ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా. ఈ రోజు భారతదేశ ప్రఖ్యాత వైద్యుడు, పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జీవితం సంపూర్ణంగా ప్రజాసేవకే అంకితమైంది. అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ, ప్రతి వైద్యుడి సేవను సముచింగా సత్కరించేందుకు ఈ రోజును ప్రత్యేకంగా ఉత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
వైద్య వృత్తి అనేది కేవలం ఉద్యోగం కాదు. ఇది ఓ నిబద్ధత, సమాజం పట్ల తపన, సేవా స్ఫూర్తితో నిండిన పిలుపు. రోగికి వైద్యుడంటే దేవుడితో సమానం. వైద్యో నారాయణ హరి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో తీవ్ర ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న వేళ, వైద్యుల పాత్ర మరింత కీలకమవుతోంది. అనేక భౌతిక పరిమితులు, మానసిక వత్తిడుల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యుడు నిజంగానే దేవుడికి ప్రతి రూపం.
కలరా, మశూచి, డెంగీ, కరోనా వంటి మహమ్మారిల విపత్తుల సమయంలో వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా ప్రజల ప్రాణాలను కాపాడారు. విశేష, విస్త్రుత సేవలందించారు. మన కుటుంబ సభ్యులను మనమే చూసుకోలేని పరిస్థితుల్లోనూ, రోగులకు తల్లిదండ్రుల్లా, కుటుంబ సభ్యల్లా, బంధువుల్లా మద్దతుగా నిలిచారు. వైద్యుల అంకితభావం, సేవానిరతిని, మానవత్వాన్ని ప్రతిబింబించింది. వారిని “కోవిడ్ వారియర్స్” అని, ఫ్రంట్ వారియర్స్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే రంగం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తక్కువేమీ కావు. ప్రభుత్వ రంగంలో వైద్యుల సంఖ్య సరిపోకపోవడం, పల్లెల్లో వైద్యుల కొరత, సమర్ధవంతమైన వైద్యసేవలందించడంలో లోపాలు వంటి సమస్యలు ఇవాళ మనం ఎదుర్కొంటున్నవే. ప్రైవేట్ వైద్యరంగంలో నాణ్యతతో పాటు ఖర్చుల భారం సామాన్యులకు నెత్తిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను మరింత పెంచాలి, గ్రామీణ వైద్యుల సంఖ్యను బలోపేతం చేయాలి.
ఇక వైద్య విద్య పట్ల మరింత కృషి అవసరం. మెడికల్ సీట్లు పెంచినప్పటికీ, ప్రైవేట్ కళాశాలల ఫీజులు సామాన్యుల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్నాయి. మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ చదువు కలగా మిగులుతోంది. క్యూబా లాంటి దేశం కేవలం వైద్య విద్యను విద్యార్థులకు అందించడం ద్వారా ప్రపంచానికి అసరమైన అద్భుత వైద్యులను అందించి, అనేక యుద్ధాలు, విపత్తుల సమయంలో ఆ వైద్యుల ద్వారా అందిస్తున్న సేవలను మనం గుర్తు చేసుకోవాలి. అందుకే సేవాభావంతో కూడిన వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా, ప్రోత్సహించే విధంగా బోధన, వైద్య రంగ ప్రణాళికలు రూపొందించాలి.
వైద్యులకు తగిన రక్షణ కూడా అవసరం. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల రోగుల బంధువుల చేతుల్లో వైద్యులు దాడులకు గురవుతున్న సంఘటనలు కలచివేస్తున్నాయి. ఇది ఆత్మీయ సంబంధాలను, వైద్యుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. ప్రభుత్వాలు దీనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. వైద్యులు నిర్భయంగా, నిరుపేదలకు సేవలందించాలంటే సురక్షిత వాతావరణం అత్యవసరం. అలాగే దేశంలో ఎప్పటి నుంచో సంప్రదాయ వైద్యం కొనసాగుతోంది. అది కాస్తా అలోపతి వైద్యంగా కొందరు అందిస్తున్నారు. వారినే మనం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటున్నారు. గ్రామీణ వైద్యులను పూర్తిగా విస్మరించి, మన దేశ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించగలిగిన వైద్యులను మనం తయారు చేయలేదు. కాబట్టి, గ్రామీణ వైద్యులకు తగిన శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లు, ప్రభుత్వ గుర్తింపునిచ్చి, వారి ద్వారా కూడా వైద్య సేవలను ప్రజలకు అందించడాన్ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందా? అన్నది నిపుణుల ద్వారా అధ్యయనం చేసి, ఒక పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది.
వైద్యం ఇవ్వాళ సేవా భావన నుంచి వ్యాపారానికి మారింది. వ్యాపారం కోసమే వైద్యం చేస్తున్న వైద్యులను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు సేవా భావానని పెంపొందించుకుంటే మంచిది. సమాజం కూడా వైద్యులపై గౌరవాన్ని, నమ్మకాన్ని చూపించాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు పాటించాలి. అప్పుడే వైద్య వ్యవస్థ పునాదులు బలపడతాయి. మానవతా దృక్పథంతో వైద్యులు పని చేస్తే ఆరోగ్యంగా, శాంతిగా మన సమాజం ఎదుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి వైద్యుడికి మనం “ధన్యవాదాలు” చెబుదాం. వారి సేవలు గుర్తిద్దాం. మన కుటుంబంలో వైద్యుడి ప్రాముఖ్యత ఎంత ఉంటుందో, సమాజం లోనూ అలాగే ఉండాలని గుర్తించాలి. ఈ వైద్య దినోత్సవం ప్రతి ఒక్కరికి సేవా స్పూర్తిని అందించాలి. వైద్య వృత్తిలో ఉన్న మిగతా విభాగావారందరికీ ఇది మరింత జాగ్రత్తగా, బాధ్యతతో పని చేసేలా ప్రేరణ కలిగించాలి.
డాక్టర్స్ డే కేవలం ఒక వేడుక కాదని, ఇది బాధ్యతను గుర్తుచేసే రోజు అని మనం తెలుసుకోవాలి. రోగాన్ని కాదు, రోగిని చికిత్స చేసే ఔషధం మానవత్వం అని గుర్తించినప్పుడే సమాజంలో శాంతి సౌఖ్యాలు నిలుస్తాయి. అందుకే వైద్యులు, వైద్య వృత్తిలో అన్ని విభాగాల, రకాల సిబ్బంది మొత్తానికి చప్పేదొక్కటే, వారి అంచనాలకు మించిన అవసరాలను ఈ సమాజం కోరుకుంటోంది. అందుకు తగ్గ సేవలు వారందించాలి. వారిని గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం, కృతజ్ఞతలు తెలుపుదాం.