దేశంలో ఆర్థిక నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సరిహద్దులు దాటి ఇతర దేశాల నేరగాళ్ళు మన ప్రజలపై దోపిడీకి దిగుతున్నా సరిదిద్దుకోలేకపోతున్నాం. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరగాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఎంజాయ్ చేస్తున్నా వారిని పట్టుకొచ్చే పనిలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్నది ఇంటా బయటా దోపిడీ అవుతున్నా రక్షణ లేకుండా పోయింది. చివరకు బ్యాంకులు కూడా తమ పూచీ లేకుండా ప్రవర్తించే తీరు అత్యంత దారుణం. తీసుకున్న అప్పులకు ఖాతాదారులు బాధ్యత వస్తున్న విధంగా ఆ ఖాతాదారులు దాచుకున్న డబ్బు, నగానట్రాకు ఆ బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి కదా! సరే, ఆర్థిక నేరాల అదుపునకు ప్రభుత్వాలు చేస్తున్నదేంటి? ప్రజల విలువైన ప్రాణాలకు, వారు కూడబెట్టుకున్న ఆస్తులకు, దాచుకున్న డబ్బులకు రక్షణ, భద్రత లేకుపోతే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రజాస్వామ్యంలోనేనా? పరస్పరం పీక్కుతినే ఈ దోపిడీకి అంతుపొంతు, అడ్డూ అదుపూ లేదా?
ప్రపంచంలో కొందరిలో, ఆ మాటకొస్తే ప్రజల్లో ‘ఈజీ మనీ’ అనే ఓ జాఢ్యం వేళ్ళూనుకుని, పెరిగి పెద్దదై తన విక్రుత రూపాలను రకరకాలుగా ప్రదర్శిస్తున్నది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. ఎంజాయ్ చేయాలి? అందుకు ఏ దారైనా ఫరవాలేదు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు జరిగేవి. వస్తువులను ఎత్తుకుపోయేవారు. ఫలానా దోపిడీ జరిగిందంటే ఫలానా వాళ్ళే చేసి ఉంటారన్న క్లూ లు పోలీసులకు దొరికేవి. దొంగలు కూడా కన్నాలు వేసే వాడు డోర్లు బార్లా తెరిచి ఉన్నా కన్నాలు మాత్రమే వేసేవాడు. ఇప్పుడలా కాదు. పుట్టి, పెరిగి పెద్దదై పోయిన శాస్త్ర సాంకేతికతను నేరగాళ్ళు విరివిగా విస్తారంగా వినియోగిస్తున్నారు. అర చేతిలో వైకుంఠం లాగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్నే ఆసరా చేసుకుని, ఇస్మార్ట్ గా దోపిడీలు చేసేస్తున్నారు. తెలియని నెంబర్ల ఫోన్ ఎత్తితే, మెస్సేజ్ లు, లింకులు ఓపెన్ చేస్తే, చేయకపోయినా బ్యాంకుల అక్కౌంట్లల్లో డబ్బులు ఇట్టే మాయం అవుతున్నాయి. వీళ్ళందరినీ సైబర్ నేరగాళ్ళంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ, వాడు తినడానికి ఫోన్ బూచీని చేతిలో పెట్టి, అలవాటు చేసి, అదే చదవాలని ఒత్తిడి చేసి, లక్షలు, కోట్లు పోసి, చదివించి, అలాంటి ఉద్యోగాలే చేయాలని ప్రోత్సహించి, బాగా చదవుకోరా? గొప్పగా ఎదగరా? అంటూ మనం చదివించిన మన పోరగాళ్ళే, పోకిరీలే ఈ దోపిడీ ముఠాలుగా మారుతున్నారు. ఫోన్లు మాత్రమే కాదు, ఫోన్ల సమాచారం మాత్రమే కాదు, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు మాయం అవుతుంటే తెల్లబోవడం తప్ప చేయగలిగింది లేకుండా పోతోంది. పనిలోపనిగా కొందరు ప్రజల్లో ఈ ఈజీ మనీ బలహీనతలను కూడా సొమ్ము చేసుకుంటూ అనేకానేక యాప్ ల దాకా, కష్టపడి ఏదో చేద్దామనుకునే వారికి వర్క్ ఫ్రం హోం పేరుతో.. ఇలా అనేక కొత్త కొత్త దోపిడీ ఆవిష్కరణలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
ఇక బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేసిన మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారంతా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలోనే ఉన్న మరికొందరు ఎగవేతదారులు రాజకీయాలను అడ్డం పెట్టుకుని దర్జాగా బతికేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న వారు పదవులు వెలగబెడుతున్నారు. రాష్ట్రాల వనరులను లూటీ చేసిన వారు, దేశ సంపదను దోచిన వారు మన ఓట్లతో గెలిచి, మనమిచ్చిన పదవులతో మనలనే పరిపాలిస్తున్నారు. రాజకీయ నాయకుల, వ్యాపారుల అవినీతి కారణంగా దేశ వనరులు దెబ్బతింటున్నాయి. ఖజానా ఖాళీ అవుతోంది. వారి జీత భత్యాలు, వారి విలాసాల కారణంగా లక్షల కోట్లు ఏటా వృధా అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను మేపడానికి అవుతున్న లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగమానదు. అధికారం, దర్పం అనుభవించడానికే చాలామంది రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నారు. కానీ సామాన్యులు, ఓట్లేసిన వారు మాత్రం అడుక్కునే పరిస్థితి కల్పించి వారికి ఉచిత పథకాల బిచ్చమేస్తున్నారు.
అవినీతి, అక్రమాల కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నా, అరికట్టడంలో విఫలం అవుతున్నారు. ఇక దేశంలో విరవివిగా రుణాలు ఇచ్చి, ఉపాధిరంగాలను ప్రోత్సహిస్తే యువత సమస్య తీరేది. నిరుద్యోగులకు ఉపాధి దక్కేది. భారతీయ బ్యాంకులు సామాన్యులకు రుణాలు ఇవ్వండంలో ఎంత కఠినంగా ఉంటున్నాయో సూటుబూటు వేసుకుని వచ్చే వారికి అప్పనంగా వేలకోట్లు కట్టబెట్టి రుణాలు ఇస్తున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారు ఇలాగే బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో వీరిని పట్టుకుని తీసుకుని రావడంలో పూర్తిగా విఫలం అయ్యారు. విదేశీ నల్ల ధనాన్ని ధనా ధన్ మన దేశానికి తెచ్చేస్తేనానని చెప్పి ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చేశారు. నిజానికి మన బ్యాంకులు సులభంగా పేద, మధ్య తరగతి ప్రజలకు రుణాలు ఇచ్చినట్లయితే ఉపాధి రంగం బలపడేది. పెట్టుబడుల కోసం మన పాలకులు విదేశాల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రభుత్వాల రుణ పథకాలు కూడా సామాన్యులకి అందడం లేదు. అలాగే ప్రజలు కూడా ఇచ్చిన రుణాలు చెల్లించాలన్న శ్రద్ధ కనబర్చడం లేదు. ప్రజల నుంచి ప్రభుత్వాల దాకా ఎగవేత ఆలోచనే. కనీసం ముక్కూ, ముఖం చూడకుండా లోన్ ఇస్తామంటే ఎవరు కాదంటారు? అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటారు! కానీ, ఆ తరువాతే అసలు సినిమా మొదలవుతుంది. ఫోన్లలోనే బెదిరింపులు, వేధింపులు, చావులు.
ఇక అప్పుల యాప్‌లు… చైనాకు చెందినవిగా పోలీసులు చెబుతున్నారు. కొందరు దేశంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, రుణాలిస్తున్నట్లు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొందరు ఆర్బీఐ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడమే గాకుండా బ్యాంకుల రుణ పద్దతిని ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలి. బ్యాంకులు ప్రజల డబ్బుతో పెద్దలకు దోచిపెట్టడం గాకుండా బతికేందుకు అసవరమైన విధంగా రుణాలు ఇవ్వగలగాలి. సైబర్ నేరాలను అరికట్టాలి. మొత్తం నేరాల అదుపు కోసం ప్రత్యేక విధి విధానాలు అవసరం. దేశ రక్షణ వ్యవస్థ లాగే ఇవ్వాళ నేరాల రక్షణ కూడా అత్యవాశ్యం.