ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకం లోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం అర్ధం ‘ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది’. ఈ వాక్యం స్ఫూర్తితోనే ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నానుడి మొదలైంది. ‘వృక్షాలను మనం రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి’. ప్రస్తుతం భూ ఉపరితలం దాదాపు 31% అడవులతో కప్పబడి ఉంది. వ్యవసాయం విస్తరించడానికి ముందు ఉన్న అటవీ విస్తీర్ణం కంటే ఇది మూడింట ఒక వంతు తక్కువ. ఆ నష్టంలో సగం నష్టం గత శతాబ్దంలో సంభవించింది. దాదాపు బంగ్లాదేశ్ దేశమంత పరిమాణంలో ఉన్న 1.5 నుండి 1.8 కోట్ల హెక్టార్ల అడవులు ప్రతి సంవత్సరం నాశనం అవుతున్నాయి. సగటున ప్రతి నిమిషానికి 2,400 చెట్లు నరికివేయబడుతున్నాయి. ఇక 2015 నివేదిక ప్రకారం, భారతదేశ భూభాగంలో 23% మాత్రమే అటవీ ప్రాంతం ఉంది. అది రాను రాను తగ్గుతూ వస్తున్నది. ఇక తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,077 కిలో మీటర్లు ఉండగా, అడవులు 26,903.70 కిలోమీటర్ల మేర అంటే 24శాతం ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం. తద్వారా వానలు వాపస్ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల మొక్కలను నాటటం ద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణ వాయువును పెంచటం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం. లక్ష్యంగా మొక్కల పెంపకం అనేది జరగాల్సిఉంది.
ఆక్సిజన్ లేకుండా, ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు. భూమి పై ఉన్న వాయువులలో 20.9% ఆక్సిజన్‌ను కలిగి ఉంటాయి. ప్రతి ప్రాణి ఆక్సీజన్ పైనే ఆధారపడి జీవిస్తాయి కాబట్టి మొక్కలు చాలా అవసరం. అడవుల పట్ల అవగాహన కల్పించేందుకే ఐక్యరాజ్య సమితి మార్చి 21వ తేదీని ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవం గా జరుపుకోవాలని సూచించింది. 2025 అటవీ దినోత్సవ థీమ్ ను ‘ఆహార భద్రత కోసం అడవులు, వైద్య పర్యావరణ వ్యవస్థలు’ గా నిర్ణయించి, నిర్వహించింది.
అయితే, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని ప్రజలు తమకు సంబంధం లేని విషయంగా ఏనాడో మరిచి పోయారు. గతంలో చెరువుల, పొలంగట్లు, ఇళ్ళ ముందు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం విధిగా భావించేవారు. కాలం మారింది. ప్రజల జీవన విధానం మారింది. దీంతో పర్యావరణ రక్షణకు అవసరమైన మొక్కలను పెంచడం మానేశారు. దీనికితోడు వెనకటికి పెంచిన చెట్లను తెగనరుకుతున్నారు. గ్రామాలు ఎడారులుగా మారుతున్నాయి. మొక్కలు పెంచడం కూడా ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లుగా తయారయ్యింది.
అడవుల నరికివేత కారణంగా గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. చెట్లు ఉండటం వల్లే కోతులు వస్తాయన్న కొత్త సిద్దాంతం మొదలైంది. పొలం, చెలకల్లో కూడా చెట్లను నరికి పడేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం సోమవారం నుంచి మొదలు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రారంభించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ హరితహారం నిర్వహించి విరివిగా మొక్కలు నాటారు.
ఈ ఏడాదిలో వనమహోత్సవంలో తెలంగాణ వ్యాప్తంగా 18.02 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కలుపు మొక్కలు, విదేశీ జాతులను తొలగించి, కొత్తగా మళ్లీ మన నేలలకు అనువైన మనజాతి మొక్కలను నాటాల్సిన అవసరం ఉంది. కలప, పండ్లు, పూలు, వివిధ రకాల వెదురు జాతులను నాటాలని ప్రణాళిక రూపొందించి, అమలు చేయాల్సిఉంది.
తెలంగాణలో రైతులకు వ్యక్తిగత ఆదాయానిచ్చే పండ్ల మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు పంపిణీ చేస్తున్నారు. ఇంటి ఆవరణంలో పెంచే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పూల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకో నున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేస్తేనే, వర్షాకాలం పూర్తయ్యేనాటికి నాటిన మొక్కలు దాదాపు 90 శాతంకు పైగా బతుకుతాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, ప్రకృతి ప్రేమికులను భాగస్వాములుగా కాలవాల్సి ఉంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. ఇంటి పేరట్లో గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు- పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను పంపిణీ చేసి ప్రజలు పెంచేలా చేయాలి. వనమహోత్సవంలో గ్రామీణాభివృద్ధి శాఖ అత్యధికంగా 7 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటేందుకు కావాల్సిన గుంతలను సిద్ధం చేసి ఉంచారు. ఇంటింటికి ఆరు చొప్పున మొక్కలు పంపిణీ చేయనున్నారు. 25 లక్షల మొక్కలు తాటి, ఈత మొక్కలు నాటనున్నారు. అంతే కాకుండా రైతులకు ఆదాయాన్ని సమకూర్చే పండ్ల మొక్కలు నాటేందుకు తొలి ప్రాధాన్యత కల్పించారు. 22 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు పెంచనున్నారు. ప్రజల్లో చైతన్యాన్ని పెంచేందుకు గ్రామాల వారీగా కార్యక్రమలు చేపడితే మంచి ఫలితం ఉంటుంది.