ఇటీవల కొన్ని బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టులు జోక్యం చేసుకోవద్దంటే ఎలా? దీర్ఘకాలిక పెండింగులు ప్రజాస్వామ్యంపై, పరిపాలనపై, పురోగతిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బిల్లుల ఆమోదానికి నిర్ణీత సమయం తప్పనిసరి’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇక గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని పలు రాష్టాల్ర సీఎంలు, గవర్నర్ల వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండే నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వం రద్దుతో మొదలైన రగడ ఉమ్మడీ ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, తాజాగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు గవర్నర్ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడు గవర్నర్ రవి వ్యవహారంతో పరాకాష్టకు చేరి సుప్రీం మందలించే వరకు వెళ్లింది. దీంతో దేశానికి భారంగా మారిన గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయడమే మంచిదన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో గవర్నర్ పాత్ర ప్రాధాన్యమైనది. రానురాను సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను అణచివేయడం, కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షలను నెరవేర్చడంలో గవర్నర్లు ఒక సాధనంగా మారారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ రాష్ట్రపతిచే నియమించబడిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో సమాఖ్య స్ఫూర్తికి సంధానకర్త. ముఖ్యమంత్రి సలహా మేరకు పని చేయాల్సి ఉన్నప్పటికీ, “విచక్షణాధికారం” పరిమితుల్లో గవర్నర్ కు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఆనాడు గవర్నర్ వ్యవస్థను రాచరిక వ్యవస్థను పోలిన ‘నామమాత్ర పాలకుని’ మాదిరిగా ఊహించారు. కానీ, అనేక సందర్భాలలో గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతినిధులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వంపై నియమిత వ్యక్తి అధికారం కలిగి ఉండడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే చెప్పాలి. గత కొన్ని దశాబ్దాలుగా గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగానికి గురైన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకేపార్టీ అధికారంలో ఉంటే సరి, వేర్వేరు పార్టీలు ఉన్నప్పుడు గవర్నర్లను కేంద్రం తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటోంది. ఇది రాష్ట్రాల స్వతంత్రతను హరించి, సమాఖ్య నిర్మాణాన్ని బలహీనపరిచేలా చేస్తున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణం సమయంలో గవర్నర్లను కీలకంగా భావించారు. కానీ ఇప్పుడు గవర్నర్ అనే ఒక నియమిత ప్రతినిధి అవసరం లేదన్న భావన బలపడుతోంది.
గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం కాకుండా, సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేయవచ్చా? గవర్నర్ల నియామకానికి ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు, గవర్నర్ పాత్రను కేవలం ప్రతీకాత్మకంగా పరిమితం చేయడం. గవర్నర్ వ్యవహారాలపై పారదర్శకత కోసం పబ్లిక్ ఆడిట్, పార్లమెంటరీ కమిటీ సమీక్షలు అమలులోకి తేవడం వంటివి చేయవచ్చు. అయితే, సమకాలీన రాజకీయాల్లో నైతికత లేకపోవడం, కేంద్రానికి ఎక్కువ అధికారాలుండటం వల్ల ఈ సంస్కరణలు సమర్థవంతంగా అమలవ్వడం అనుమానాస్పదమే. అందుకే, వ్యవస్థను పూర్తిగా తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటున్న మనం గవర్నర్ వ్యవస్థకు సవరణలు తేవడం లేదా రద్దు చేయడం ద్వారా ఖాజానాపై భారం కూడా తగ్గుతుందన్న అభిప్రాయాలు బపడుతున్నాయి.
బెంగాల్లో తీవ్ర వివాదానికి గురైన ధన్‌కడ్ ఉపరాష్ట్రపతి అయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై తిరిగి రాజకీయాల్లో బీజీగా ఉన్నారు. కేరళ గవర్నర్‌గా అరీఫ్ మహ్మద్ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండేది. గతంలో జగదాంబికాపాల్‌ను సీట్లో కూర్చుండబెట్టింది కాంగ్రెసే. ఇప్పుడా ఒరవడిని బీజేపీ కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కూడా బిల్లుల ఆమోదంలో గవర్నర్ల పాత్రను తప్పుపట్టింది. గవర్నర్ల వ్యవస్థ రాజ్‌భవన్లను రాజకీయాలకు వేదికలుగా చేస్తున్నాయి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి.
నిజానికి ఇదంతా రాజ్యాంగబద్ధంగా వ్యవస్థీ కృతమైన లోపం. దీనిపై చర్చించి, రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. లేదా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయడం ఒక్కటే పరిష్కారం కాగలదు. అందుకు ఇదే తగిన సమయం.