పేరుకే ఎక్సైజ్ మద్య నిషేధ శాఖ. కానీ మద్య నిషేధం పక్కన పెట్టి భారీగా మద్యం అమ్మకాలు సాగాలన్నదే ఆ శాఖ లక్ష్యం. ప్రభుత్వాల లక్ష్యం కూడా అదే. మద్యంతో సంభవించే అనర్థాలు కంటే కూడా, సంపాదించే అర్థం (డబ్బు) మీదే ప్రభుత్వాద ధ్యాసంతా. ప్రజలేమైనా ప్రభుత్వాలకు, వాటిని నడిపే పార్టీలకనవసరం. తమ పదవులు, పీఠాలు పదిలంగా ఉన్నాయా లేదా అన్నదే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా మారింది. మద్యం ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరై పోవడంతో, మద్యం పర్యవసనాలు ఎవరికీ పట్టడం లేదు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. మద్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఆలోచనే చేయడం లేదు. జనమేమైపోయినా, ఆదాయం పెరగాలన్న ధోరణిలో ప్రభుత్వాలు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. నిజానికి ఉచిత పథకాలు ఆపితే మద్యాన్ని అమ్మాల్సిన అవసరమేలేదు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. బ్యాడ్ అయినా, బ్రాండ్ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. మద్యంతోపాటు మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడంతో జులాయిల అకృత్యాలకు అంతు లేకుండాపోతోంది. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం, విపరీత ధోరణి ఉంటుంది. ఈ మత్తే నేరాలకు హేతువవుతోంది. విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. అందుకే మద్యం సహా, మత్తు పదార్థాలను అరికట్టే మార్గాలు ఆలోచించాలి. అకృత్యాల కట్టడికి ఏం చేయాలన్నది చర్చించాలి. మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మద్యం మత్తులో ఉన్నవారే ఎక్కువ. అయితే, ఎక్కడపడితే అక్కడ మద్యం లభించడం మరింత ఆందోళన కలిగించే అంశం. చెడు సావాసాలతో మత్తులో మునిగి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికంతటకీ నిరుద్యోగాన్ని కూడా ఒక కారణంగా చూడాలి. ఇవన్నీ అరికట్టేందుకు ఏం చూయాలో ఆలోచించి ముందుకు కదిలితేనే నేరాలను అరికట్టగలం.
ఇటీవల గంజాయి కూడా విపరీతంగా పట్టుబడుతోంది. ఎంతగా స్వాధీనం చేసుకున్నా అంతకంతకూ రవాణా ఆగడం లేదు. అంటే మార్కెట్లో గంజాయికి అంత డిమాండ్ ఉందన్నమాట. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాలతో పాటు నేరాలు, ఘోరాలు కూడా పెరుగుతున్నాయి. మద్యం మత్తులోనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు ఇలా అనేక రకాలైన నేరాలకు మద్యం కారణం అవుతోంది.
సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు నాటి సీఎం జగన్ హావిూ ఇచ్చి డొల్ల కంపెనీల బ్రాండ్లతో వేలకోట్లు సంపాదించారు. మద్యం కుంభకోణంపై ఇప్పుడు సిట్ విచారణ జరుగుతోంది. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు. దీంతో మద్యం అమ్మకాలను బాహాటంగానే ప్రోత్సహిస్తున్నారు. ఇష్టం వచ్చిన బ్రాండ్లతో అమ్మకాలు చేసి ఖజానా నింపుకుంటున్నారు. అంతెందుకు పార్టీల మీటింగులకు కార్యకర్తలు రావాలంటే సుక్క, ముక్క పెట్టాల్సిందే. ఒక్క ఏపీ మాత్రమే కాదు, తెలంగాణతో పాటు యూపీ వంటి అన్ని రాష్ట్రాల్లనూ ఇదే వరస. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలోనూ ఇదే తంతు. ఇటీవలి అత్యాచార ఘటనలను చూస్తే సామాన్యలకు కూడా భయమేస్తోంది. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించి కొంత ఊరటను కలిగిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలన్నింటిలో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. మత్తులో ఉన్నవారికి విచక్షణ ఉండదు. నియంత్రణ ఉండదు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు. వీటిని మానసిక నిపుణులు కూడా ధ్రువీకరిస్తున్నారు. మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి అరాచకాలకు అడ్డూ అదుపు ఉండదు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరి కొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చి పోతారు. తమవల్ల వారికి ఏమవుతుందో అన్న భయం కానీ, తరవాత తామేవుతామో అన్న ఆలోచనకానీ ఆ సమయంలో ఉండదు. అందువల్ల మద్యంపై నియంత్రణ విధించడం అవసరం అని పాలకులు గుర్తించాలి.
మద్యం, మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇదంతా. యువత ఈ పెడ దారి పట్టకుండా చూడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మద్య, మత్తు మందు సంబంధ ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను బలోపేతం చేయాలి. వాటిని పకడ్బందీగా అమలు చేయాలి. మద్యం వల్ల వచ్చే ఆదాయం కంటే అనర్థాలను గుర్తించి మద్యం అమ్మకాలను నిలిపేయాలి. మద్య నిషేధాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలు వ్యాపార వాణిజ్య సంస్థలు కావు. వాటి అధినేతలు ఆ కంపెనీలకు సీఇఓలు కాదు. ప్రభుత్వాలు, ప్రజల కేర్ టేకర్స్. అవి ఎప్పుడూ ప్రజల శ్రేయోభిలాషిలానే ఉండాలి.