సొంత లాభం కొంత మానుకుని.. పొరుగువాడికి తోడుపడవోయ్! దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!! అని గురజాడ ఏనాడో ‘గురు’ జాడ చూపించాడు. కానీ మన పాలకులు మాత్రం సొంత లాభం కోసం మాత్రమే పని చేస్తున్నారు. దేశ సేవ, ప్రజా సేవ పేరుతో రాజకీయాలు చేస్తూ ఆరాచకంగా ప్రవర్తిస్తున్నారు. దేశ మంటే మనుషులన్న సంగతి మరచి, దేశమంటే గనులు, భూములు, నిధులు అని నమ్మి పాలించే ఘనులు మన పాలకులు అయ్యారు. ఒకసారి ప్రజాప్రతినిధి అయితే చాలు, తరతరాలకు సరిపడా తెగేసి పోగేసుకుంటున్నారు. మనం నవ నాగరిక ఆధునిక యుగంలో ఉన్నామనా పరస్పర దోపిడీతో అనామకంగా అన్యాయమై పోతున్నామా? రూపాలు మారుతున్నాయి తప్ప మార్పులేమీ ఉండటం లేదు.
ప్రజల అవసరాలు, ఆశయాలు, ఆకాంక్షల కోసం పోరాడుతాం. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తామని ఏర్పడ్డ పార్టీలు తమ లక్ష్యాలను విస్మరించాయి. అధికారం రాకముందు ఒకలా, వచ్చిన తరవాత మరోలా వ్యవహరిస్తూ ప్రజలకు గుదిబండలుగా మారాయి. పార్టీలోనే కాక, ప్రజలు అందించిన అధికారాన్ని తమ కుటుంబ వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేసుకున్నాయి. విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నాయి. ప్రజల నిస్సహాయతను ఆసరా చేసుకుని పార్టీలు పరస్పరం అవగాహనతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకప్పుడు జాతీయ పార్టీలను మాత్రమే అభిమానించిన ప్రజలు, వాటి పనితీరును అసహ్యించుకుని, ప్రాంతీయ పార్టీలను ఆదరించారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల తీరు చూస్తూ, మళ్ళీ మరో ప్రత్యామ్నాయం కనిపించక జాతీయ పార్టీల వైపు చూడాల్సిన అగత్యంలో ప్రజలు పడ్డారు. ఉమ్మడి ఏపీలో బీఆర్‌ఎస్, వైసీపీలు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపాయి. కానీ రాష్ర్టాలను అప్పుల కుప్ప చేసి వెళ్లాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి, కాంగ్రెస్ లు కూడా అప్పులపైనే కాలం వెళ్ళదీస్తున్నాయి. అప్పులు చేయకుండా అడుగు వేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారం కోసం ఇచ్చిన అలవి కాని హమీలు, వాటి అమలు, ఉచిత పథకాలు, పందేరాలతో రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వెంపర్లాడుతున్నారు.
పైగా పార్టీలు ఆత్మస్తుతి, పర నిందనే నమ్ముకున్నాయి. ఒక పార్టీ మిగతా పార్టీలను కలిసి పని చేస్తున్నాయని నిందిస్తున్నాయి. నిజానికి పార్టీలన్నీ కలిసే దోస్తున్నాయి. ఒకరినొకరు లోలోన సహకరించుకుంటూ, సమర్థించుకుంటూ, పైకి మాత్రం విమర్శించుకుంటూ ప్రజలను నయా నయవంచన చేస్తున్నాయి. ప్రజలను సమస్యల్లో వదిలేశారు. నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై చర్చించే దమ్ము ఏపార్టీకి లేదు. తమ అవసరాల కోసం ప్రజావసరాలను విస్మరించి ఎంతకైనా దిగజారే నీచపు దిగజారుడు రాజకీయ యుగంలో మనమున్నాం. ప్రాంతీయంగా బలమైన నేతలుగా ముద్ర ఉన్న చంద్రబాబు, నితీశ్ కుమార్ వంటి వారు కూడా ఈ కోవలోనే ఉన్నారు.
ప్రజా రంజకమైన పాలన మీద ద్రుష్టి పెట్టకుండా, పరపార్టీపై నిందలు మోపడం, మన బలంగా ఎదగడం కంటే, ఎదుటి పార్టీలన బలహీనం చేయడమనే అరాచక క్రీడకు పాల్పడుతున్నారు. మోడీ తీసుకున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాం కూడా అలాంటిదే. గత ఎన్నికల్లో ‘చార్ సౌ పార్’ పారలేదు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా మారింది. దీంతో నిర్వీర్యం చేయాలని గడచిపోయిన, ప్రజలు మరచిపోయిన, ఇప్పటి తరానికి పెద్దగా గుర్తులేని, అవసరంలేని ‘ఎమర్జెన్సీ’ని ‘యమ అర్జెన్సీ’ అయినట్లు ఎత్తుకున్నారు. ఆనాటి చీకటి రోజులు అంటూ ఉపన్యాసాలు గుప్పిస్తున్నారు. పరిపాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుంగా చేస్తే, పసలేని, పనికి మాలిన పార్టీల పని ప్రజలే చూసుకుంటారు కదా?
ఇక కేంద్రంలో బీజేపీ ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి దేశంలో అధికారంలో ఉంది. తమ పార్టీలోనే కాదు, ఆపార్టీల మెప్పుతో పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజల మెప్పుకంటే తమకు మద్దతు ఇచ్చే పార్టీల మెప్పుకోసమే పనిచేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలలో నమ్మకమైన మిత్రపక్షం, భాగస్వామ్య పార్టీలు లేకుండా పోయింది. అందుకే రాజకీయ నాయకులు బలమైన శత్రువు లేకుండా చూసుకుంటున్నారు.
నిజానికి ప్రభుత్వాలు, పార్టీలు ప్రజావసరాలను గుర్తెరిగి ప్రవర్తించాలి. హైదరాబాద్ మెట్రో విస్తరణ, కంటోన్మెంట్‌లో రోడ్ల విస్తరణ వంటి విషయాల్లో ప్రజల అవసరాలను చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రజల సమస్యలను విస్మరిస్తే బీజేపీకి ఒనగూరేదేంటి? బీజేపీ మంత్రులు, ఎంపీలు, నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాలపై ఎందుకు ప్రతిస్పందించడం లేదు? కేవలం ‘డబుల్ ఇంజిన్’ సర్కారే శరణ్యమని ఊదరగొట్టడం బాగానే ఉంది. కానీ, రేపు ప్రజలు అసలు ఇంజిన్ నే పనిచేయుకుండా చేస్తే?
బీజేపీ పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనే కర్నాటక, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారాన్ని అణచివేసేందుకు ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమని తెలంగాణ నిరూపించింది. ఢిల్లీలో ఆప్ ని పని పట్టారు. కానీ, పంజాబ్ లో ఆ పార్టీ గెలిచింది. హిమాచల్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కారణంగగా బీజేపీ నిలదొక్కుకో గలిగింది. బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, శివసేనలను చీల్చింది. పంజాబ్‌లో అకాలీదళ్‌ను దెబ్బతీసింది. బీహార్‌లో లోక్ జనశక్తిని ముక్కలు చేసింది. నితీశ్ కుమార్‌కు పొమ్మనకుండా పొగపెట్టి మళ్లీ దారికి తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీని నిర్వీర్యం చేసింది. ఒడిషాలో నవీన్ పట్నాయక్‌ను దెబ్బతీసారు. పార్టీ ఏదైనా ఈ పద్ధతి తప్పని గత ప్రజా తీర్పులున్నాయి. ఇది గమనించకపోతే, ఏ పార్టీ అయినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.