9వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మైక్రోసాఫ్ట్. పాకిస్తాన్ కు మైక్రోసాఫ్ట్ బై బై. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ఐటీ కంపెనీకి సంబంధించి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలివి. మిగతా అనేకానేక కంపెనీలో చెప్పి తొలగించేవి. చెప్పకనే తొలగించేవి. చెప్పినా, చెప్పకపోయినా, వెల్లడి కాని కంపెనీలు కొన్ని. ఇలా అనేకానేక ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. కంపెనీలకు ఉద్యోగులు భారంగా మారారు అనడం కంటే, ఖర్చు తగ్గించుకోవడం, లాభాలు ఆర్జించడం ఒక ఎత్తైతే. ఇప్పుడు వందల వేల మంది ఉద్యోగులు చేసే పనులను ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ చేసేస్తోంది. కాబట్టి, ఉద్యోగులతో పనేంటి? వారికి జీతాలు దండగ. పైగా ఉద్యోగి పనిలో పరిపక్వత సంగతి పక్కన పెట్టండి. ఎఐ ద్వారా అంతకంటే అద్భుతం అనే విధంగా పనులు చక చకా జరిగిపోతుంటే, మానవ వనరులు, మనుషులతో పనే లేకుండా పోతోంది. ఆశ్చర్యమనిపించినా అంగీకరించక తప్పని పరిస్థితి ముంగిట మనమున్నాం.
నిజానికి ఐటి రంగం ఎంతగా ఆకర్షించి, ఊరిస్తున్నదో అంతకంటే ఎన్నో రెట్లు క్షోభ కూడా పెడుతోంది. దేశ, భాష సరిహద్దులు చెరిగిపోయి, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఐటి ఉద్యోగాలు ఉన్న పళంగా ఊడిపోతున్నాయి. ఉద్యోగులను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇది మామూలై పోయింది. చిన్నా చితక కంపెనీలు మాత్రమే కాదు, పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలే ఇలా చేస్తున్నాయి. పైగా అవి జీతం ఎక్కువగా ఉన్న ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగం ఊడిపోతుండటంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడే దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే పనైతే, కంపెనీని నమ్ముకుని, దీర్ఘకాలంగా పని చేస్తున్న వారికి నచ్చచెప్పి, జీతాల్లో కోతలు విధించవచ్చు. తగ్గించవచ్చు. కరోనా సమయంలోలా తగ్గించుకోవడానికి కూడా ఓ పద్దతి అంటూ ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో ఆలా జరగడం లేదు. ఐటి కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పెరుగుతున్న తీరు ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఉద్యోగం పోయినా బతకగల, ఇతర ప్రత్యామ్నాయ ఏదైనా రంగంలో రాణించే బహుముఖ ప్రావీణ్యం కూడా ఐటీ ఉద్యోగులకు ఉండటం లేదు. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి.
నిజానికి క్షేత్రస్థాయి లోనే విద్యారంగంలో మార్పులు రావాలి. విద్యార్థులు రాటుదేలేలా తర్ఫీదు ఇవ్వాలి. వారు ఎంచుకంటున్న ఆయా రంగాల్లో నిష్ణాతులను తయారు చేయాలి. అప్పుడే వారు ఏ పరిశ్రమలో అయినా, ఉపాధి రంగంలో అయినా రాణిస్తారు. విద్యావిధానంలో మార్పుల తోనే ఇది సాధ్యం. కేవలం బట్టీ చదువుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు లోపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా మార్కెట్ విస్తరించాలి. ఉద్యోగమంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు.. ప్రైవేట్ రంగంలోనూ వారికి అవకాశాలు కల్పించాలి. అలాగే సొంతకాళ్ల మీద నిలబడేలా ఉపాధికి అవకాశాలను పెంచాలి. బ్యాంకులు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. ఇవన్నీ సాకారం కావాలంటే వ్యవసాయరంగం, అనుబంధ రంగాలు బలపడాలి. పారిశ్రామిక రంగం పురోగమించాలి. ఇవన్నీ కూడా ఓ క్రమద్దతిలో అభివృద్ది చేసుకుంటూ పోవాలి. ఎంతసేపు పెన్షన్లు పంచడం, కిలో రూపాయికి బియ్యిం ఇవ్వడం, ఇందిరమ్మ ఇళ్లు కట్టించడం ఇదే అభివృద్ది కాదు. ప్రజలు తమకాళ్ల మీద తాము నిలబడగలిగేలా వాతావరణం సృష్టించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. యువత ఆకాంక్షల మేరకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్ గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. తెలంగాణ సిఎం రేవంత్ స్కిల్ వర్సిటీ అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొత్తగా పరిశ్రమలు వస్తాయి. తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీఎంలు, మంత్రులు అమెరికా, దావొస్, జపాన్ తదితర దేశాలు చుట్టివచ్చారు. ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానాలు పలికారు. అయితే ఆయా కంపెనీలు మన దేశానికి వచ్చి ఉద్యోగాలిచ్చేదాకా, ఇక్కడి నిరుద్యోగులేం కాను? పైగా ఆయా దేశాల కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులను, ఉద్యోగాలను తామే నియమించుకుని, అన్ స్కిల్డ్ లేబర్ గా మన వాళ్ళని వాడుకుంటున్నాయి. దీంతో ఆశించిన కంపెనీలు వచ్చినా, ఆశించే ఉద్యోగాలు మాత్రం ఉండటం లేదు.
అయినా, మనకు అందుబాటులో ఉన్న వనరులతో ఏం చేయవచ్చన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. మనకు విస్తారంగా సహజవనరులు ఉన్నాయి. సముద్రతీరం ఉంది. అతి పెద్ద రంగంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయాధారిత రంగాల పురోగతిపై ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఉపాధికి అభివృద్ది కేంద్రాలు. పారిశ్రామకవేత్తలకు మోకరిల్లి, రెడ్ కార్పెట్ పరవడం కంటే, స్థానికంగా మనదైన రంగంలో మనం ఎదగడంపై ఆలోచిస్తే మంచి ఫలితాలుంటాయి. కంపెనీలకు మేలు చేసేలా నిర్ణయాలు కాకుండా, ప్రజలకు మేలు చేసేలా విధానాలు ఉండాలి. ఎస్.ఇ.జెడ్ లలో వచ్చిన కంపెనీలకు భూములు ఇచ్చి రైతులు ఆ కంపెనీల్లో కూలీలుగా మారుతున్నారు. పరిశ్రమల నిర్మాణ సమయంలో వచ్చే, పోయే లారీల్లో దింపుడు, ఎత్తుడు హమాలీలయ్యారు. గంగవరం పోర్టు, పోలవరం ప్రాజెక్ట్, ఫార్మాసిటీల లాంటి వాటికోసం, విశాఖ ఉక్కు కోసం భూములు త్యాగాలు చేసిన వారు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి ఘోరాలు జరక్కుండా దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. తెలంగాణలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి వాటికి భూములు ఇచ్చిన రైతులు ఇవాళ దిక్కులేకుండా పోయారు. ఇలాంటి అభివృద్ది ఎవరి కోసమన్నది కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏకపక్షంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయి. ప్రైవేట్ పరిశ్రమల్లో తనిఖీలను, కార్మికుల భద్రతను గాలికొదిలేశారు. వెట్టి చాకిరీ చేయించుకునే వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. సిగాచీ పరిశ్రమలో జరిగిన దారుణమే ఇందుకు నిదర్శనం.