అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో అధికారం.. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆయనే తెలియని అయోమయం నెలకొంది. ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లే ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఓటేశామా? అని అమెరికన్ల తో పాటు ఎన్నారైలు కూడా నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలతో విదేశీయులతో పాటు, అమెరికన్లు కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారు. అమెరికాలోని విదేశీయులపై ఆంక్షలు, సుంకాల వల్ల అమెరికా ఆర్థిక పరిస్థితి మెరగవడం కంటే ప్రతిష్ట కూడా దిగజారిపోతోంది. ఎప్పుడు మాంద్యం ముంచుకొస్తుందో అన్న భయం వెన్నాడుతోంది. తాజాగా హెచ్1 బి వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టెక్ కంపెనీలు సైతం ఆందోళన చెందుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్, తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాకిచ్చారు. హెచ్-1బీ వీసా దరఖాస్తు వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి. ఇది అమలు సాధ్యమా? కాదా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
అయితే ట్రంప్ టారిఫ్ యుద్ధం కారణంగా అమెరికాలో ఉద్యోగావకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అమెరికా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం. గత నెలలో వ్యవసాయేతర ఉద్యోగ నియామకాలు అంచనాల కంటే తగ్గి 22 వేలకు పరిమితమయ్యాయి. అదే సమయంలో నిరుద్యోగిత రేటు- 4.2 శాతం నుంచి 4.3 శాతానికి పెరిగింది. అంతేకాదు, మే, జూన్ నెలలకు విడుదల చేసిన ఉద్యోగ గణాంక అంచనాలను కూడా భారీగా తగ్గించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ సుంకాలు అమెరికన్ కార్పొరేట్ కంపెనీల లాభాలపైనా ప్రభావం చూపనున్నాయని, దాంతో కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తాయని, పర్యవసానంగా అక్కడి జాబ్ మార్కెట్ మరింత బలహీనపడే అవకాశాలు న్నాయని నిపుణులు వివరించారు.
అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్ కంపెనీ మూడీస్ చీఫ్ మార్క్ జాండీ హెచ్చరించారు. ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆరోపించారు. టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు- అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని, వలస విధానం ఉద్యోగ నియామకాలను నెమ్మదించేలా చేసిందని చెప్పారు. ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ నిర్ణయాల ప్రభావం వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు. వీటన్నింటి ఫలితంగా అమెరికా ఆర్థికవృద్ధి నెమ్మదించడంతో పాటు- ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాడీ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతోపాటు, ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మదుపరులను జాడీ హెచ్చరిస్తూ, ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని సూచించారు. యూఎస్ జీడీపీలో మూడోవంతు అంటే 33.33 శాతం ఇప్పటికే తిరోగమనంలోకి జారుకుందని తెలిపారు. రాష్టాల్రవారీగా చూస్తే, వ్యోమింగ్, మోంటానా, మిన్నెసోటా, మిస్సిస్సిప్పీ, కాన్సాస్, మసాచుసెట్స్ కు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందన్నారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కోతపెట్టడంతో వాషింగ్టన్ డీసీ కూడా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటోందని అన్నారు. 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనావేసిన ఆర్థికవేత్తల్లో జాండీ ఒకరు. ఆ సంక్షోభం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి విదితమే. అమెరికాలో ధరలు, ముఖ్యంగా నిత్యావసరాల రేట్లు మళ్లీ పెరుగుతున్నా యని.. త్వరలోనే అందుకోలేని స్థాయికి ధరలు ఎగబాకవచ్చని జాండీ అన్నారు. తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ధరాభారం కారణంగా అమెరికన్ల కొనుగోలు శక్తి కూడా తగ్గిందని, వినియోగదారుల వ్యయ వృద్ధి 2008-09 ఆర్థిక సంక్షోభ కాలం నాటి కనిష్ఠ స్థాయికి జారుకుందన్నారు. ఈ జూలై లో అమెరికాలో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరో 0.2 శాతం పెరిగి 2.7 శాతానికి చేరుకుంది. వచ్చే ఏడాదికాలంలో సూచీ 4 శాతానికి ఎగబాకవచ్చని జాండీ అంచనా వేశారు. తత్ఫలితంగా అమెరికన్ల కొనుగోలు శక్తి మరింత తగ్గిపోవచ్చని జాండీ వివరించారు.
వరుసగా రెండు తైమ్రాసికాల పాటు జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తే ఆ దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు గా పరిగణిస్తారు. ట్రంప్ సుంకాల యుద్ధం ఫలితంగా … ఈ ఏడాది తొలి తైమ్రాసికం జనవరి-మార్చి లో అమెరికా జీడీపీ 0.50 శాతం క్షీణించగా.. రెండో తైమ్రాసికం (ఏప్రిల్-జూన్)లో మాత్రం 3.3 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. పెరుగుతున్న ధరలు, సుంకాలతో పెరిగిన వాణిజ్య అనిశ్చితి, తగ్గుతున్న కొనుగోళ్లు మున్ముందు తైమ్రాసికాల్లో ఆ దేశ జీడీపీని మాంద్యంలోకి నెట్టవచ్చునని తెలుస్తోంది.
తాజా నిర్ణయాలు మరింత సంక్షోభానికి కారణం అవుతాయని అంటున్నారు. విదేశ నిపుణులు ముఖ్యంగా భారతీయులు వెళితే అమెరికాలో పనిచేసే వారు కరువవుతారని ఆందోళన చెందుతున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలను అక్కడి చట్టాలు అడ్డుకుంటాయా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.