కార్టూన్ ను సామాజిక చైతన్యానికి, రాజకీయ అవగాహనకు, సమస్యల పరిష్కారానికి ఒక వాహికగ వినియోగిస్తున్న ఆదర్శ ప్రాయుడు. నిరాడంబర ప్రతిభా మూర్తి ప్రముఖ జర్నలిస్టు, కార్టూనిస్టు రమణ, నేడు తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరపు కీర్తి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా, ప్రముఖ చారిత్రక, సామాజిక పరిశోధకులు, కవి పండితులు, బహు భాషాకోవిదులు, వైద్యులు, డాక్టర్ రాపోలు సత్యానారాయణ రాసిన ప్రత్యేక వ్యాసం ‘అడుగు’ ఎడిటోరియల్
ఒక వ్యాసంల, ఒక వార్తాంశంల చెప్పే విషయాన్ని ఒక కార్టూన్ సులభంగ అర్థం చేయించ కలుగుతది. రాతతోని విపులంగ, గీతతోని సూక్ష్మంగ తెలుగు పాఠకులకు తెలివిడి కలిగిస్తున్న పాత్రికేయ సవ్యసాచి రమణ. మిత్రులు రమణ, రమణా రావు అని పిలుచుకొనే ఆయన పూర్తి పేరు నెల్లుట్ల వెంకట రమణా రావు. సిద్ధిపేటల స్థిరపడ్డ రమణ స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తీగారం గ్రామం. తల్లి తండ్రులు సరోజన – నారాయణ రావు. ఒక అక్క ఉన్నది. రమణ పుట్టిన తేది 1971 జూలై 25.
తండ్రి నారాయణ రావు విద్యుత్ శాఖల ఉద్యోగం చేసే వారు. వరంగల్ జిల్లా మొండ్రాయి, ముస్త్యాల, చేర్యాల ల చేసిండ్రు. ఊర్లు మారినప్పుడల్లా పిల్లల బడులు మారుతుండేది. దీనితోని సిద్ధిపేటకు తమ కుటుంబ మకాం మార్చిన్రు తండ్రి. ఇంక, 9 వ తరగతి నుండి డిగ్రీ వరకు సిద్ధిపేటల చదివిండ్రు రమణ. ఎంకాం ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1994ల పూర్తి చేసిండు. హైదరాబాద్ లనే గురుకృప కాలేజ్ ల 6 ఏండ్లు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ చేసిండు. 1999ల తల్లి సరోజన మరణించింది. సీనియర్ అసిస్టెంట్ గ 2004 ల పదవీవిరమణ చేసిన తండ్రి నారాయణ రావు 2005 ల చనిపోయిండు. 1997 జూన్ 8 న అరుణతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. కొడుకు సాయి నిఖిల్, బిడ్డ సాయి సమహిత.
పత్రికా రచన పట్ల ఆసక్తి ఉన్న రమణ 2000 సంవత్సరంల ఈ రంగానికి వచ్చిండు. ఈనాడు, ఆంధ్రప్రభ లకు సిద్ధిపేట టౌన్ రిపోర్టర్ గ 2003 దాక చేసిండు. ఆ తరువాత ప్రజాతంత్ర ల చేరి ఏకంగ 11 ఏండ్ల పాటు స్టాఫ్ రిపోర్టర్ గ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నడు. ఐఏఎస్ అధికారి రమణాచారి మన రమణలో ఉన్న కార్టూనిస్ట్ ను పసికట్టి ప్రజాతంత్ర అమర్, అజయ్ ల తోని చెప్పి ఆ దశల కార్టూన్ రంగానికి మరలించిండు. రమణాచారి, అమర్, అజయ్ ల ప్రోత్సాహంతో పాటు మిత్రుడు కలువల మల్లికార్జున్ రెడ్డి ప్రోద్బలం తోడయ్యింది. అప్పుడు ప్రజాతంత్ర వార పత్రికల క్రమం తప్పకుండ రమణ కార్టూన్ చిత్రాలు వచ్చేటియి. గతంల అందరు రిపోర్టర్ లల్ల ఆయనొక రిపోర్టర్. కార్టూనిస్ట్ గ మారినంక తన ఉనికికి కార్టూనిస్ట్ రమణగ ఒక ప్రత్యేకత లభించింది. ఆదర్శ భావాలు, ఆత్మ గౌరవం, వృత్తి నైపుణ్యం, చురుకు తనం, కలుపుకోలు తనం, కష్టపడే తత్వం, నిరాడంబరత్వం, తెలంగాణ వాదం వంటి లక్షణాలు రమణ బలాలు.
కార్టూన్ లే కాకుండ, తెలంగాణ చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ప్రముఖుల చిత్రాలు వేసిండు. 2011 ల ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నాడు తెలంగాణ భవన్ ల ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసిండు. చిత్రాలకు సంక్షిప్త పరిచయం కూర్చి “తెలంగాణ వైతాళికులు”, “తెలంగాణ ముద్దు బిడ్డలు” అనే రెండు పుస్తకాలు అచ్చు వేసిండు. రమణ బొమ్మలు, కార్టూన్ లు బ్రిటన్, అమెరికా ల ఫ్లెక్సీలై వెలిసినయి. తెలంగాణ ఉద్యమ కాలంల లండన్ నుంచి 2 ఏండ్ల పాటు నడిపించిన “తెలంగాణం” పత్రికకు రమణ ఎడిటర్. 2013 నుంచి సోషియల్ మీడియాల చురుకుగ ఉంటున్నడు. కష్టపడి రోజుకు నాలుగు కార్టూన్ ల దాక వేస్తున్నడు. 2017 ల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగ 400 మంది కవులు, కళాకారుల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిండు. 2018 ల “తెలంగాణ పల్లె చిత్రాలు” పేరిట 150 బొమ్మలతో సిద్ధిపేట, హైదరాబాద్ ల ఐదు ఐదు రోజులు ప్రదర్శన జరిపిండు. సూర్య దినపత్రికల 2016 నుండి 6 సంవత్సరాలు స్టాఫ్ రిపోర్టర్ గ చేసి, ప్రస్తుతం ది సిద్ధిపేట టైమ్స్ కు కథనాలు రాస్తున్నడు. మెట్రో పత్రికల చేస్తున్నడు. 2019 ల జూలై 31 న స్వగ్రామం తీగారం వచ్చిన ఆయన అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసు కొన్నడు.
కార్టూన్ ను సామాజిక చైతన్యానికి, రాజకీయ అవగాహనకు, సమస్యల పరిష్కారానికి ఒక వాహికగ వినియోగిస్తున్న రమణ ఆదర్శ ప్రాయుడు. నిరాడంబర ప్రతిభా మూర్తి.
వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఆశించని రమణను తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరపు కీర్తి పురస్కారం వరించటంతో అభిమానులకు అమితానందం కలుగుతున్నది.