ఆరోగ్యమే మహాభాగ్యం! అటువంటి ఆరోగ్యానికి అండ మన ఫార్మసిస్ట్! ఔషధాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణుడు ఫార్మసిస్ట్. మెడికల్ షాప్ అని సాధారణంగా వ్యవహరించే కమ్యూనిటీ ఫార్మసీలలో మరియు హాస్పిటల్ ఫార్మసీలలో ఫార్మసిస్ట్ లు ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందిస్తున్నరు.
ఔషధ వితరణ, ప్రాథమిక చికిత్స, దీర్ఘవ్యాధుల చికిత్స, అత్యవసర చికిత్స, విష చికిత్స, విపత్తు వైద్య సేవలు, సహేతుక ఔషధ వినియోగం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, డ్రగ్ థెరపీ మానిటరింగ్, పారెంటరల్ న్యూట్రిషన్, పథ్యం, ఔషధ ఔషధ అంతర చర్యలు, ఔషధ జనిత అవాంతరాలు, పార్శ్వ ప్రభావాలు, ప్రతిచర్యలు, మాదకద్రవ్య వ్యసన చికిత్స, ధూమపాన వ్యసన చికిత్స, వ్యాక్సినేషన్, అఫర్డబుల్ మెడిసిన్స్, పేషెంట్ ఎడ్యుకేషన్, హెల్త్ రికార్డ్స్, వ్యాధి నిర్ధారణ, వ్యాధి నివారణ, గృహ వైద్యం, జీవన శైలి, ఆరోగ్య పరిరక్షణ సలహాలు, ఆరోగ్య శిబిరాలు వంటి బహు కార్య నిర్వహణ సమర్థులు ఫార్మసిస్ట్ లు. ఫిజిషియన్ లు, నర్స్ లు, క్లయెంట్ లకు ఔషధ సంబంధిత సమస్త సందేహాలను నివృత్తి చేసే నిపుణులు ఫార్మసిస్ట్ లు.
అమెరికాలోని వెటరన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (వి ఎచ్ ఏ) లో ఫార్మసిస్ట్ లు ఔషధ వినియోగ నిపుణులుగా, సెకండరీ ప్రిస్క్రైబర్ లుగా, ఇండియన్ హెల్త్ సర్వీస్ (ఐ ఎచ్ ఎస్) లో మూలవాసుల కొరకు నడుపుతున్న ఆరోగ్య కేంద్రాలలో స్వతంత్ర చికిత్సకులుగా కీలక పాత్ర పోషిస్తున్నరు. ఆరోగ్య సంరక్షణ నిపుణులుగా అత్యంత విశ్వాసం చూర గొన్న విషయం ప్రపంచానికి విదితమే.
బోధనా వైద్యశాలలలో 13 రోగులకు 1 ఫార్మసిస్ట్, బోధనేతర వైద్యశాలలలో 26 రోగులకు 1 ఫార్మసిస్ట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం 3 ఫార్మసిస్ట్ లు ఉండాలనే సిబ్బంది మార్గదర్శకాలు ఇక్కడ ఎక్కడా అమలు జరుగుట లేదు. పేరు చదువ కలిగిన ఎవరైనా మందులు ఈయగలరనే అభిప్రాయాలు కలిగిన హెల్త్ ఎకనామిస్ట్ లు, ఇతర వికృత వైద్య రంగ మేధావుల తప్పుడు సిఫార్స్ ల వలన ఫార్మసీ విభాగాలు చాలా వరకు అవశిష్ట మాత్రమై ఫార్మసీ అర్హతలు లేని వారి ఆధిపత్యం నడుస్తున్నది. ప్రైవేట్ రంగంలోనూ ఇదే దుస్థితి. అర్హులైన ఫార్మసిస్ట్ ల సంఖ్య సరిపోను లేదు అని ఒక సాకు. పరిష్కార మార్గంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ కాలేజ్ లను ప్రోత్సహించింది. 2008 లో అమెరికా తరహాలో ఫార్మ్ డి కోర్స్ ను ప్రవేశ పెట్టింది. కావలసిన ఫార్మసిస్ట్ లను ఉత్పత్తి చేయించింది. అయినా వైద్య ఆరోగ్య వ్యవస్థను నడుపుతున్న పెద్దల మూర్ఖ వైఖరి కారణంగా పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదు. ఫలితంగా ఫార్మసిస్ట్ ల నిరుద్యోగితకు దారి తీసింది. ఫార్మసీ విభాగాలు ఏర్పాటు చేసి పటిష్ట పరచక పోవటం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రాణాల పట్ల నేరపూరిత నిర్లక్ష్యం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాధినేతలకు ఫార్మసిస్ట్ ల ప్రాధాన్యత అవగతం అవుతున్నది. ఇటీవలి కాలంలో ఫార్మసిస్ట్ హోదాను ఫార్మసీ ఆఫీసర్ గా చేసిన మార్పు అభినందనీయం!
అంతర్జాతీయ ఫార్మసిస్ట్ ల సమాఖ్య ఏటా సెప్టెంబర్ 25 న ఒక అంశం ఎంపిక చేసి ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం పాటిస్తున్నది. 2005 సంవత్సరానికి “థింక్ హెల్త్ – థింక్ ఫార్మసిస్ట్” అనే నినాదాన్ని ఎంపిక చేసింది. ఈ స్ఫూర్తితో ప్రభూత్వాలు వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ నెలకొల్పాలె. ఫార్మసీ డైరెక్టరేట్ లు ఏర్పాటు చేయాలె. ఫార్మసిస్ట్ ల సేవలను విస్తృత పరచాలె. స్వయం ఉపాధికి రుణ సౌకర్యం కల్పించాలె.
ఫార్మసిస్ట్ లు నిరంతర నైపుణ్యాభివృద్ధి సాధించాలె. చట్టాల ప్రకారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ సముచిత స్థానం కోసం ఉద్యమించాలె. తమ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలె. మెడికల్ క్యాంప్ లలో పాల్గొనాలె. సొంత మెడికల్ షాప్ లు పెట్టుకోవాలె. పట్టణాలలోని పేదల బస్తీలలో, గ్రామీణ, గిరిజన, ఇతర మారుమూల ప్రాంతాలలో అర్హులైన మెడికల్ ప్రాక్టీషనర్ ల కొరత ఉన్నది. అటువంటి చోట్ల సోషియల్ ఫార్మసీని ఎంచుకొని ప్రైమరీ కేర్ అందించాలె. పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు ఆరోగ్య ఔషధ సంబంధిత సలహాలు ఈయాలె. పశు వైద్యుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (ఓ ఐ ఈ) ప్రతిపాదనల ప్రకారం ప్రతి 500 పశువులకు ఒక వెటరినేరియన్ ఉండాలె. కానీ 5000 కు ఒకరు ఉన్నరు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువ. కనుక పశువైద్య రంగం కూడా ఫార్మసిస్ట్ లకు చొచ్చుక పోగల మంచి క్షేత్రం.
ప్రజలు నిజంగా ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఫార్మసిస్ట్ ను తలుచుకో వలసిందే!