత బస్సు, తిరిగి కట్టాల్సిన అవసరమే లేకుండా రకరకాల బంధుప్రీతి పథకాల అమలు జోరుగా కొనసాగుతోంది. ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయడం, ఆ అప్పులకు వడ్డీలకు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం, వివిధ రూపాల్లో చివరకు చెత్త పన్నులు పెంచడం, పాలకులకు అలవాటైంది. ఆదాయం పెంచే శాఖలపై ప్రేమతో అదేపనిగా సమీక్షలు చేస్తున్నారు. నిజానికి రైతులకు ఎంత ఉచిత విద్యుత్ అవసరమో సర్కార్ దగ్గర లెక్కలేలేవు. భూములు, కమతాలు, వాటి భూసారం, సాగయ్యే భూములు, పండే పంటలు, దిగబడులు, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు వంటివాటిపై ప్రభుత్వాల దగ్గర లెక్కలు లేకుండా పోయింది. అందుకే లెక్కలేకుండా ఖర్చు చేయడం పరిపాటైంది. నిజానికి ఉచిత విద్యుత్‌ను కూడా లెక్కగట్టి ఇవ్వాలి. ఏ పంట పండిస్తారో చూడాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో విద్యుత్ కొని ఇస్తున్నప్పుడు దానికి లెక్కా పత్రం ఉండాలి. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఖర్చు పెడుతున్న ప్రతిపైసా ప్రజలు కట్టే పన్నుల్లోంచి వస్తున్నవే. పాలకులు, అధికారులెవ్వరూ తమ జేబులోంచి చిల్లిగవ్వా ఖర్చు చేయరు. పథకాలేవైనా దుబారాను అరికట్టాలి. దూరదృష్టి లేకుండా పథకాల పేరుతో దుబారా చేస్తే నష్టపోయేది ప్రజలే!
జీతాలివ్వలేని దుస్థితి ప్రభుత్వాలకు ఎందుకు వస్తున్నది. కాంట్రాక్టర్లకు పైసలివ్వలేని ఖర్మేంటి? పాలన అంటే పప్పు బెల్లాళ్ళా పంచిపెట్టడమా? ఓట్ల కోసం సర్కార్ ఖజానాకి తూట్లు పెట్టడమా? అధికారమంటే ప్రజల జేబులు కొట్టడమా? ఉచిత పథకాలపై సమీక్ష లేదా? డబ్బుల పందేరానికి ఫుల్ స్టాపు లేదా? దుబారాపై దబాయించేది లేదా? ఉచిత పథకాల కారణంగానే ప్రభుత్వాలు అప్పుల ఊబీలో కూరుకుపోతున్నాయి. 78 ఏళ్ల స్వాతంత్ర్యం తరవాత కూడా ఇంకా పేదలు అంటూ పాలన చేయడం సరికాదు. ఇంతకాలానికి కూడా దేశంలో పేదరికం పోలేదంటే, మన పాలకులు, వారి పాలన పస ఎంతో తెలుస్తోంది. బంగారం, వెండి పళ్లెంలో అన్నం పెట్టాలని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రజలు గౌరవంగా బతికేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటే చాలు. అదే మేలు.