“ఆదివాసులు” మూల వాసులు. భారత దేశంలోని స్వదేశీ జనజాతులు. ప్రత్యేక సంప్రదాయ జీవన విధానం, భూభాగాలు, వనరులు, భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న సమాజాలు. “లంబాడీలు లేదా బంజారాలు” ప్రత్యేక సంప్రదాయ జీవన శైలి గలవారు. సంచార జాతులు. వలస జీవన శైలి, వాణిజ్యాల ద్వారా విస్తరించారు. ఆదివాసులు రాజ్యాంగ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 1950 ద్వారా గుర్తించబడ్డారు. లంబాడాలు షెడ్యూల్డ్ కులాలు, ట్రైబ్స్ చట్టం-1976 సవరణ ద్వారా ఎస్టీల జాబితాలో చేర్చబడ్డారు. ఈ 50ఏండ్లల్లో తమకు చెందాల్సిన అన్ని అవకాశాలను లంబాడాలు పొందారని ఆరోపిస్తూ, ఆదివాసీలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లిందని, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. దాదాపు ఆదివాసీ అన్ని తెగలు, వాటిలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజానీకం, ఆదివాసీ సంఘాలతో పాటు, అన్ని పార్టీల ఆదివాసీ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఆయా జిల్లాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇది చూడడానికి చిన్న సమస్యలాగే కనిపించినా, ఈ అగ్గిరవ్వే నిప్పు కణికలాగా మారి మొత్తం సమాజాన్నే తగులబెట్టేంతగా చెలరేగే ప్రమాదం కనిపిస్తున్నది.
ఇది ఆదివాసీల ఆత్మగౌరవ సమస్యగా పరిణామం చెందితే, తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లమల ఏజెన్సీ ప్రాంతాలలోని గూడేల నుంచి తొమ్మిది ఆదివాసీ తెగలు ‘చలో రాజ్‌భవన్’ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు డిసెంబర్ 9న విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనేది ఆందోళన ఉద్దేశ్యం. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నది వారి ప్రధాన డిమాండ్. తమ హక్కులను లంబాడాలే కాల రాస్తున్నారని, తమ అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. ‘నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు, రాజకీయ లబ్ది కోసం సంచారజాతికి చెందిన లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చింది. దీంతో గత యాభై ఏళ్లుగా ఆదివాసులు అన్ని రంగాలలోనూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న’ది వారి ఆందోళనకు కారణంగా ఉంది.
పెద్దగా చదువుకోని, చట్టాలపట్ల అవగాహన లేని ఆదివాసీ రాజకీయ ప్రతినిధుల కారణంగా, ఆర్టికల్ 342 ప్రకారం పార్లమెంటరీ పక్రియలేవిూ నిర్వహించకుండా, ఏకపక్షంగా లంబాడా, ఇంకా దానితో సారూప్యత కలిగిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. అప్పటి నుంచీ నాటి ఆదివాసీ తెగలకు చెందాల్సిన 4శాతం రిజర్వేషన్లను గత యాభై ఏళ్ళుగా లంబాడా సామాజిక వర్గాలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆదివాసులకు న్యాయంగా దక్కాల్సిన భూమి, విద్య, ఉద్యోగ అవకాశాలను దోచుకోవడంతో పాటు, అక్రమ రిజర్వేషన్లు గంపగుత్తగా అనుభవించి ఆర్థికంగా, రాజకీయంగా లంబాడాలు బలపడుతున్నారని వీరు ఆందోళనలు చేపట్టారు. గతంలో అనేకమార్లు ఈ ఆందోళనలు సాగాయి. కానీ ఈసారి అవి కొత్త రూపంలో ముందుకు వస్తున్నాయి.
రాష్ట్రంలోని ఉన్నత వర్గాలకు చెందిన కులాలకు దీటుగా వారు అన్ని డిపార్టుమెంటుల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ, రాజకీయ పార్టీలలోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత యాభై ఏళ్లుగా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడా సామాజిక వర్గాలు తమకు ఉన్న ఓటు బ్యాంకుతో అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తూ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట్రం లోని తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ సంఘాలు 2017 డిసెంబర్ 9న లక్షలాదిగా హైదరాబాద్ తరలివచ్చి తమ నిరసన తెలియచేశాయి. యావత్ తెలంగాణ సమాజం మద్దతు పొందాయి. తర్వాత కూడా ఆదివాసీ సంఘాలు ప్రజాసామ్యయుతంగా పలు పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. 2018లో చలో ఢల్లీ పేరుతో ఆదివాసీ ప్రతినిధి బృందం ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి. 2019లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాంలీలా మైదానంలో ఆదివాసీ ప్రజానీకం లక్ష మందితో నిర్వహించింది. నాటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ఆధ్వర్యంలో ఈ తొమ్మిది తెగల ప్రతినిధులు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. సుగాలీ, లంబాడా, బంజరాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(2) ప్రకారం కలపలేదని అన్ని ఆధారాలను సమర్పించారు. దీని తరువాత కూడా అనేకసార్లు కేంద్ర హోం మంత్రి, గిరిజన సంక్షేమ, న్యాయశాఖ మంత్రులకు నివేదికలు అందజేశారు. అయినా నేటికీ న్యాయం జరగలేదన్నది వారి ఆరోపణ.
ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. లంబాడాల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీలు అటవీ ప్రాంతానికి, లంబాడాలు మైదాన ప్రాంతాలకు చెందిన వారు. క్రమంగా ఆదాసీయేతరులతోపాటు లంబాడాలు ఆదివాసీ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఆదివాసులకు చెందాల్సిన ఏజన్సీ భూములను ఆక్రమించారని తుడుందెబ్బ లాంటి సంస్థ ఆరోపిస్తూ వచ్చింది. ఇవన్నీ కాదనిమైదాన ప్రాంతానికి చెందిన లంబాడా తెగను ఎస్టీలో చేర్చడం రాజ్యాంగ విరుద్దంగా పోరాడుతున్నారు. ఆదివాసీల వాదనలను కూడా ప్రభుత్వాలు వినాలి. హేతుబద్ధమైన ఆలోచన చేయాలి. ఈ ఉద్యమం తీవ్రం కాకముందే ఓ నిర్ణయం తీసుకోవాలి.