‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే!
ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.
అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం? ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి. ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్
‘ఓటమి చావు కన్నా భయంకరమైంది.’ ప్రపంచంలో, జీవితంలో గెలుపోటములు లేనిదెక్కడ? కానీ, యుద్ధంలో గెలుపోటములు గెలిచినా, ఓడినా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధంలో చావు అమరత్వాన్నిస్తే, ఒక్కోసారి క్రీడల్లో ఓటమి మరణశాసనాన్ని కూడా రాస్తుంది. క్రీడా స్ఫూర్తి ఉండాలనేది అందుకే. గెలుపోటములను సమానంగా తీసుకోవాలనీ అంటారు. నిజమే కానీ, ఆటలో కోట్లాది ప్రజల భావోద్వేగాలు, గౌరవాలు, విభజన రేఖలు, ఆక్రమిత అంశాలు, రాజకీయాలు, ఉగ్రదాడులు, చావులు, చంపడాలు వంటివెన్నో సమ్మిలితమైతే ఆ ప్రభావాలు వేరే తీరుగా ఉంటాయి. క్రీడా స్ఫూర్తికంటే, ద్వేషమే పాశమై ప్రస్ఫుటమైతది. మొన్నటి టీ 20 అసియా క్రికెట్ కప్ లో భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచులు ఈ భావోద్వేగాల వేదికగా నిలిచాయి.
యుద్ధం-క్రీడ వేర్వేరుగా కనిపిస్తున్నా, రెండూ ఒకటే. అందుకే యుద్ధ క్రీడ అన్నారు. యుద్ధ తంత్రాలు, ఎత్తుగడలు, గెలుపు-ఓటములు, రెండింటా ఒకటే. ఒక్క చంపడాలు, చంపుకోవడాలు, రక్తపాతం తప్ప. యుద్ధంలో చావులుండవచ్చు కానీ, ఒక్కోసారి ఆటల్లో ఓటమి చావుకంటే భయంకరంగా ఉంటుంది. అదీ ఒక దేశం తరపున ఆడినప్పుడు ఆ దేశ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకునుగుణంగా గెలిచి తీరాల్సి వస్తుంది. టీ20 ఆసియా కప్ లో వరసగా మూడు మ్యాచుల్లోనూ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆ విధంగానే పాకిస్తాన్ మీద అదే వేదికపై పదే పదే విజయం సాధించడం ద్వారా 150 కోట్ల భారతీయుల మనుసుల్లోని భావోద్వేగాల్ని గెలిచారు. బలాన్ని చాటారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత, భారత్ పాక్ పై చేసిన దాడులు ఆ దేశాన్ని దిమ్మతిరిగేలా చేశాయి. అదే తరహాలో భారత క్రికెట్ జట్టు దుబాయ్ లో జరిగిన అసియా కప్ పొట్టి ఫార్మెట్ లో పాకిస్తాన్ పై అటు బ్యాట్ తో ఇటు బాల్ తో దాడులు చేసి తుత్తునియలు చేశారు. పాక్ పై భారత్ కు ఓటమి లేదని, ఎప్పటికైనా పాక్ ఓడాల్సిందేనని ప్రపంచానికి చాటారు. భారత్ లో దసరాకు ముందే పండుగొచ్చినంత ఆనందం వెల్లివిరిసింది. మ్యాచులు జరుగుతున్నంత సేపూ టీవీలకతుక్కుపోయిన క్రీడాభిమానులు రకరకాలుగా పండుగ చేసుకున్నారు. తలోతీరుగా స్పందించారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం ‘ఆట ఆపరేషన్ సింధూర్ ని తలపించిందని’ కామెంట్ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు అటు ఇటు దగ్గరగా ఉండవచ్చు కానీ, ప్రధాని స్థాయి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకోవడమే అవుతుందా? ఆలోచించాలి. ఆటను యుద్ధంతో పోల్చడమనే సరళి భవిష్యత్ భారతానికి మంచి చేయకపోచ్చు.
అయితే, క్రికెట్ ఆటకు, సిందూర్ యుద్ధానికి తేడాలున్నాయి. క్రికెట్ ఒక ఆట మాత్రమే. ఆ ఆటలోనూ, ఏ ఆటలోనూ గెలుపోటములు శాశ్వతం కాదు. ఇవ్వాళ వరసగా గెలిచిన భారతే, విధి వశాత్తు, పర్ఫార్మెన్స్ పరంగా రేపు ఓటమి చెందితే, ఒకవేళ మొన్నటి ఏదో ఒక మ్యాచులో మనం ఓడిపోయి ఉంటే? మనలాంటి పరిస్థితే పాక్ ఆటగాళ్ళకు, ఇవ్వాళ వాళ్ళలాంటి పరిస్థితే మన ఆటగాళ్ళకు ఆపాదించబడాల్సిందేనా? ఆలోచించాలి.
అసలు ఆపరేషన్ సిందూర్ తహార మరో యుద్ధాన్ని తలపించేలా క్రికెట్ ఆట ఉండటం మంచిదేనా? క్రీడాకారులు కూడా మామూలు మనుషులే. వారికీ దేశం, దేశభక్తి వంటి భోవోద్వేగాలుంటాయి. కాదనలేం. ఆ నిర్ణయాలు క్రీడాకరులవి లేదా జట్టు మేనేజ్ మెంట్ వి లేదా భారత్ వి ఎవరివైనా, కానీ ఆటల్లో కరచాలనం చేయకపోవడం ఒక నిరసనగా చూడొచ్చు. కానీ కరచాలనం కూడా చేయకుండా మనం ఆడుతున్నామా? భౌతిక యుద్ధం చేస్తున్నామా? ద్వైపాక్షిక సంబంధాల చర్చల్లోనూ వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ముందు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా? లేదా? మరి ఆ మర్యాద క్రీడల్లో ఉండకూడదా? అదే పాకిస్తాన్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి చేతుల మీదుగా కప్ ను తీసుకోవడానికి నిరాకరించడం మరోవిధమైన నిరసనే. అయితే, మనతో ఓడిన వాడి చేతుల మీదుగా గెలిచిన కప్ అందుకుంటే? ఎలా ఉండేది? మరింత గర్వంగా గెలుపునుకు ప్రతీకగా ఉండేదేమో!? అసలు క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగేలా మనం ఎందుకు ప్రవర్తించాలి? క్రీడల ద్వారా దాయాదితో శత్రుత్వాన్ని మరింతగా ఎందుకు పెంచుకోవాలి? అంతేగాక, క్రీడలపై రాజకీయాల ప్రభావం అంత మంచిది కాదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దాయాదుల మధ్య క్రికెట్ పోటీలో భావోద్వేగాలు ఆటకు మించినవిగా కనిపించడం క్రికెట్ కే కాదు, రెండు దేశాల మధ్య రేపటి సంబంధాలకు కూడా ఇబ్బంది కలిగించేవే. అలాగని పాకిస్తాన్ నో, దాని ఆగడాలనో సమర్థించ లేం. అది పడగ విప్పినప్పుడల్లా తిప్పి కొట్టాల్సిందే. ముందే విడిపోయి, పక్కనే ఉన్న దేశాలతో ఎంత కాలం ఇలా పోరాడగలం? ఇండియా, పాక్ రెండు దేశాలూ ఆలోచించాలి? అమెరికా యుద్ధకాంక్షను, దాష్టీకాన్ని అడుగడుగునా విమర్శిస్తూ, మనల్ని మనం ఏ విధంగా సమర్ధించుకోగలం?
ఈ రకరకాల ఆలోచనల వల్ల ఆటగాళ్ళ ప్రతిభా పాఠవాలు మరుగున పడ్డాయి. క్రీడాకారులంతా జట్టుగా అన్ని విభాగాల్లోనూ రాణించారు. తడబడ్డా కూడా కుదురుకున్నారు. ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, మిడిలార్డర్ లో తిలక్ వర్మ, సంజు శాంసన్ లు, బౌలింగ్ లో మిడిల్ ఓవర్లలో స్పిన్ త్రయం కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ లు ప్రత్యర్థులను కట్టడి చేసిన తీరు ముచ్చటేసింది. ఫైనల్ లో తిలక్ ఆటను తిలకించడానికి రెండు కళ్ళు సరిపోలేదు. క్రికెటర్లు ఆటలో ప్రజల మనసుల్ని గెలిచారు.
ఆట అంతిమ లక్ష్యం వినోదం, యుద్ధం అంతిమ లక్ష్యం గెలుపే అయినా, అందులో దేశాల ప్రజల విలువైన మాన ప్రాణాలు, ఎన్నో కష్ట నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ ను కచ్చితంగా ఆటగానే చూడాలి.